1.9 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేయిస్తాం

ABN , First Publish Date - 2021-10-13T13:18:50+05:30 IST

తెలంగాణ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే..

1.9 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేయిస్తాం

కొలువులు ఇచ్చే వరకూ కేసీఆర్‌కు బడితె పూజే!

4000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇప్పిస్తాం

అప్పటి వరకూ కాంగ్రెస్‌ జంగ్‌ సైరన్‌ ఆగదు

ఉద్యమం ముసుగులో పార్టీని విస్తరించుకున్నడు

మంత్రి పదవుల కోసం వైఎస్‌ కాళ్ల వద్ద గులాంగిరీ

కాంగ్రెస్‌ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేసుంటే అక్రమం అనేవారా!?

పాలమూరుకు వెయ్యి కోట్లు కూడా ఇవ్వలేదు

రాష్ట్ర పునర్నిర్మాణంలో పాలమూరుకు స్థానమేదీ!?

పాలమూరు జంగ్‌ సైరన్‌ సభలో రేవంత్‌ ధ్వజం

కృష్ణా జలాల దోపిడీపై తక్షణం అఖిలపక్షం: భట్టి


మహబూబ్‌నగర్‌, జడ్చర్ల(ఆంధ్రజ్యోతి): తెలంగాణ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే వరకూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బడితె పూజ తప్పదని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. ఈ ప్రభుత్వం మెడలు వంచి రూ.4000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయిస్తామని; 1.90 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేయిస్తామని, అప్పటి వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం 14 ఏళ్లు ఉద్యమం సాగితే, దాని ముసుగులో కేసీఆర్‌ తన రాజకీయ పార్టీని విస్తరించుకున్నారని ఆరోపించారు. విద్యావకాశాల కోసం కొత్త కాలేజీలు పెట్టేలా, ఉద్యోగ నియామకాలు కల్పించేలా, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేసేలా ప్రభుత్వం మెడలు వంచేందుకు పాలమూరు గడ్డ నుంచే జంగ్‌ సైరన్‌ ఊదుతున్నామని ప్రకటించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా అమిస్తాపూర్‌ వద్ద మంగళవారం జరిగిన విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌ సైరన్‌ సభకు ముఖ్య అతిథిగా హాజరైన రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.


‘‘2004లో కేంద్రంలో మామ కేసీఆర్‌, రాష్ట్రంలో అల్లుడు హరీశ్‌ సహా అరడజను మంది మంత్రి పదవుల్లో ఉన్నారు. కడప జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా అప్పట్లో టీఆర్‌ఎస్‌ నాయకుడే ఉన్నారు. అప్పుడే పోతిరెడ్డిపాడు పొక్కను పెద్దగా చేసి వందల టీఎంసీల నీళ్లు తరలించుకుపోతుంటే, మంత్రి పదవుల కోసం ఆనాడు మీరు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కాళ్ల వద్ద గులాంగిరీ చేసి నోరు మెదపని విషయం వాస్తవం కాదా..?’’ అని సీఎం కేసీఆర్‌ను నిలదీశారు. ఆనాడు చంద్రబాబుతో కొట్లాడి నాగం జనార్దన్‌ రెడ్డి కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చారని, కిరణ్‌కుమార్‌  రెడ్డితో పోట్లాడి భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌ పథకాలను చిన్నారెడ్డి తెచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ హయాంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను తెలంగాణ రాగానే కేసీఆర్‌ పూర్తి చేసి ఉంటే, ఇప్పుడు ఏపీ సీఎం జగన్‌ వాటిని అక్రమ ప్రాజెక్టులనేందుకు ఆస్కారమే ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. కేవలం వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తే కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌ తదితర ప్రాజెక్టులు పూర్తవుతాయని, పది లక్షల ఎకరాలకు నీరొస్తుందని తెలంగాణ వచ్చిన తర్వాత ఏర్పడిన తొలి అసెంబ్లీలో వంశీచంద్‌ రెడ్డి దణ్ణం పెట్టి వేడుకున్నా కనికరించలేదని మండిపడ్డారు.


‘‘తెలంగాణ సాధన కోసమంటూ 16 మంది ఎమ్మెల్యేలను, నలుగురు ఎంపీలను రాజీనామా చేయిస్తే, 2008లో వచ్చిన ఉప ఎన్నికల్లో సమైక్యవాదంతో మీరు చేసుకున్న చీకటి ఒప్పందాన్ని గుర్తించిన ప్రజలు 9 మంది ఎమ్మెల్యేలను, ఇద్దరు ఎంపీలను నేలకేసి కొట్టారు. 2009లో టీడీపీ పొత్తులో 48 ఎమ్మెల్యే, 9 ఎంపీ సీట్లకు పోటీ చేస్తే 35 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు డిపాజిట్లు లేకుండా చేశారు. అప్పుడే.. నిండు సభలో ఈటల రాజేందర్‌ను ఉద్దేశించి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ‘నీ తల ఎక్కడ పెట్టుకుంటావ్‌ రాజేంద్రా!’ అని అన్నప్పుడు నీ పౌరుషం ఎక్కడకు పోయింది!?’’ అని సీఎం కేసీఆర్‌ని రేవంత్‌ నిలదీశారు. కరీంనగర్‌లో బొంద పెడతారని గ్రహించిపాలమూరు వస్తే.. ఇక్కడి ప్రజలు భుజాలపై మోసి, రక్తమాంసాలు ఓడ్చి గెలిపించిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పాలమూరు అమాయక బిడ్డలు కేసీఆర్‌ను నమ్మి పార్లమెంటుకు పంపిస్తే, 50 లక్షల మంది గుండెలపై తన్ని పాలమూరును ఎండబెతున్నారని ధ్వజమెత్తారు.


ఆనాడు పాలమూరు బిడ్డ బూర్గుల రామకృష్ణారావు తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అయ్యారని, జైపాల్‌ రెడ్డి ఉత్తమ పార్లమెంటేరియన్‌ అయ్యారని, మల్లికార్జున్‌ గౌడ్‌ కేంద్ర మంత్రి అయ్యారని, ఈనాడు పాలమూరు బిడ్డగా తెలంగాణ రూపురేఖలు మార్చే అవకాశం వచ్చిందని, తనను ఆశీర్వదించాలని కోరారు. సురవరం ప్రతాప రెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, జైపాల్‌  రెడ్డి, మల్లు అనంతరాములు, మల్లికార్జున్‌ గౌడ్‌ వంటి నాయకులు పాలమూరు ప్రతిష్ఠను పెంచితే.. ఇప్పుడు అఽధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పాలమూరు పరువును బజారులో పెడుతున్నారని ఆరోపించారు. గువ్వలోడు, గుడ్డలోడు, ఇసుక దందాలోడు, కబ్జాకోరు, కమీషన్ల కక్కుర్తి పడే వారిగా వారిని అభివర్ణించారు.


పునర్నిర్మాణంలో పాలమూరుకు అగ్రస్థానమేదీ..?

తెలంగాణ ఏర్పాటయ్యాక పునర్నిర్మాణంలో పాలమూరుకే మొదటి తాంబూలమని ఉద్యమ సమయంలో కేసీఆర్‌ హామీ ఇచ్చారని, ఇప్పుడు కనీసం పట్టించుకోవడం లేదని రేవంత్‌ మండిపడ్డారు. పునర్నిర్మాణంలో పాలమూరుకు ఫ్యాక్టరీలు ఎందుకు తేలేదని నిలదీశారు. కాంగ్రెస్‌ హయాంలో పాలమూరులో యూనివర్సిటీ పెడితే, మీ హయాంలో కనీసం నియామకాలు చేపట్టడం లేదని విమర్శించారు. 


కృష్ణా నీళ్లు తెలంగాణకు రాకుండా కేసీఆర్‌ కుట్ర: భట్టి

కృష్ణా నీళ్లు తెలంగాణకు రాకుండా సీఎం కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. కృష్ణా జలాలపై ఏపీ, కేంద్రం చేస్తున్న దోపిడీని అరికట్టేందుకు ఏం చేయాలో నిర్ణయించేందుకు తక్షణం అఖిలపక్షం ఏర్పాటు చేయాలన్నారు. ఏపీలో రాయలసీమ ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగి, రోజుకు 11 టీఎంసీల నీరు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే, ఏడాదిగా నిద్రపోయిన కేసీఆర్‌, ఇప్పుడు తీరిగ్గా పత్రికల్లో ప్రకటనలిస్తున్నారని ఆరోపించారరు. ఈ ఏడేళ్లలో పాలమూరు ప్రాజెక్టును ఎందుకు నిర్మించలేకపోయారని ప్రశ్నించారు.


యువత భవిత కోసం కాంగ్రెస్‌: మధుయాష్కీ గౌడ్‌

తెలంగాణ యువత భవిష్యత్‌ కోసం కాంగ్రె్‌సను బలపరచాలని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధు యాష్కీ గౌడ్‌ కోరారు. రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో కాంగ్రె్‌సకు కొత్త కళ వచ్చిందని, ఇదే ఉత్సాహంతో ఈ 20 నెలలు యువత, నిరుద్యోగులు, ప్రజలు కాంగ్రె్‌సకు అండగా ఉంటే, ఆ తర్వాత 20 ఏళ్లు వారి కోసం కాంగ్రెస్‌ పని చేస్తుందని అన్నారు. 


ఉద్యోగాలు, ఉపాధి కోసం యుద్ధం చేద్దాం: గీతారెడ్డి

ఉద్యోగాలు, ఉపాధి కల్పన కోసం కేసీఆర్‌ ప్రభుత్వంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో యుద్ధం మొదలైందని, ఈ యుద్ధంలో విద్యార్థులు, నిరుద్యోగులు కలిసి రావాలని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జె.గీతారెడ్డి పిలుపునిచ్చారు. 


సభ సక్సెస్‌తో కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఆనందం

పాలమూరులో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సారథ్యంలో మొదటి సారి నిర్వహించిన సభ విజయవంతమవడంతో కాంగ్రెస్‌ నేతల్లో, శ్రేణుల్లో జోష్‌ నెలకొంది. చాలా ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌ హయాంలో ఇంత పెద్ద ఎత్తున సభ విజయవంతం కావడం, ఉమ్మడి జిల్లా నుంచి పెద్దఎత్తున జనం తరలి రావడంతో కాంగ్రెస్‌ నేతల్లో ఉత్సాహం కనిపించింది. 


రేవంత్‌ కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు

జంగ్‌ సైరన్‌ సభకు వెళుతున్న రేవంత్‌ రెడ్డి కాన్వాయ్‌ను జడ్చర్ల క్రాస్‌ రోడ్డు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. రేవంత్‌తోపాటు మధుయాష్కి, భట్టి విక్రమార్క హైదరాబాద్‌ నుంచి జడ్చర్ల మీదుగా బయలుదేరారు. పాలమూరు టౌన్‌ మీదుగా వెళ్లేందుకు అనుమతి లేదంటూ జడ్చర్ల క్రాస్‌ రోడ్డు నుంచి పోలీసులు అడ్డుకున్నారు. జాతీయ రహదారిపై బారికేడ్లను ఏర్పాటు చేశారు. దాంతో, వాటిని తొలగించుకొని, రోడ్డు డివైడర్‌పై నుంచి కాన్వాయ్‌లోని వాహనాలు వెళ్లాయి. ఈ సందర్భంగా హైవేపై 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. దానిలో అంబులెన్స్‌ సైతం ఇరుక్కుపోయింది. మహబూబ్‌నగర్‌లో మరోసారి రేవంత్‌ కాన్వాయ్‌ను అడ్డుకున్నా.. రాంగ్‌ రూట్‌లో ఆయన పట్టణంలోకి ప్రవేశించారు. దీనిపై రేవంత్‌ సభలో మాట్లాడారు. పోలీసులు గుర్తుంచుకోవాలని, ఇప్పుడు ఆటంకాలు కల్పించిన ఒక్కొక్కరి పేరు డైరీలో రాసుకుంటున్నామని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో మీ కథ తేలుస్తామని, విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కేసీఆర్‌ దగ్గర గులాంగిరి చేయడం మానుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్‌ కార్యకర్తల జోలికి వస్తే ఎవరినీ వదలబోమని హెచ్చరించారు.

Updated Date - 2021-10-13T13:18:50+05:30 IST