2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం

ABN , First Publish Date - 2022-02-28T07:58:53+05:30 IST

రాష్ట్రంలో మరో 12 నెలల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రానుందని, వచ్చిన తొలి ఏడాదిలోనే ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం

  • అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే కొలువులిస్తాం
  • ఎన్నికల్లో ఓడిపోతామనే పీకేను తెచ్చుకున్నారు
  • ఎన్నికలకు సిద్ధం.. సర్కారును రద్దు చేసే దమ్ముందా?
  • యూత్‌ కాంగ్రెస్‌లో కొట్లాడినోళ్లకే టికెట్లు: రేవంత్‌ 
  • 78 సీట్లు పక్కా.. తెలంగాణలో మాదే అధికారం
  • కాంగ్రెస్‌కు నష్టం చేసే వారు వెళ్లిపోవచ్చు 
  • పార్టీలో ప్రక్షాళన చేపట్టాం: మాణిక్కం ఠాగూర్‌


హైదరాబాద్‌/నిర్మల్‌, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరో 12 నెలల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రానుందని, వచ్చిన తొలి ఏడాదిలోనే ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి గోల్కొండ కోటపై కాంగ్రెస్‌ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే ప్రగతి భవన్‌ పేరును అంబేడ్కర్‌ భవన్‌గా మారుస్తూ తొలి సంతకం పెడతామని ప్రకటించారు. యూత్‌ కాంగ్రె్‌సలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కొట్లాడిన వారికే వచ్చే ఎన్నికల్లో టికెట్లు వస్తాయని స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పన.. నిరుద్యోగ భృతి వెంటనే అమలు చేయాలన్న డిమాండ్‌తో యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో గాంధీ భవన్‌లో ఆదివారం నిరుద్యోగ నిరశన దీక్ష జరిగింది. యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, ఇతర నేతలు చేపట్టిన ఈ దీక్షను ఉదయం.. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్‌ కుమార్‌ యాదవ్‌, సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి ప్రారంభించారు.


సాయంత్రం రేవంత్‌ రెడ్డి వారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడారు. ఉద్యోగాలు భర్తీ చేస్తానని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ప్రకటించి 8 ఏళ్లయినా, ఇంత వరకు భర్తీ చేయలేదని విమర్శించా రు. రాష్ట్రంలో 1.90 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయంటూ ఇటీవల బిశ్వాల్‌ కమిటీ స్పష్టం చేసిందని గుర్తుచేశారు. తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని, కేసీఆర్‌ మగాడైతే ప్రభుత్వాన్ని రద్దు చేయాలని సవాల్‌ విసిరారు. వచ్చే ఎన్నికల్లో గెలవడం చేతకాక.. కేసీఆర్‌ ప్రశాంత్‌ కిషోర్‌ను తెచ్చుకుంటున్నారని రేవంత్‌ ఎద్దేవా చేశారు. టీపీసీసీ అనుమతిస్తే నిరుద్యోగుల కోసం గాంధీ భవన్‌లో నిరవధిక నిరశన దీక్ష చేస్తానని మాజీ మంత్రి చిన్నారెడ్డి అన్నారు.  రాబోయే బడ్జెట్‌లో నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించాలని, ఉద్యోగాల భర్తీ చేపట్టాలని యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఆమరణ దీక్ష చేపడతానని ప్రకటించారు. సోమవారం నుంచి తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు.


నేతలు సమన్వయంతో వ్యవహరించాలి: ఠాగూర్‌

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 78 సీట్లలో గెలుపొంది అధికారం చేపట్టబోతుందని పార్టీ తెలంగాణ ఇన్‌చార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం నిర్మల్‌లోని రెడ్డి ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఓటర్లు, కాంగ్రెస్‌ కార్యకర్తలు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, అయితే నాయకులు తమ మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి సమన్వయంతో వ్యవహరించాలని కోరారు. పార్టీకి నష్టం చేకూర్చే యోచనలో ఉన్న వారంతా పార్టీని వీడి వెళ్లిపోవచ్చని స్పష్టం చేశారు. కాంగ్రె్‌సను మరింత పటిష్టం చేసేందుకు పార్టీలో ప్రక్షాళన చేపట్టామని తెలిపారు. పార్టీకి నష్టం చేకూర్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  రాష్ట్రంలోని ప్రతీ పోలింగ్‌ బూత్‌లో ఓట్ల శాతా న్ని పెంచాలనే వ్యూహంతోనే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తున్నామని మాణిక్కం ఠాగూర్‌ పేర్కొన్నారు.


టీఆర్‌ఎస్‌ను గద్దె దింపుతాం: భట్టి 

ఖమ్మం, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): ప్రజా తిరుగుబాటుతో ప్రగతిభవన్‌ గేట్లు బద్దలుకొట్టి టీఆర్‌ఎ్‌సను గద్దె దింపుతామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క హెచ్చరించారు. తాను చేపట్టిన పాదయాత్ర మధిర నియోజకవర్గానికే పరిమితంకాదని, ప్రతిపక్ష నేతగా రాష్ట్రంలోని ప్రతి మండలానికీ వెళ్లి కేసీఆర్‌ చేస్తున్న అక్రమాలు, అవినీతిని ప్రజలకు వివరిస్తానని తెలిపారు.  ‘పీపుల్స్‌మార్చ్‌’ పేరుతో ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం యడవల్లి గ్రామం నుంచి ఆదివారం పాదయాత్రకు భట్టి విక్రమార్క శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా యడవల్లి గ్రామంలో జరిగిన సభలో మాట్లాడారు.  


సమన్వయం చేస్తాం.. తొందరొద్దు

తొందరపడి కాంగ్రె్‌సకు రాజీనామా చేయవద్దంటూ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డికి పార్టీ సీనియర్‌ నాయకులు మరోసారి సూచించారు. పార్టీ నాయకులందరం సమన్వయంతో ముందుకు వెళ్లేలా చర్యలు తీసుకుందామని, ఈ అంశంపైన ముఖ్య నేతల సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చిస్తామని జగ్గారెడ్డికి హామీ ఇచ్చారు. రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ టోర్నీ విజేతలకు బహుమతులు అందించే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు సీడబ్ల్యూసీ సభ్యుడు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి తారిఖ్‌ అన్వర్‌ ఆదివారం హైదరాబాద్‌కు వచ్చారు. టీపీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య తారిఖ్‌ అన్వర్‌కు తన నివాసంలో విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వీహెచ్‌తో పాటు ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ మంత్రులు జానారెడ్డి, గీతారెడ్డి, సంభాని చంద్రశేఖర్‌, మర్రి శశిధర్‌రెడ్డి, పార్టీ సీనియర్లు కోదండరెడ్డి, రాములు నాయక్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి రాజీనామా నిర్ణయం అంశం తారిఖ్‌ అన్వర్‌ ముందు ప్రస్తావనకు వచ్చింది. అయితే సొంత పార్టీ నేతలే సోషల్‌ మీడియాలో తనపై దుష్ప్రచారం చేయిస్తున్నారని, నాయకుల మధ్య సమన్వయ లేమి ఉందని తారిఖ్‌ అన్వర్‌కు జగ్గారెడ్డి వివరించారు. ఆ తర్వాత జానారెడ్డి చొరవ తీసుకుని.. తొందర పడొద్దంటూ జగ్గారెడ్డిని వారించినట్లు సమాచారం.  

Updated Date - 2022-02-28T07:58:53+05:30 IST