Praveen Nettaru Murder: బీజేపీ యువనేత హత్య కేసులో ఇద్దరి అరెస్ట్

ABN , First Publish Date - 2022-07-28T23:27:55+05:30 IST

బీజేపీ యూత్ వింగ్ నేత ప్రవీణ్ నెట్టారు (Praveen Nettaru) హత్య కేసుకు సంబంధించి పోలీసుల ఇద్దరు వ్యక్తులను

Praveen Nettaru Murder: బీజేపీ యువనేత హత్య కేసులో ఇద్దరి అరెస్ట్

బెంగళూరు: బీజేపీ యూత్ వింగ్ నేత ప్రవీణ్ నెట్టారు (Praveen Nettaru) హత్య కేసుకు సంబంధించి పోలీసుల ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ప్రవీణ్ ఈ నెల 26న దక్షిణ కన్నడ జిల్లాలోని బెళ్లారె (Bellare)లో హత్యకు గురయ్యారు. ఈ హత్యతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున  ఆందోళనలు జరిగాయి. దీంతో ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.


పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఒకరిని బెల్లారెకు చెందిన మొహమ్మద్ షఫీక్ (27)గా గుర్తించగా, మరొక నిందితుడిని హవేరి జిల్లాలోని సావనూర్‌కు చెందిన జకీర్‌గా గుర్తించారు. వీరిద్దరికీ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (Popular Front of India)తో సంబంధాలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. వారి లక్ష్యం ఏమిటో తెలియరాలేదని ఏడీజీపీ అలోక్ కుమార్ (శాంతి భద్రతలు) తెలిపారు. వారిద్దరినీ కస్టడీలోకి తీసుకున్నట్టు చెప్పారు. వీరిని ప్రశ్నించి అనంతరం మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అన్నారు. 


భారతీయ జనతా పార్టీ (BJP) యువ మోర్చా జిల్లా కార్యదర్శి అయిన ప్రవీణ్ నెట్టారు (32) మంగళవారం రాత్రి బెల్లారెలోని తన పౌల్ట్రీ షాపును మూసేసి ఇంటికి వెళ్తుండగా మోటార్ సైకిలుపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు కత్తులతో పొడిచి హత్య చేశారు. ఈ హత్యతో బీజేపీ యూత్ వింగ్ నేతలు ఆందోళనకు దిగారు. రాష్ట్ర నాయకత్వం సొంతపార్టీ నాయకులను రక్షించడంలో విఫమైందని ఆరోపించారు. అంతేకాదు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్ కుమార్ కారును చుట్టుముట్టిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. 


ఈ హత్య విషయంలో ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై(Basavaraj S Bommai) జోక్యం చేసుకోవడంతో దర్యాప్తు కోసం పోలీసులు ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. మొత్తం 15 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మూడు బృందాలను కర్ణాటకలోని పలు ప్రాంతాలకు పంపారు. అలాగే, నిందితులు ఉపయోగించిన బైక్ కేరళ రిజిస్ట్రేషన్ కావడంతో అక్కడికి కూడా పంపారు. 

Updated Date - 2022-07-28T23:27:55+05:30 IST