చదువుకునేదెలా.?

ABN , First Publish Date - 2022-09-24T21:51:04+05:30 IST

ఫతేనగర్‌ డివిజన్‌ పట్టలబస్తీలోని ప్రభుత్వ పాఠశాల భవవనం శిథిలావస్థకు చేరింది. ఈ నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’లో 2022 జూన్‌ 24న శిథిలావస్థలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో భయం.. భయం శీర్షికతో కథనం

చదువుకునేదెలా.?

ఒకటి నుంచి 5వ తరగతి వరకు ఒకే గది

శిథిలావస్థలో పిట్టలబీస్తీ ప్రభుత్వ పాఠశాల భవనం

కమ్యూనిటీ హాలులోకి మార్చినా  వెంటాడుతున్న సమస్యలు 


ఫతేనగర్‌, హైదరాబాద్, సెప్టెంబర్‌ 22(ఆంధ్రజ్యోతి): ఫతేనగర్‌ డివిజన్‌ పట్టలబస్తీలోని ప్రభుత్వ పాఠశాల భవవనం శిథిలావస్థకు చేరింది. ఈ నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’లో 2022 జూన్‌ 24న శిథిలావస్థలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో భయం.. భయం శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన కార్పొరేటర్‌ పండాల సతీ్‌షగౌడ్‌ పాఠశాలకు పక్కా భవనం కట్టే వరకు పాఠశాలను తాత్కాలికంగా బస్తీ కమ్యూనిటీ హాలులోకి మార్చాలని స్కూలు హెచ్‌ఎంకు సూచించారు. ఈ మేరకు 10 రోజుల క్రితం పాఠశాలను కమ్యూనిటీ హాలులోకి మార్చారు. పాఠశాలను శిథిల భవనం నుంచి కమ్యూనిటీ హాలులోకి మార్చినప్పటికీ సమస్యలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి.


కమ్యూనిటీ హాలు చుట్టూ చెత్తాచెదారం

ఈ కమ్యూనిటీ హాలులో గతంలో చిరు వ్యాపారులు ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి తదితర వాటిని భద్రపర్చేందుకు గోడౌన్‌గా వాడుకునే వారు. దీంతో కమ్యూనిటీ హాలుతోపాటు పరిసరాలు చెత్తాచెదారంతో నిండి పోయాయి. కమ్యూనిటీ హాలులో ఉన్న ఒకే ఒక గదిలో ఒకటి నుంచి 5వ తరగతి వరకు మొత్తం 72 మంది విద్యార్థులను ఒకేచోట కూర్చోబెట్టి బోధిస్తున్నా రు. మరుగుదొడ్ల సదుపాయం లేకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.


ప్రమాదభరితంగా కరెంటు తీగలు 

కమ్యూనిటీ హాలులో తోపుడు బండ్లను గోడకు నిలబెట్టడంతో అటుగా విద్యార్థులు ఎవరైనా వెళ్లితే మీదపడే ప్రమాదం ఉందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కమ్యూనిటీ హాలు వద్ద ఉన్న కరెంటు స్తంభానికి తెగిన కరెంటు తీగలు, మూతలు లేని ఫ్యూజ్‌ బాక్స్‌లు ప్రమాదభరితంగా ఉన్నాయని, ఇలాంటి పరిస్థితిలో చదువు ఎలా ముందుకు సాగుతుందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. 


72 మందికి ముగ్గురు టీచర్లే..

ఒకటి నుంచి 5వ తరగతి వరకు మొత్తం 72 మంది విద్యార్థులను ఒకే గదిలో కూర్చోబెడుతున్నారని, ముగ్గురు టీచర్లే ఉన్నారని ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు ఎలా చదువుతారని వారి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఈ కారణాల వల్ల పిల్లలను పాఠశాలకు పంపడమే మానేశామని స్థానికులు కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన అధికారులు ప్రజా ప్రతినిఽధులు స్పందించి బస్తీలోని ప్రభుత్వ పాఠశాలకు పక్కాభవనాన్ని నిర్మించి విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా కల్పించాలని వారి తల్లి తండ్రులు, ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేస్తున్నారు. 


మా పాఠశాలకు పక్కా భవనాన్ని కట్టించండి

కమ్యూనిటీ హాలులో చదువుకునేందుకు సరైన వాతావరణం లేదు. మా పాఠశాలకు పక్కా భవనాన్ని త్వరగా కట్టివ్వండి.

- శివాని, 5వ తరగతి


ప్రశ్నార్థకంగా విద్యార్థుల భవిష్యత్‌

పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో విద్యార్థుల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే పాఠశాల భవనాన్ని నిర్మించాలి.

- లత, విద్యార్థి తల్లి, పిట్టలబస్తీ, ఫతేనగర్‌  



Updated Date - 2022-09-24T21:51:04+05:30 IST