అరాచకపాలన అంతానికి తొలి అడుగు వేయండి!

ABN , First Publish Date - 2021-04-11T04:33:13+05:30 IST

‘‘వైసీపీ అరాచకపాలన అంతానికి తొలి అడుగు తిరుపతి నుంచే మొదలవ్వాలి. ఉప ఎన్నికలో పనబాక లక్ష్మిని గెలిపించండి.’’ అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

అరాచకపాలన అంతానికి   తొలి అడుగు వేయండి!
బహిరంగ సభలో మాట్లాడుతున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

తమ్ముళ్లూ, చెల్లెళ్లూ ఆలోచంచండి

రాష్ట్రాన్ని రక్షించేందుకు నడుం బిగించండి

సూళ్లూరుపేట సభలో టీడీపీ అధినేత చంద్రబాబు


సూళ్లూరుపేట, ఏప్రిల్‌ 10 : ‘‘వైసీపీ అరాచకపాలన అంతానికి తొలి అడుగు తిరుపతి నుంచే మొదలవ్వాలి. ఉప ఎన్నికలో పనబాక లక్ష్మిని గెలిపించండి.’’ అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సూళ్లూరుపేటలో  శనివారం రాత్రి ఆయన రోడ్‌షో నిర్వహించి, బహిరంగ సభలో మాట్లాడారు. ‘‘వైసీపీ నేతలు ఓటుకు 1000, 2000, అవసరమైతే 5వేలు ఇస్తారు. మీరు అమ్ముడుపోతారా కష్టాలు కొనితెచ్చుకుంటారా తెలుసుకోండి. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అందరూ నడుంబిగించండి. తిరుపతి ఉప ఎన్నికల్లో పనబాక లక్ష్మిని గెలిపించి ఈ అరాచకపాలన అంతానికి తొలి అడుగు వేయండి.’’ అని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడుస్తున్న మహానుభావుడు ఈ జగన్‌రెడ్డి అంటూ నాడు-నేడు రాష్ట్ర పరిస్థితిని ప్రజలకు వివరించారు.‘అమ్మఒడి అంటూ 15వేలు ఇస్తూ నాన్న బుడ్డీకి 30వేలుకు దోచుకోవడం ఈ ముఖ్యమంత్రి నిర్వాకమని చెప్పారు. సొంత బ్రాండ్‌ మద్యంతో ప్రజలను దోచుకుంటున్నాడని విమర్శించారు. 


 పంచపాండవుల్లా పోరాటం చేస్తాం


‘‘పార్లమెంట్‌లో ముగ్గురు ఎంపీలు ఉన్నాం, రాజ్యసభ ఎంపీ ఒకరు ఉన్నారు. అయినా రాష్ట్రం కోసం కేంద్రంతో అలుపెరగని పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు పనబాక లక్ష్మిని గెలిపించి మాకు మరీంత బలాన్ని చేకూర్చండి. పంచపాండవుల్లా కేంద్రంపై పోరాడుతాం’’ అంటూ ఎంపీ రామమోహన్‌నాయుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పారాసెట్మాల్‌ మాత్ర వేసుకుంటే కరోనా రాదని అన్న జగన్‌ నేడు తిరుపతి ప్రచారానికి వచ్చేందుకు కరోనా అని సాకుచెప్పడం విచిత్రంగా ఉందని విమర్శించారు. అప్పుల ఊబిలో కూరుకుపోతున్న ఈ రాష్ట్రాన్ని రక్షించేందుకు చంద్రబాబు ప్రస్తుతం అవసరమన్న విషయం ప్రజలు గుర్తించాలని రాజ్యసభ సభ్యుడు కనకమేడల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 


జగన్‌ కాళ్లువత్తే వ్యక్తి కావాలా!?


రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని నిలదీసేందుకు పనిచేసే పనబాక లక్ష్మి అవసరమా.. లేదా జగన్‌మోహన్‌రెడ్డికి పాదసేవ చేసుకునే వ్యక్తి అవసరమా అన్న విషయం ప్రజలే నిర్ణయించుకోవాలని ఎంపీ గల్లా జయదేవ్‌ అన్నారు. రాష్ట్రంలో వైసీపీ పాలన ఇలాగే కొనసాగితే వీరు రాష్ట్రాన్నే అమ్మేస్తారని అలా కాకుండా ఉండాలంటే తిరుపతి ఉప ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీకి విజయం చేకూర్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు.  ఈ సభలో ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు పరసారత్నం, నెలవల సుబ్రహ్మణ్యం, పీవీ ఆంజనేయులు, హనుమంతరావుచౌదరి, స్థానిక నాయకులు వేనాటి సతీ్‌షరెడ్డి, కామిరెడ్డి మురళీరెడ్డి, చిట్టేటి పేరుమాల్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-04-11T04:33:13+05:30 IST