1న అడివివరం సొసైటీ పాలకమండలి ఎన్నికలు

ABN , First Publish Date - 2022-08-18T06:24:02+05:30 IST

జీవీఎంసీ పరిధి ఐదు మండలాల్లో విస్తరించి ఉన్న అడివివరం సహకార పరపతి సంఘం పాలకమండలి ఎన్నికలు సెప్టెంబరు 1న నిర్వహిస్తున్నట్టు ఎన్నికల ప్రత్యేక అధికారి ఎం.శ్యామల ప్రకటించారు.

1న అడివివరం సొసైటీ పాలకమండలి ఎన్నికలు
సొసైటీ పాలనా భవనం

అదే రోజు ఓట్ల లెక్కింపు ఫలితాలు ప్రకటన

24న నామినేషన్లు...25న ఉపసంహరణ

సింహాచలం, ఆగస్టు 17: జీవీఎంసీ పరిధి ఐదు మండలాల్లో విస్తరించి ఉన్న అడివివరం సహకార పరపతి సంఘం పాలకమండలి ఎన్నికలు సెప్టెంబరు 1న నిర్వహిస్తున్నట్టు ఎన్నికల ప్రత్యేక అధికారి ఎం.శ్యామల ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఆరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నరసింహ సదన్‌ (పుష్కరిని సమీపం)లో పోలింగ్‌ నిర్వహిస్తారు. సంఘం జారీ చేసిన గుర్తింపు కార్డుతో వచ్చిన వారిని మాత్రమే ఓటింగ్‌కు అనుమతిస్తారు. 


అదేరోజు సాయంత్రం ఐదు గంటల తర్వాత  ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటిస్తారు. పోటీ చేయదలచిన ఎస్సీ, ఎస్టీ సభ్యులు రూ.వంద, బీసీలు రూ.200, ఇతరులు రూ.400 డిపాజిట్‌గా చెల్లించి ఈనెల 24న ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య సంఘ ప్రధాన కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేయాలి. 25న నామినేషన్లు పరిశీలన, 26న ఉపసంహరణ అనంతరం నోటీసు బోర్డులో బరిలో నిలిచిన అభ్యర్థుల పేర్లు, వారి గుర్తులు ఉంచుతారు.


 రహస్య ఓటింగ్‌ విధానంలో సంఘం బైలా ప్రకారం 13 మంది పాలకమండలి సభ్యులను ఎన్నుకుంటారు. వీరిలో చినగదిలి మండలం నుంచి 9 మంది, విశాఖ అర్బన్‌ నుంచి ఇద్దరు, గాజువాక, పెందుర్తి మండలాల నుంచి ఒక్కొక్క డైరెక్టర్‌ను ఎన్నుకుంటారు. ఎన్నికైన డైరెక్టర్లు తమలో ఒకరిని అధ్యక్షునిగా ఎన్నుకుంటారు. భర్తీకాని డైరెక్టర్‌ స్థానాలను సెప్టెంబరు 3న కో ఆప్షన్‌ విధానంలో భర్తీ చేస్తారు. 


ఇప్పటికే ఓటరు జాబితా నోటీసు బోర్డులో ఉంచామని, నామినేషన్‌ పత్రాలు సంఘ కార్యాలయం నుంచి ఉచితంగా పొందవచ్చునని ఎన్నికల అధికారి ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-08-18T06:24:02+05:30 IST