బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో అపూర్వ ఘట్టం

ABN , First Publish Date - 2020-05-31T22:59:41+05:30 IST

ప్రపంచ క్రికెట్‌లో బంగ్లాదేశ్ జట్టుకు ప్రత్యేక స్థానముంది. పసికూనగా క్రికెట్‌లోకి అడుగుపెట్టినా బెబ్బులిలా అగ్రజట్లను గడగడలాడించిన ఘనత ఆ జట్టు సొంతం.

బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో అపూర్వ ఘట్టం

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ క్రికెట్‌లో బంగ్లాదేశ్ జట్టుకు ప్రత్యేక స్థానముంది. పసికూనగా క్రికెట్‌లోకి అడుగుపెట్టినా బెబ్బులిలా అగ్రజట్లను గడగడలాడించిన ఘనత ఆ జట్టు సొంతం. ఆస్ట్రేలియా, పాకిస్థాన్, భారత్ లాంటి అగ్రశ్రేణి జట్లను ఓడించింది. సంచలనాలకు ప్రతిరూపంగా నిలిచే బంగ్లా.. ప్రత్యర్థులకు ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. బంగ్లాజట్టు సత్తా ప్రపంచానికి తెలిసిన రోజు 1999 మే 31. సరిగ్గా ఇదే రోజు బంగ్లా ఆటగాళ్లు తమ ఉనికిని చాటుతూ అపూర్వ విజయం సాధించారు. ఈ విషయాన్ని ఐసీసీ తమ ట్విట్టర్‌లో పేర్కొంటూ... బంగ్లా స్టన్నింగ్ పెర్ఫామెన్స్‌ అని ప్రశంసించింది.




1999 వరల్డ్ కప్‌లో అది 29వ మ్యాచ్. టోర్నమెంట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. క్రికెట్‌లో అడుగు పెట్టిన బంగ్లాదేశ్‌కు అది తొలి వరల్డ్ కప్. టోర్నమెంట్‌లో పాకిస్థాన్‌తో తలపడాల్సిన సందర్భం వచ్చింది. టాస్ గెలిచిన పాక్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో సక్లయిన్ ముస్తాక్ 35 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీసుకోగా, వకార్ యునీస్ రెండు వికెట్లు, వసీం అక్రమ్, అఫ్రీది చెరో వికెట్ తీసుకున్నారు. ఇక పాకిస్థాన్‌కు విజయం నల్లేరుపై నడకే అనుకున్నారు. అయితే అక్కడే అద్భుతం చోటు చేసుకుంది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పాక్ జట్టును 161 పరుగులకే కట్టడి చేసి 62 పరుగుల తేడాతో అపురూపమైన విజయాన్ని బంగ్లా జట్టు సొంతం చేసుకుంది. బంగ్లా బౌలర్ ఖలీద్ మహ్మద్ 31 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. అంతేకాదు అంతకుముందు బ్యాటింగ్‌లో 34 బంతులాడి 27 పరుగులు చేశాడు. దీంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకున్నాడు. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడటం వల్లే తాము విజయం సాధించామని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఖలీద్ మహ్మద్ తెలిపాడు. 42కే 5 వికెట్లు కోల్పోయిన పాక్ జట్టు తీవ్ర ఒత్తిడిలో మునిగిపోయిందని.. తర్వాత కోలుకోవడం కష్టంగా మారిందని చెప్పుకొచ్చాడు. 

Updated Date - 2020-05-31T22:59:41+05:30 IST