కోర్టులో కేసున్నా పదోన్నతులా?

ABN , First Publish Date - 2022-09-25T07:49:02+05:30 IST

1999 గ్రూప్‌-2 నోటిఫికేషన్‌కు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రెవెన్యూశాఖ ఆమలు చేయడం లేదన్న ఆరోపణులు వస్తున్నాయి.

కోర్టులో కేసున్నా పదోన్నతులా?

  • సుప్రీం కోర్టు ఉత్తర్వులు బేఖాతర్‌ చేస్తారా? 
  • 1999 గ్రూప్‌-2 రెవెన్యూ అధికారుల ఆవేదన 
  • సీఎస్‌ ఆదేశాలను అమలు చేయని సీసీఎల్‌ఏ

హైదరాబాద్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): 1999 గ్రూప్‌-2 నోటిఫికేషన్‌కు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రెవెన్యూశాఖ ఆమలు చేయడం లేదన్న ఆరోపణులు వస్తున్నాయి. నాటి నోటిఫికేషన్‌ ద్వారా వివిధ ఉద్యోగాలకు ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ వచ్చిన ఫిర్యాదుపై కోర్టు విచారణ జరిపి 2015లో తీర్పును వెలువరించింది. సవరించిన జాబితా ప్రకారం ఉద్యోగాలు, సీనియారిటీ, పదోన్నతులు కల్పించాలంటూ ఇచ్చిన ఉత్తర్వులను రెవెన్యూ శాఖ బేఖాతర్‌ చేస్తోందంటూ 1999 గ్రూప్‌-2 నోటిఫికేషన్‌కు చెందిన కొందరు రెవెన్యూ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోర్టులో కేసులుండగా పదోన్నతులు ఎలా ఇస్తారంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీపీఎస్సీ 1999లో గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ను జారీచేసింది. ఈ మేరకు 2005లో దాదాపు 2 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసేందుకు అభ్యర్థులను ఎంపిక చేస్తూ జాబితాను రూపొందించారు. అయితే ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు దాదాపు 15 ఏళ్ల పాటు హైకోర్టు, సుప్రీం కోర్టులో కొనసాగింది. దీన్ని విచారణ చేసేందుకు వివిధ కమిషన్లను నియమించారు.


 ఆ కమిషన్లనివేదిక ఆధారంగా సుప్రీం కోర్టు చివరగా ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను సవరించాలంటూ 2015లో తుదితీర్పును వెల్లడించింది. ఆ మేరకు ఏపీపీఎ్‌ససీ 2018లో సవరించిన కొత్త అభ్యర్థుల జాబితాను రూపొందించింది. దీంతో.. ఎక్సైయిజ్‌ ఎస్సైగా ఎంపికైన అభ్యర్థికి డిప్యూటీ తహశీల్దారుగా.. డిప్యూటీ తహశీల్దారుగా ఎంపికైన అభ్యర్థికి కో-ఆపరేటివ్‌ సబ్‌రిజిస్ట్రార్‌గా ఇలా వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న వారి విషయంలో మార్పులు చేర్పులు జరిగాయి. ఆ మేరకు వివిధ శాఖల్లో పనిచేస్తున్న 19 మందిని రెవెన్యూ శాఖలోని డిప్యూటీ తహశీల్దార్లు పోస్టుకు ఎంపిక చేశారు. వీరంతా రెవెన్యూలో డిప్యూటీ తహశీల్దార్లుగా నియామకమయ్యారు. ఈ శాఖలో కొనసాగుతున్న దాదాపు 20 మంది అధికారులు ఇతర శాఖల్లోకి మార్చుతూ ఏపీపీఎ్‌ససీ జాబితాను తయారు చేసింది. ఈ జాబితా ప్రకారం కొందరు ఏపీకి వెళ్తే, మరి కొందరు తెలంగాణలోకి వచ్చారు. ఇలా వచ్చిన వారిలో 2018లో తొమ్మిది మంది అధికారులు, 2021 మరో తొమ్మిది మంది డిప్యూటీ తహశీల్దారులుగా జాయిన్‌ అయ్యారు. అయినప్పటికీ వీరికి పదోన్నతులు ఇవ్వకపోవడంతో మళ్లీ వీరిలో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు 2018 నాటి జాబితా ప్రకారం సర్వీస్‌ సీనియార్టి, సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అర్హులైన అధికారులకు పదోన్నతులు ఇవ్వాలంటూ సీసీఎల్‌ఏను సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. కోర్టు ఉత్తర్వులను ఆమలు చేసేందుకు 6 నెలల గడువివ్వాలంటూ సీసీఎల్‌ఏ కోరింది. ఈ గడువు సెప్టెంబరు 13తో పూర్తయింది. అయినప్పటికీ వీరికి పదోన్నతులు ఇవ్వలేదు. ఆర్డీవో క్యాడర్‌లో ఉండాల్సిన వీరు ప్రస్తుతం డిప్యూటీ తహశీల్దారులుగానే కొనసాగుతున్నారు.

 

కోర్టు స్టేతో కొనసాగుతున్న అధికారులు

2005 నాటి జాబితాలో డిప్యూటీ తహశీల్దార్లుగా ఎంపికైన కొందరు కోర్టు స్టేతో రెవెన్యూశాఖలోనే కొనసాగుతున్నారు. సవరించిన 2018 జాబితా ప్రకారం వీరు వివిధ శాఖల్లోకి వెళ్లాల్సి ఉన్నా వెళ్లలేదు. ప్రస్తుతం వీరంతా దాదాపుగా డిప్యూటీ కలెక్టర్‌ హోదాలో ఉన్నారు. వీరిలో కొందరు తాజాగా ప్రభుత్వం రెండు రోజుల కిందట స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు పొందిన జాబితాలో ఉండటం గమనార్హం.

Updated Date - 2022-09-25T07:49:02+05:30 IST