పంజాబ్‌లో 1996 రిపీట్ అవుతుంది: మాయావతి

ABN , First Publish Date - 2022-02-08T22:18:51+05:30 IST

దేశం కాంగ్రెస్ పార్టీని తిరస్కరించింది. పంజాబ్ ప్రజలు కూడా తిరస్కరించాల. 1996 ఎన్నికల్లో 13 సీట్లలో 11 సీట్లు అకాలీ-బీఎస్పీ కూటమి గెలుచుకుని కాంగ్రెస్ పార్టీని ఓడించింది. ఈసారి కూడా ఓడిస్తుంది..

పంజాబ్‌లో 1996 రిపీట్ అవుతుంది: మాయావతి

చండీగఢ్: కాంగ్రెస్ పార్టీని దేశం తిరస్కరించిందని, కానీ దళిత వ్యక్తి ముఖాన్ని ముందు ఉంచి ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తోందని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి విమర్శించారు. మంగళవారం పంజాబ్‌లోని జలంధర్‌లో శిరోమణి అకాలీ దళ్-బహుజన్ సమాజ్ పార్టీ సంయుక్తంగా నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.


‘‘కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ.. మీరంతా దళిత విరోధులు. మీరంతా పెట్టుబడిదారులు, దోపిడిదారులు. మీకు పీడితులతో పేదలతో శ్రామికులతో ఎలాంటి సంబంధమూ లేదు. నేరుగా ఎన్నికలను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక దళిత వ్యక్తి ముఖాన్ని అడ్డుపెట్టుకుని వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి దలిళ ముఖ్యమంత్రి ఇప్పుడే ఎందుకు గుర్తు వచ్చింది? అధికారంలో ఉండగా ఒక ఎస్సీ వ్యక్తిని సీఎంను చేస్తామని కాంగ్రెస్ పార్టీకి గుర్తు రాలేదు. కానీ సందర్భానుసారంగా సీఎం అయిన చన్నీనే మళ్లీ సీఎం అభ్యర్థిగా ప్రకటించాల్సి వచ్చింది. అకాలీ-బీఎస్‌పీని ఎదుర్కోలేకనే కదా చన్నీని ముందు ఉంచి ఎన్నికలకు వస్తున్నారు?’’ అని మాయావతి విమర్శించారు.


అయితే చన్నీని మరోమారు ముఖ్యమంత్రి చేస్తామని కాంగ్రెస్ చెప్పినప్పటికీ, వారి అవసరం తీరిపోగానే పక్కన పెట్టేస్తారని మాయావతి మండిపడ్డారు. చన్నీ సీఎం అయినప్పటికీ రిమోట్ కాంగ్రెస్ హైకమాండ్ చేతిలో ఉంటుందని, స్వతంత్రంగా చన్నీ ఏమీ చేయడని మాయావతి అన్నారు. ‘‘దేశం కాంగ్రెస్ పార్టీని తిరస్కరించింది. పంజాబ్ ప్రజలు కూడా తిరస్కరించాల. 1996 ఎన్నికల్లో 13 సీట్లలో 11 సీట్లు అకాలీ-బీఎస్పీ కూటమి గెలుచుకుని కాంగ్రెస్ పార్టీని ఓడించింది. ఈసారి కూడా ఓడిస్తుంది’’ అని మాయావతి అన్నారు. ఈ సభలో శిరోమణి అకాలీ చీఫ్ సుఖ్‌బిర్ బాదల్ కూడా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.


నిర్లక్ష్యానికి గురైన వర్గాలను ఉన్నతికి తేవడానికి బాబా కాన్షీరాం, అంబేద్కర్‌లు జీవితాన్ని ధారపోశారు

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, బీఎస్పీ స్థాపకులు కాన్షీరాంలను మాయావతి గుర్తు చేసుకున్నారు. నిర్లక్ష్యానికి గురైన దళితులు, పేదలు, బడుగు బలహీన వర్గాలను ఉన్నతికి తేవడానికి వారిరువురూ తమ జీవితాన్ని ధారపోశారని ఆమె అన్నారు. ఇప్పుడు వారిరువురూ బతికి లేరని, కానీ వారి ఆశయాలను నెరవేర్చే కార్యక్రమంలో ఉన్న బీఎస్పీ ఉందని అన్నారు. స్వాతంత్ర్యం అనంతరం న్యాయశాఖ మంత్రిగా అంబేద్కర్ బాధ్యతలు స్వీకరించినప్పటికీ కాంగ్రెస్ పార్టీలోని ఉన్నత వర్గం ఆయనను సామాజికంగా వెనుకబడిన వర్గాల కోసం పని చేయకుండా అడ్డుకుందని మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్‌కు ఎంతో ఆలస్యంగా భారతరత్న ఇచ్చారని, అలాగే కాన్షీరాం మరణానికి జాతీయ సంతాప దినాన్ని ప్రకటించలేదని మాయావతి అన్నారు. పంజాబ్‌లో అకాలీ-బీఎస్పీ కూటమి అధికారంలోకి వస్తుందని, ఇన్నాళ్లు కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిన వారందరినీ కలుపుకుని సర్వసమాజ శ్రేయస్సు కోసం తమ ప్రభుత్వం పని చేస్తుందని మాయావతి విశ్వాసం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-02-08T22:18:51+05:30 IST