కువైత్ సిటీ: కువైత్ లేబర్ మార్కెట్ గడిచిన ఏడాది కాలంలోనే ఏకంగా సుమారు 2లక్షల మంది ప్రవాస కార్మికులను కోల్పోయినట్లు తాజాగా వెలువడిన లెక్కలు చెబుతున్నాయి. 2020 మార్చి నుంచి 2021 మార్చి వరకు 15 రంగాల్లో లక్ష 99వేల మంది ప్రవాసులు కువైత్ వదిలి వెళ్లినట్లు సమాచారం. దీంట్లో రియల్ ఎస్టేట్ కార్యకలాపాల రంగం అత్యధికంగా 53వేల మంది ప్రవాసులను కోల్పోయింది. ఆ తర్వాత హోల్‌సేల్, రిటైల్, వెహికల్, సైకిల్ రిపేర్ సెక్టార్ 37వేల మంది కార్మికులను కోల్పోయినట్లు నివేదిక చెబుతోంది. ఇక కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి కువైత్‌లో బయటి దేశాల కార్మికులను నియమించుకోవడంపై నిషేధం కొనసాగుతుండడంతో ఏ ఒక్క రంగంలోనూ కార్మికుల సంఖ్య పెరగలేదు.
ఒక్క ఎలక్ట్రిసిటీ, గ్యాస్, స్టీమ్, ఏసీ రంగంలో మాత్రమే 369 కార్మికులు పెరిగారు. అటు నిర్మాణ రంగంలో ఏకంగా 30వేల మంది కార్మికులు తగ్గారు. అలాగే తయారీ ఇండస్ట్రీ కూడా 27వేల మంది ప్రవాస కార్మికులను కోల్పోయింది. రవాణా, స్టోరెజ్ సెక్టార్లో 12వేలు, వ్యవసాయ రంగంలో 10,500 మంది, వసతి, ఆహార సర్వీసుల్లో 8500 మంది, పారిశుధ్యం, నీరు సెక్టార్లో 8వేలు, మైనింగ్, క్వారీలో 5వేలు, ఎడ్యుకేషన్‌లో 2వేల మంది కువైత్ వదిలి వెళ్లారని తాజాగా వెలువడిన నివేదిక పేర్కొంది. ఇలా ఏడాది కాలంలో సుమారు 15 రంగాల్లో 1.99లక్షల మంది ప్రవాస కార్మికులను కువైత్ కోల్పోయింది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కార్యకలాపాల రంగం కార్మికుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నట్లు సమాచారం. ఎందుకంటే ఈ సెక్టార్లోనే 53వేల మంది వలస కార్మికులు తగ్గారు. అటు కువైటైజేషన్‌లో భాగంగా ప్రవాసులకు రెసిడెన్సీ, వర్క్ పర్మిట్ల జారీ విషయంలో కఠిన నిబంధనలు అమలు కావడం కూడా కువైత్‌కు భారీ సంఖ్యలో ప్రవాస కార్మికులు అల్విదా చెబుతున్నారు.