1971 అమరుల జ్యోతికి స్వస్తి

ABN , First Publish Date - 2022-01-22T07:44:29+05:30 IST

ఢిల్లీలోని ఇండియా గేట్‌ వద్ద గడచిన అర్ధ శతాబ్ద కాలంగా వెలుగుతున్న అమరుల జ్యోతికి కేంద్ర ప్రభుత్వం స్వస్తిపలికింది. జాతీయ యుద్ధ స్మారకం(ఎన్‌డబ్ల్యూఎం) వద్ద ఉన్న జ్యోతిలో అమరుల జ్యోతిని....

1971 అమరుల జ్యోతికి స్వస్తి

జాతీయ యుద్ధ స్మారకంలో విలీనం

జ్యోతుల విలీనంపై మిశ్రమ స్పందనలు

కొంతమందికి దేశభక్తి, త్యాగనిరతి అర్థం కావు

మేము మళ్లీ ఆ జ్యోతిని ప్రారంభిస్తాం: కాంగ్రెస్‌


న్యూఢిల్లీ, జనవరి 21: ఢిల్లీలోని ఇండియా గేట్‌ వద్ద గడచిన అర్ధ శతాబ్ద కాలంగా వెలుగుతున్న అమరుల జ్యోతికి కేంద్ర ప్రభుత్వం స్వస్తిపలికింది. జాతీయ యుద్ధ స్మారకం(ఎన్‌డబ్ల్యూఎం) వద్ద ఉన్న జ్యోతిలో అమరుల జ్యోతిని విలీనం చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో, అమరుల జ్యోతికి 400 మీటర్ల దూరంలో ఉన్న యుద్ధస్మారకంలో సైనిక లాంఛనాలతో ఈ చరిత్రాత్మక కార్యక్రమాన్ని సైనికాధికారులు పూర్తి చేశారు. ఇండియా గేట్‌ అమరుల జ్యోతి వద్ద అమరులకు నివాళుల్ని అర్పించి, కాగడాలతో ఆ జ్యోతిని యుద్ధస్మారకం వరకూ తీసుకెళ్లి అందులో విలీనం చేశారు. చీఫ్‌ ఆఫ్‌ ఇంటిగ్రేటెడ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ ఎయిర్‌ మార్షల్‌ బీఆర్‌ కృష్ణ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఇకపై ఇండియా గేట్‌ వద్ద అమరుల జ్యోతి ఉండదని, ప్రజలు తమ నివాళుల్ని ఎన్‌డబ్ల్యూఎం జ్యోతి వద్ద అర్పించవచ్చని సైనికాధికారులు తెలిపారు. 1971 యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత విజయానంతరం, ఆ యుద్ధంలో అసువులు బాసిన సైనికుల జ్ఞాపకార్థం అమర జవాన్‌ జ్యోతిని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఢిల్లీలో ప్రారంభించారు. ఇక జాతీయ యుద్ధ స్మారకాన్ని 2019, ఫిబ్రవరి 25న ప్రధాని మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. 25,942మంది సైనికుల పేర్లను ఇక్కడ గ్రానైట్‌ రాళ్లపై సువర్ణాక్షరాలతో లిఖించారు. ఇవి.. 1947-48 నుంచి గల్వాన్‌ ఉద్రిక్తల వరకూ అమరులైన జవాన్ల పేర్లు. కాగా.. ఈ ఐక్యతపై మాజీ సైనికాధికారుల నుంచి మిశ్రమ స్పందన వెలువడింది. ప్రస్తుతం సైనికుల గౌరవార్థం జరిగే కార్యక్రమాలకు ఎన్‌డబ్ల్యూఎం వేదికగా మారిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంలో తప్పులేదని మాజీ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ వేద్‌ మాలిక్‌ పేర్కొన్నారు. మరోవైపు.. మోదీ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ మాజీ ఎయిర్‌ వైస్‌ మార్షల్‌ మన్మోహన్‌ బహదూర్‌ కోరారు. జ్వాలలను ఏకం చేయడంపై కాం గ్రెస్‌ పార్టీ మండిపడింది. దేశభక్తి, త్యాగనిరతి వంటి వాటిని కొంతమంది అర్థం చేసుకోలేరని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ప్రధానిపై పరోక్ష విమర్శలు గుప్పించారు. తాము మళ్లీ అమర జవాన్‌ జ్యోతిని వెలిగిస్తామని తేల్చిచెప్పారు. కాగా.. జ్యోతులపై బీజేపీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. కొంతమంది ప్రభుత్వాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని.. అమర జవాన్‌ జ్యోతిని తాము ఆర్పడం లేదని ఆ పార్టీ నేతలు సర్దిచెప్పేందుకు యత్నించారు. ఇండియా గేట్‌ వద్ద అమరుల పేర్లు లేని నేపథ్యంలో.. అక్కడ జ్యోతి వెలగ డం కంటే, అమరుల పేర్లు ఉన్న యుద్ధ స్మారకం వద్ద ఉండటమే సరైనదని, అమరుల జ్యోతి యుద్ధస్మారక జ్యోతిలో కొనసాగుతుందని వివరించారు. 

Updated Date - 2022-01-22T07:44:29+05:30 IST