ఒంటరిగా విమానంలో ఇంత పెద్ద సాహసం ఎవరూ చేయలేరేమో!

ABN , First Publish Date - 2022-01-21T19:09:58+05:30 IST

బస్సులోనో, రైళ్లోనో ఒంటరిగా ప్రయాణం చేయాలంటేనే మనలో చాలా మంది భయపడుతుంటారు.

ఒంటరిగా విమానంలో ఇంత పెద్ద సాహసం ఎవరూ చేయలేరేమో!

ఇంటర్నెట్ డెస్క్: బస్సులోనో, రైళ్లోనో ఒంటరిగా ప్రయాణం చేయాలంటేనే మనలో చాలా మంది భయపడుతుంటారు. కానీ విమానంలో వేల కిలోమీటర్లు ప్రయాణించారు బెల్జియంకు చెందిన 19 ఏళ్ల జరా రూథర్‌ఫర్డ్‌. ఇలా ఒంటరిగా 155 రోజుల్లో ఓ బుల్లి విమానంలో ప్రపంచ దేశాలను చుట్టొచ్చారామె. దాంతో గిన్నీస్‌ బుక్ ఆఫ్ వరల్డ్‌ రికార్డు ఆమె సొంతమైంది. అతి చిన్న వయసులో ప్రపంచాన్ని చుట్టొచ్చిన మహిళగా జరా ప్రపంచ రికార్డు నెలకొల్పారు. 155 రోజుల్లో ఏకంగా 52వేల కిలోమీటర్లు ప్రయాణించారు. విభిన్న ఉష్ణోగ్రతల మధ్య 5 ఖండాల్లోని సుమారు 41 దేశాలను సందర్శించారు. ఇలా ఒంటరిగా ఇన్ని రోజుల పాటు కుటుంబానికి దూరంగా ఉంటూ.. ఓ చిన్న విమానంలో ఇంత దూరం ప్రయాణించడం నిజంగా సాహసమే అంటున్నారు విశ్లేషకులు.


వివరాల్లోకి వెళ్తే.. జరా పేరెంట్స్ పైలట్లు కావడంతో ఆమెకు చిన్నతనం నుంచే పైలట్‌గా రాణించాలన్నది కలగా ఉండేది. దీంతో ఆరేళ్ల ప్రాయం నుంచే ఆమె తన కలను సాకారం చేసుకునే పనిలో పడ్డారు. ఆరేళ్లకే చిన్న చిన్న విమానాల్లో ప్రయాణించడం మొదలెట్టారామె. దాంతో 14 ఏళ్లకే సొంతంగా విమానం నడపడంలో పట్టు సాధించారు. ఈ క్రమంలోనే ప్రపంచాన్ని ఒంటరిగా చుట్టి రావాలనే సాహసోపేత నిర్ణయానికి వచ్చారు. అంతే.. ఈ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ఆమె నెమ్మదిగా లక్ష్యం దిశగా పావులు కదిపారు. తన కలను సాకారం చేసుకునేందుకు 2021 ఆగస్టు 18న జరా తన సాహస యాత్రను ప్రారంభించారు. ఒక బుల్లి విమానంలో ప్రపంచ యాత్రకు బయల్దేరారు. మొదట ఆమె ఈ ప్రయాణాన్ని కేవలం మూడు నెలల్లోనే పూర్తి చేయాలని అనుకున్నారు. కానీ ఐదు నెలలు పట్టింది.


ఇలా రెండు నెలలు ఆలస్యం కావడానికి కారణం ఆమెకు ఎదురైన ప్రతికూల వాతావరణ పరిస్థితులు, వీసా సమస్యలు. ఏదైతేనేం 155 రోజుల్లో తన ప్రపంచ యాత్రను పూర్తి చేసుకుని నిన్న(గురువారం) స్వదేశంలోకి అడుగు పెట్టారు. ఇంకేముంది ఇంతటి సాహస యాత్రను ఒంటరిగా పూర్తి చేసిన ఆమెకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. ఆమెకు స్వాగతం పలికేందుకు ఏకంగా బెల్జియం ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన 4 విమానాలు ఎస్కార్టుగా రావడం విశేషం. ఇక స్వదేశంలోకి అడుగు పెట్టిన వెంటనే తల్లిదండ్రులను ముద్దాడి తన సంతోషం వ్యక్తం చేశారు జరా. ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టిరావాలనే తన కల నెరవేరినందుకు జరా రూథర్‌ఫర్డ్‌ ఆనందానికి అవధుల్లేవు. 

Updated Date - 2022-01-21T19:09:58+05:30 IST