బడ్జెట్‌ అప్పుల్లో రూ.19 వేల కోట్ల కోత?

ABN , First Publish Date - 2022-07-06T08:39:15+05:30 IST

ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం సేకరించ తలపెట్టిన అప్పులో దాదాపు రూ.19 వేల కోట్ల దాకా కోత పడొచ్చని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.

బడ్జెట్‌ అప్పుల్లో రూ.19 వేల కోట్ల కోత?

  • అంచనా వేసింది రూ.52,167 కోట్లు
  • రూ.34 వేల కోట్ల దాకా రావొచ్చంటున్న అధికారులు
  • కార్పొరేషన్ల గ్యారంటీ అప్పులు అన్నీ రాకపోవచ్చు!
  • విద్యుత్తు సంస్థలకు రూ.12 వేల కోట్లు వచ్చే చాన్స్‌
  • మరో రూ.3000 కోట్ల అప్పు తీసుకున్న రాష్ట్రం
  • ఈ ఏడాది ఇప్పటిదాకా తీసుకున్న రుణం 10 వేల కోట్లు


హైదరాబాద్‌, జూలై 5 (ఆంధ్రజ్యోతి): ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం సేకరించ తలపెట్టిన అప్పులో దాదాపు రూ.19 వేల కోట్ల దాకా కోత పడొచ్చని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక కార్పొరేషన్ల పేరిట తీసుకోవాలనుకున్న గ్యారంటీ అప్పులకైతే పూర్తిగా మార్గం మూసుకుపోయింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.52,167 కోట్లు అప్పుగా తీసుకోవాలని ప్రభుత్వం బడ్జెట్‌లో పొందుపరచిన సంగతి తెలిసిందే. కానీ.. గత రెండేళ్ల బడ్జెట్‌ అప్పుతోపాటు గ్యారంటీ అప్పులను కూడా ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట పరిధిలోకి తీసుకొస్తామని.. పరిమితికి మించి చేసిన అప్పునంతా లెక్కించి, ఈ ఏడాది బడ్జెట్‌ అప్పుల్లో అంత మేర కోత విధిస్తామంటూ కేంద్రం ఈసారి ఆంక్షల మెలిక పెట్టడంతో రాష్ట్ర అప్పులపై సందిగ్ధత ఏర్పడింది. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధన ప్రకారం జీఎ్‌సడీపీలో 3.5 శాతం మేర.. అంటే రూ.42,728 కోట్ల దాకా ఈ ఏడాది అప్పు చేసేందుకు తెలంగాణకు అర్హత ఉంటుందని రాష్ట్రానికి రాసిన లేఖలో కేంద్రం స్పష్టం చేసింది. 


రాష్ట్ర ప్రభుత్వమేమో రూ.52,167 కోట్ల అప్పును బడ్జెట్‌లో అంచనా వేసింది. అలాగే.. విద్యుత్తు సంస్థల ద్వారా రూ.12,198 కోట్లు, ఇరిగేషన్‌ కార్పొరేషన్‌ ద్వారా రూ.22,675 కోట్ల చొప్పున రూ.34,873 కోట్ల మేర గ్యారంటీ అప్పులను తీసుకోవాలని నిర్ణయించింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది అంచనా వేసిన బడ్జెట్‌ అప్పులో రూ.19 వేల కోట్ల దాకా తగ్గొచ్చని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. రూ.52,167 కోట్లలో రూ.19 వేల కోట్లు తగ్గితే.. రూ.33,167 కోట్ల దాకా (ఇంచుమించు రూ.34 వేల కోట్ల దాకా) అప్పు రావచ్చని వారు వివరిస్తున్నారు. ఇక గ్యారంటీ అప్పుల విషయానికి వస్తే.. ఇరిగేషన్‌ కార్పొరేషన్‌ పేర తీసుకోవాలనుకున్న అప్పు రాకపోవచ్చుగానీ, విద్యుత్తు సంస్థల ద్వారా రూ.12,198 కోట్ల గ్యారంటీ అప్పు లభించే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు ఆశిస్తున్నాయి. విద్యుత్తు సంస్థలకు రుణాలను తిరిగి చెల్లించే సామర్థ్యం ఉండడం, ప్రభుత్వం కూడా నష్ట పరిహారాన్ని చెల్లిస్తుండడంతో అప్పు పుడుతుందని ఆ వర్గాలు చెబుతున్నాయి. 


జీఎ్‌సడీపీ బాగున్నా..

అప్పుల విషయంలో కేంద్రం ఒక్కో రాష్ట్రానికీఒక్కో విధానాన్ని అవలంబిస్తోందని రాష్ట్రప్రభుత్వ పెద్దలు ఆరోపిస్తున్నారు. దేశవ్యాప్తంగా బెస్ట్‌ పెర్‌ఫార్మెన్స్‌ రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని, తమ జీఎ్‌సడీపీ బాగానే ఉందని వివరిస్తున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర ఆర్థిక సంస్థలు సెక్యూరిటీ బాండ్లను తనఖా పెట్టుకుని రాష్ట్రానికి ఆర్బీఐ ద్వారా అప్పులిస్తున్నాయని.. అలాంటప్పుడు మధ్యలో కేంద్ర ప్రభుత్వ పెత్తనమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. 15వ ఆర్థిక సంఘం చెప్పిందన్న ఒకే ఒక పాత చింతకాయ పచ్చడి సిఫారసును పట్టుకుని తెలంగాణపై కేంద్రం కక్ష సాధిస్తోందని టీఆర్‌ఎ్‌సకు చెందిన కీలక ప్రజాప్రతినిధి ఒకరు వివరించారు. పంజాబ్‌ వంటి రాష్ట్రాలు జీఎ్‌సడీపీలో 60 శాతం మేర అప్పులు తీసుకుంటున్నాయని.. తెలంగాణ అప్పులు ఎఫ్‌ఆర్‌బీఎంలో 25 శాతంలోపే ఉంటున్నాయని వెల్లడించారు.


మరో 3 వేల కోట్లు..

సెక్యూరిటీ బాండ్ల తనఖా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం తాజాగా మరో రూ.3000 కోట్ల రుణాన్ని సేకరించింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించిన ఈ-వేలం ద్వారా ఈ అప్పు తీసుకుంది. 21 సంవత్సరాల కాల పరిమితి, 7.91 శాతం వార్షిక వడ్డీతో రూ.1000 కోట్లు, 22 సంవత్సరాల కాల పరిమితి, 7.90 శాతం వడ్డీతో రూ.1000 కోట్లు, 23 సంవత్సరాల కాల పరిమితి, 7.92 శాతం వడ్డీతో మరో రూ.1000 కోట్లు (మొత్తం రూ.3000 కోట్లు) సేకరించింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం సేకరించిన అప్పు రూ.10 వేల కోట్లకు చేరింది.  జూలై నుంచి మొదలైన రెండో త్రైమాసికంలో మొత్తం రూ.9000 కోట్ల అప్పు తీసుకోవాల్సి ఉంది. మంగళవారం రూ.3000 కోట్ల అప్పు తీసుకున్నందున మిగతా రూ.6000 కోట్ల అప్పు సెప్టెంబర్‌ 30లోపు తీసుకోవాల్సి ఉంది. దీనికి ఇండెంట్లు పెట్టాలంటే కేంద్రం నుంచి దశలవారీగా అనుమతులు రావాల్సిందే. 

Updated Date - 2022-07-06T08:39:15+05:30 IST