ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చి.. మూడ్రోజులు ఆఫీసుకు.. ఉద్యోగుల్లో కొత్త టెన్షన్

ABN , First Publish Date - 2020-04-03T19:03:21+05:30 IST

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఒక్కసారిగా కరోనా ప్రకంపనలు మొదలయ్యాయి. ఎంజీఎం ఐసోలేషన్‌ వార్డులో ఉన్న వారిలో 23 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఇందులో వరంగల్‌ నగరానికి చెందినవారే 19 మంది ఉన్నారు. జిల్లా అధికారులు

ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చి.. మూడ్రోజులు ఆఫీసుకు.. ఉద్యోగుల్లో కొత్త టెన్షన్

వరంగల్‌ నగరంలోనే 19 మందికి సోకిన వైరస్‌

శాంపిల్స్‌ పరీక్షల్లో తేలిన చేదు నిజం

అందరూ ఢిల్లీ మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారే...

రోగుల కుటుంబాలను క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించిన అధికారులు

ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరెవరిని కలిశారనే విషయాలపై ఆరా

కరోనా వ్యాధిగ్రస్తుల నివాస ప్రాంతాల్లో భయాందోళనలు

లాక్‌డౌన్‌ను మరింత పకడ్బందీగా అమలు చేస్తున్న అధికారులు

తాజా కేసులతో వరంగల్‌ను రెడ్‌జోన్‌గా ప్రకటించే యోచనలో సర్కారు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఒక్క రోజే 23 మందికి పాజిటివ్‌ నిర్ధారణ


వరంగల్‌ అర్బన్‌ (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఒక్కసారిగా కరోనా ప్రకంపనలు మొదలయ్యాయి. ఎంజీఎం ఐసోలేషన్‌ వార్డులో ఉన్న వారిలో  23 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఇందులో వరంగల్‌ నగరానికి చెందినవారే 19 మంది ఉన్నారు. జిల్లా అధికారులు మాత్రం ఈ వివరాలను అధికారికంగా ధ్రువీకరించడం లేదు. ఢిల్లీ మర్కజ్‌ ప్రార్థనల నేపథ్యంలో ఒక్కసారిగా వరంగల్‌లో కరోనా కలకలం సృష్టించింది. ఢిల్లీ మర్కజ్‌ ఆధ్యాత్మిక సమావేశాలు హాజరైన వారిని గుర్తించిన అధికారులు ఎంజీఎం ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. రెండు రోజుల కిందట నిర్ధారణ కోసం  శాంపిల్స్‌ పంపించారు. వీరిలో ఏకంగా 23మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తెలుస్తోంది. అధికారులు మాత్రం వివరాలు ప్రకటించేందుకు వెనుకాడుతున్నారు. జిల్లా యంత్రాంగం ప్రకటించడమా.. హైదరాబాద్‌ నుంచి ఆరోగ్య శాఖ మంత్రి లేదా ఉన్నతాధికారులు ప్రకటిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.  పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారి కుటుంబ సభ్యులను పెద్ద ఎత్తున ఐసోలేషన్‌ సెంటర్‌లకు పంపించారు. మరికొంత మంది హోమ్‌ క్వారంటైన్‌ చేశారు. పెద్ద ఎత్తున పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి జిల్లా కలెక్టర్‌లు, పోలీస్‌ కమిషనర్‌, జిల్లా ఎస్పీలు పకడ్భందీ ప్రణాళిక రూపొందిస్తున్నారు..


రెడ్‌ జోన్‌

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ఏకంగా 19 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో  లాక్‌ డౌన్‌ మరింత కట్టుదిట్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పాజిటివ్‌ కేసులు నమోదైన వ్యక్తులకు సంబంధించిన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 300 మందిని ఐసోలేషన్‌ సెంటర్‌లకు తరలించారు.  వీరు నివసించే ప్రాంతాల్లో కూడా జన సంచారం లేకుండా చూస్తున్నారు. ఒకే రోజు అర్బన్‌ జిల్లాలో 19 కేసులు నమోదు కావడంతో జిల్లా యంత్రాంగం కరోనా నియంత్రణ  చర్యలను వేగవంతం చేసింది. రాత్రి పూట కర్ఫ్యూ పకడ్భందీగా అమలు చేస్తున్నారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులు కుటుంబ సభ్యులతోనే కాకుండా ఎవరెవరిని కలిశారు.. వారు ఇంకా ఎవరిని కలిశారు.. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఎక్కువ సంఖ్యలో జనం ఉండే శుభ కార్యాలయాలకు వెళ్ళారా.. మసీదుల్లో సామూహిక ప్రార్ధనలకు వెళ్ళారా.. అన్న వివరాలను పూర్తిస్థాయిలో సేకరిస్తున్నారు. మత పరమైన సంప్రదాయాలను పాటించే వారు కావడంతో మూడు పూటల ప్రార్ధనలు చేసుకుంటారు. వ్యక్తిగతంగా కాకుండా ప్రార్థనామందిరాల్లోనే సామూహిక ప్రార్థనలు కొనసాగిస్తారు.. పాజిటివ్‌ వచ్చిన వారు ఎవరెవరూ ఏయే ప్రార్థనా మందిరానికి వెళ్ళారు.. ఆ సమయంలో ప్రార్థన కోసం వచ్చిన వారు ఎంత మంది ఉన్నారన్న సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. 


సాగునీటి శాఖలో పనిచేసే ఒక ఉద్యోగి ఢిల్లీ మర్కజ్‌ సమావేశాలుకు హాజరై వచ్చాడు. కాగా, 18వ తేదీ తర్వాత కూడా అతడు మూడు రోజుల పాటు కార్యాలయానికి వచ్చినట్లు సమాచారం. సహోద్యోగులు ఫిర్యాదు చేయడంతో అతడిని ఎంజీఎం ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. ఈరోజు ఆ ఉద్యోగి కుటుంబ సభ్యులను కూడా ఐసోలేషన్‌ సెంటర్‌కు తరలించారు. అతడి వద్దనే అటెండెన్స్‌ రిజిష్టర్‌ ఉండడంతో తప్పనిసరిగా ప్రతీ ఉద్యోగి అతడి దగ్గరకు వెళ్ళాల్సి వచ్చేది. దీంతో ఆ మూడు రోజుల పాటు అతడితో ఆఫీసుకు హాజరైన వారంతా ఇపుడు వణికి పోతున్నారు. వారి సమాచారం కూడా పోలీసులు సేకరిస్తున్నారు. 


ఇదిలా ఉండగా, వరంగల్‌ నగరంలో కేసుల సంఖ్య ఎక్కువ కావడంతో రెడ్‌ జోన్‌గా ప్రకటించే అవకాశాలున్నాయన్న చర్చ జరుగుతోంది. రెడ్‌జోన్‌గా ప్రకటిస్తే పరిస్థితి ఎలా ఉంటుందని అధికారులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. గతంలో కరీంనగర్‌ నగరంలో ఇండోనేషియా వాసులు సంచరించిన ప్రాంతాన్నిఏకంగా రెడ్‌జోన్‌గా ప్రకటించారు. పెద్ద ఎత్తున వేలాది మందికి పరీక్షలు నిర్వహించారు. ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో రాకపోకలు నిషేధించారు. వరంగల్‌ నగరంలో ఒక ప్రాంతంలో కాకుండా నగరంలోని వివిధ చోట్ల నివాసం ఉంటున్న వారికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో నగరమంతా రెడ్‌జోన్‌గా ప్రకటించే అవకాశం లేదు. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఎక్కువ సంఖ్యలో నమోదైన ప్రాం తాల్లో రెడ్‌జోన్‌గా ఏర్పాటు చేసే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్టు సమాచారం. లేకుంటే ఎక్కడికక్కడ నిషేధిత ప్రాంతాలుగా ప్రకటించి చర్యలు తీసుకునేందుకు అధికారు లు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.


ఐసోలేషన్‌ సెంటర్లకు..

వరంగల్‌, హన్మకొండ, కాజీపేట పట్టణాలకు చెందిన వీరంతా మర్కజ్‌ సదస్సుకు హాజరైన వారే. అధికారికంగా పాజిటివ్‌ కేసుల వివరాలు వెల్లడించకుండానే పోలీసులు మందస్తు చర్యలు తీసుకుంటున్నారు. వారి కుటుంబ సభ్యులను ఐసోలేషన్‌ సెంటర్లకు తరలించారు. హన్మకొండలోని బొక్కలగడ్డ, జులైవాడ, సుబేదారి ప్రాంతాలతో పాటు వరంగల్‌ పట్టణంలోని చార్‌బౌళి, ఎల్‌బీనగర్‌, మండిబజార్‌, రంగంపేట తదితర ప్రాంతాల్లోని వీరి కుటుంబ సభ్యులను ఐసోలేషన్‌ సెంటర్లకు తరలించారు. నర్సంపేట రోడ్‌లోని ఆయుర్వేద ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ సెంటర్‌కు మహిళలు, పిల్లలు దాదాపు 70 మంది వరకు తరలించారు.

Updated Date - 2020-04-03T19:03:21+05:30 IST