జిల్లాలో మూడొందలు దాటేసిన కొవిడ్‌-19 కేసులు

ABN , First Publish Date - 2020-06-03T11:32:53+05:30 IST

జిల్లాలో కొవిడ్‌-19 కేసులు మూడు వందల మార్కు దాటేశాయి. ఆరంభంలో ఒకటీ అరా వచ్చిన కేసులు ..

జిల్లాలో మూడొందలు దాటేసిన కొవిడ్‌-19 కేసులు

ఇందులో గడచిన 13 రోజుల్లోనే 240

 మంగళవారం మరో 37 పాజిటివ్‌లు నిర్ధారణ

 రాజోలు, రావులపాలెం, అమలాపురం, ముమ్మిడివరం, బొమ్మూరు క్వారంటైన్లలో 29 మందికి వైరస్‌

 రాజమహేంద్రవరం సిటీ-5, జి.మామిడాడ-1, పుట్టకొండ-1, పిఠాపురం మండలం కోలంక-1


(కాకినాడ, ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో కొవిడ్‌-19 కేసులు మూడు వందల  మార్కు దాటేశాయి. ఆరంభంలో ఒకటీ అరా వచ్చిన కేసులు ఇప్పుడు రోజుకు 30దాకా నమోదవుతూ అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇటీవల జి.మామిడాడ కొవిడ్‌ మృతుడి ద్వారా కేసులు వందకు పైగా పెరిగాయి. అవికాస్త తగ్గాయని అని ఊపిరి పీల్చుకునేలోగా మళ్లీ క్వారంటైన్‌ కేంద్రాల రూపంలో కొవిడ్‌ బుసలు కొడుతోంది. రోజురోజుకూ ఈ కేంద్రాల్లో పాజిటివ్‌ నిర్ధారణలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా కోనసీమ పరిధిలోని రాజోలు, అమలాపురం, రావులపాలెం, ముమ్మిడివరం ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రాలకు ఇటీవల ముంబయి     నుంచి వచ్చిన వారిలో వైరస్‌ లక్షణాలు అధికంగా కనిపిస్తున్నాయి. దీంతో జిల్లాలో కొవిడ్‌ కేసులు అడ్డుఅదుపు లేకుండా పెరిగిపోతున్నాయి.


మంగళవారం వివిధ ప్రాంతాల్లో నమోదైన 37 పాజిటివ్‌ కేసులతో కలిపి జిల్లాలో కొవిడ్‌ కేసులు 310కి చేరుకున్నాయి. ఇందులో మార్చి 23 నుంచి మే 20 వరకు 63 నమోదవ్వగా, మే 21 నుంచి బుధవారం వరకు అంటే 13 రోజుల్లో ఏకంగా 240 కేసులు పెరిగాయి. మంగళవారం నాటి 37 పాజిటివ్‌ కేసుల్లో 27 కోనసీమలోని అమలాపురం, రావులపాలెం, రాజోలు, ముమ్మిడివరం క్వారంటైన్లలో వెలుగు చూశాయి.


మరోపక్క పిఠాపురం మండలం కోలంకకు చెందిన ఓ ప్రైవేటు నర్సుకు పాజిటివ్‌ వచ్చింది. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలోపనిచేస్తున్న ఈమె ఇటీవల మరో ఆరుగురితో కలిసి ప్రైవేటు వాహనంలో కాకినాడ వచ్చింది. పరీక్ష చేయగా పాజిటివ్‌ రిపోర్టు వచ్చింది.    గొల్లల మామిడాడలో ఒకరికి, ఆ పక్కనే  ఉన్న పుట్టకొండ గ్రామానికి చెందిన మరికరికి పాజిటివ్‌ అని తేలింది. ఇటీవల కొవిడ్‌తో మృతి చెందిన వ్యక్తి  ద్వారా వీరిద్దరికి వైరస్‌ సంక్రమించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. రాజమహేంద్రవరం నగరంలో ఐదు, బొమ్మూరు క్వారంటైన్‌లో ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

Updated Date - 2020-06-03T11:32:53+05:30 IST