జిల్లాలో వెలుగుచూస్తున్న కొవిడ్‌-19 కేసులు

ABN , First Publish Date - 2020-05-28T10:19:35+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ కేసుల పరంపర కొనసాగుతోంది. ప్రతీ రోజూ పెద్ద ఎత్తున పాజిటివ్‌ కేసులు నమోదవుతూనే

జిల్లాలో వెలుగుచూస్తున్న కొవిడ్‌-19 కేసులు

  •  బుధవారం మరో ఏడుగురికి పాజిటివ్‌ నిర్ధారణ
  • జి.మామిడాడలో ఒకే కుటుంబంలో ఐదుగురికి
  • రంజాన్‌ వేడుకకు విజయవాడ నుంచి రాజమహేంద్రవరం వచ్చిన ఇద్దరికి
  • జిల్లాలో మొత్తం 160కి చేరిన కేసుల సంఖ్య
  •  ఇందులో కరోనాతో ఇటీవల మృతి చెందిన వ్యక్తి ద్వారానే 82 మందికి వ్యాప్తి
  • మామిడాడలో 61కి పెరిగిన బాధితులు
  • పాజిటివ్‌ రోగులతో జీఎస్‌ఎల్‌ కిటకిట
  •  కొత్త కేసులన్నీ అమలాపురం కిమ్స్‌కే

(కాకినాడ, ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో కొవిడ్‌ కేసుల పరంపర కొనసాగుతోంది. ప్రతీ రోజూ పెద్ద ఎత్తున పాజిటివ్‌ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. బుధవారం మరో ఏడు కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇందులో మామిడాడలో ఐదుగురు, రాజమహేంద్రవరంలో ఇద్దరు బాధితులను గుర్తించారు. వీరిలో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. మామిడాడలో పాజిటివ్‌ వచ్చిన ఐదుగురూ ఒకే కుటుంబానికి చెందినవారు. ఇటీవల కొవిడ్‌తో మృతి చెందిన వ్యక్తి ద్వారానే వీరందరికీ వైరస్‌ సంక్రమించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. రాజమహేంద్రవరంలో మరో రెండు  కరోనా పాజిటివ్‌  కేసులు నమోదయ్యాయి. రాజమహేంద్రవరం గణేష్‌చౌక్‌-అజాద్‌చౌక్‌ రోడ్డులో రెండో వీధికి చెందిన భార్యభర్తలు వృత్తి రీత్యా విజయవాడలో వుంటున్నారు. వారు రంజాన్‌ వేడుకలో పాల్గొనేందుకు రాజమహేంద్రవరం వచ్చారు. వారికి అనుమానం వచ్చి పరీక్షలు చేయించుకుంటే ఇద్దరికీ పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో జీఎస్‌ఎల్‌లోని అసోలేషన్‌ వార్డుకు తరలించినట్టు నగరపాలక సంస్థ ఎంహెచ్‌వో డాక్టర్‌ వినూత్న తెలిపారు. వారిద్దరూ ఎవరెవరితో కాంటాక్టు అయ్యారో ఆరా తీస్తున్నారు.  దీంతో బుఽధవారం నాటి ఏడు  కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కొవిడ్‌ కేసుల సంఖ్య 160కి చేరింది. సరిగ్గా వారం కిందట మామిడాడకు చెందిన 53ఏళ్ల వ్యక్తి కాకినాడ జీజీహెచ్‌లో మృతి చెందినప్పటి నుంచి కరోనా జిల్లాలో విలయతాండవం చేస్తోంది. జిల్లాలో తొలి కొవిడ్‌ కేసు మొదలైన మార్చి 21 నుంచి ఈ నెల 20వ తేదీ వరకు అంటే రెండు నెలల వ్యవధిలో మొత్తం 61 పాజిటివ్‌లు నమోదవ్వగా... ఈ నెల 20 నుంచి 27 వరకు ఎనిమిది రోజుల వ్యవధిలోనే ఏకంగా 99 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇందులో వైరస్‌తో మృతి చెందిన వ్యక్తి ద్వారా ఏకంగా 82 మందికి కొవిడ్‌ సంక్రమించింది. ఈ 82 కేసుల్లో మృతుడి స్వస్థలమైన మామిడాడలో బాధితులు 61 మంది తేలారు. 


జీఎస్‌ఎల్‌ కిటకిట...

జిల్లాలో వరుసగా పెరుగుతున్న కొవిడ్‌ కేసులతో రాజమహేంద్రవరంలోని జీఎస్‌ఎల్‌ ఆస్పత్రి కిటకిటలాడుతోంది. గడచిన నెల రోజులుగా జిల్లాలో ఎక్కడ పాజిటివ్‌ నిర్ధారణ అయినా సదరు బాధితులను నేరుగా జీఎస్‌ఎల్‌లోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వారం రోజులుగా మామిడాడ కొవిడ్‌ మృతుడి ద్వారా కేసుల సంఖ్య వంద వరకు రావడంతో వారందరినీ జీఎస్‌ఎల్‌కు తరలించారు. దీంతో ప్రస్తుతం జీఎస్‌ఎల్‌లో కొవిడ్‌ బాధితులు 72 మంది అయ్యారు. చేరిన రోగులందరికీ సేవలందించడం వైద్యులకు భారం అవుతుండడంతో బుధవారం కలెక్టర్‌ ఆదేశాలతో కొత్తగా వచ్చే పాజిటివ్‌ కేసులను ఇకపై అమలాపురం కిమ్స్‌కు తరలించాలని నిర్ణయించారు. దీంతో బుధవారం వచ్చిన ఏడు పాజిటివ్‌ల్లో మామిడాడకు చెందిన ఐదుగురిని కిమ్స్‌కు తరలించారు. 

Updated Date - 2020-05-28T10:19:35+05:30 IST