తెలంగాణలో ఇవాళ 5,965 శాంపిల్స్ టెస్ట్ చేస్తే.. ఎన్ని పాజిటివ్‌ వచ్చాయంటే..

ABN , First Publish Date - 2020-07-04T04:51:38+05:30 IST

తెలంగాణపై కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. ఇవాళ ఒక్కరోజే 1,892 కరోనా పాజిటివ్ కేసులు...

తెలంగాణలో ఇవాళ 5,965 శాంపిల్స్ టెస్ట్ చేస్తే.. ఎన్ని పాజిటివ్‌ వచ్చాయంటే..

హైదరాబాద్: తెలంగాణపై కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. ఇవాళ ఒక్కరోజే 1,892 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. శుక్రవారం మొత్తం 5,965 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 4,073 శాంపిల్స్ ఫలితం నెగిటివ్ వచ్చిందని, 1,892 శాంపిల్స్ ఫలితం పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ప్రభుత్వం తెలిపింది. తెలంగాణలో ఒక్కరోజులో ఇన్ని కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.


తెలంగాణలో కొత్తగా నమోదయిన 1,892 కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధిక కేసులు భాగ్యనగరానికి చెందినవే. మొత్తం 1,892 కరోనా కేసులు తెలంగాణ వ్యాప్తంగా నమోదయితే.. వీటిలో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 1,658 కరోనా కేసులు నమోదయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో.. హైదరాబాద్‌వాసుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.


హైదరాబాద్ తర్వాత రంగారెడ్డిలో 56, మేడ్చల్ 44, సంగారెడ్డి 20, కరీంనగర్ 1, మహబూబ్‌నగర్ 12, గద్వాల్ 1, రాజన్న సిరిసిల్ల 6, ఖమ్మం 2, కామారెడ్డి 6, నల్గొండ 13, సిద్దిపేట్ 3, ములుగు 1, వరంగల్ రూరల్ 41, జగిత్యాల 1, మహబూబాబాద్ 7, నిర్మల్ 2, మెదక్ 3, నిజామాబాద్ 3, వరంగల్ అర్బన్ 1, భద్రాద్రి కొత్తగూడెం 4, నాగర్ కర్నూల్ 1, వికారాబాద్ 1, వనపర్తి జిల్లాలో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ప్రభుత్వం బులిటెన్‌లో వెల్లడించింది.


తెలంగాణలో శుక్రవారం కరోనా వల్ల 8 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో.. తెలంగాణలో కరోనా మరణాల సంఖ్య 283కు చేరింది. తెలంగాణలో కరోనా సోకి చికిత్స పొందుతున్న వారిలో 1,126 మంది ఇవాళ కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 20,462కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 9,984.



Updated Date - 2020-07-04T04:51:38+05:30 IST