జాతీయ లోక్‌ అదాలత్‌లో 18,599 కేసులు పరిష్కారం

ABN , First Publish Date - 2022-08-14T05:00:49+05:30 IST

ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని ఆయా కోర్టుల్లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌ కార్యక్రమం ద్వారా మొత్తం 18,599 కేసులు పరిష్కారమయ్యాయి.

జాతీయ లోక్‌ అదాలత్‌లో 18,599 కేసులు పరిష్కారం
సంగారెడ్డి జాతీయ లోక్‌అదాలత్‌ కార్యక్రమంలో కేసులను పరిష్కరిస్తున్న న్యాయమూర్తి సుదర్శన్‌

ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని ఆయా కోర్టుల్లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌ కార్యక్రమం ద్వారా మొత్తం 18,599 కేసులు పరిష్కారమయ్యాయి. మెదక్‌ జిల్లాలో అత్యధికంగా 13,829 కేసులను పరిష్కరించారు.

మెదక్‌ అర్బన్‌/నర్సాపూర్‌, ఆగస్టు 13: రాజీమార్గమే అత్యుత్తమమైనదని, జాతీయ లోక్‌ అదాలత్‌లో భాగంగా మెదక్‌ జిల్లాలో 13,829 పరిష్కరించామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద పేర్కొన్నారు. శనివారం మెదక్‌ కోర్టు అవరణలో జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జూనియర్‌ సివిల్‌ జడ్జి జితేందర్‌, జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కల్పనా, పోలీసు, బ్యాంకు అధికారులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా నర్సాపూర్‌ జూనియర్‌ సివిల్‌ కోర్టులో జడ్జి  కె. అనిత ఆధ్వర్యంలో నిర్వహించిన లోక్‌అదాలత్‌లో పలు కేసులను పరిష్కరించారు. 


సంగారెడ్డి జిల్లాలో..

సంగారెడ్డి అర్బన్‌/నారాయణఖేడ్‌, ఆగస్టు 13: రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవడం ద్వారా ఇరువర్గాలవారికి లాభం చేకూరుతుందని సంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి ప్రధాన న్యాయమూర్తి జి.సుదర్శన్‌ పేర్కొన్నారు. సంగారెడ్డిలోని జిల్లా కోర్టు, నారాయణఖేడ్‌ కోర్టులలో శనివారం జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా  సివిల్‌ కేసులు-41, క్రిమినల్‌ కంపౌండ్‌ కేసులు- 2,761, బ్యాంకు రికవరీ కేసులు-117, ఎంవీవోపీ కేసులు 9, ఇలా జిల్లాలో మొత్తం మీద 2,928 కేసులను పరిష్కరించారు.  కార్యక్రమంలో న్యాయమూర్తులు పుష్పలత, అబ్ధుల్‌ జలీల్‌, హనుమంతరావు, నిర్మల, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆశలత, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. కాగా నారాయణఖేడ్‌ కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో జూనియర్‌ సివిల్‌ జడ్జి ప్రియాంక సిరిసిల్లా మాట్లాడుతూ నారాయణఖేడ్‌లో 360 కేసులు పరిష్కరించినట్టు వివరించారు.


 సిద్దిపేటలో జిల్లాలో..

సిద్దిపేట క్రైం, ఆగస్టు 13:  లోక్‌ అదాలత్‌లో రాజీ ద్వారా కేసులను సత్వరం పరిష్కరించుకోవాలని సిద్దిపేట జిల్లా ప్రిన్సిపల్‌ జడ్జి రఘురాం  సూచించారు. సిద్దిపేట జిల్లా కోర్టులో ఆవరణలో శనివారం  జాతీయ  మెగా లోక్‌అదాలత్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రిన్సిపల్‌ జడ్జి మాట్లాడుతూ.. లోక్‌ అదాలత్‌లో ఇరువర్గాల ఆమోదం ఉంటుంది కాబట్టి ఇద్దరూ గెలిచినట్లుగా భావించాలన్నారు. ఈ జాతీయ మెగా లోక్‌ అదాలత్‌లో 1,842 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాద బాధితులకు ఇన్సూరెన్స్‌ కంపెనీల నుంచి రూ.4,78,500 పరిహారం ఇప్పించినట్లు తెలిపారు.  కార్యక్రమంలో న్యాయమూర్తులు భవాని, సల్మా ఫాతిమా, సంతో్‌షకుమార్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, పత్రి ప్రకాష్‌, న్యాయవాదులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-14T05:00:49+05:30 IST