ఓటు వేయలేదన్న అక్కసుతో..

ABN , First Publish Date - 2021-05-05T05:31:37+05:30 IST

పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి ఓటు వేయలేదన్న అక్కసుతో పిల్లలవలస గ్రామంలో 18 మంది వృద్ధులకు పింఛన్లు నిలిపివేశారు. వలంటీర్లను అడుగుతుంటే వైసీ

ఓటు వేయలేదన్న అక్కసుతో..
కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న బాధితులు





టీడీపీ సానుభూతిపరుల 18 మంది పింఛన్లు కట్‌

ఎంపీడీవో కార్యాలయం ఎదుట బాధితుల బైఠాయింపు

పొందూరు, మే 4: పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి ఓటు వేయలేదన్న అక్కసుతో పిల్లలవలస గ్రామంలో 18 మంది వృద్ధులకు పింఛన్లు నిలిపివేశారు. వలంటీర్లను అడుగుతుంటే వైసీపీ నేతలకు కలవాలని చెబుతున్నారు. సచివాలయ ఉద్యోగులను కలిస్తే పట్టించుకోవడం లేదు. దీంతో బాధితులు మంగళవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఉదయం పది గంటలకే కార్యాలయం వద్దకు చేరుకున్న బాధితులు అక్కడే బైఠాయించారు. ఈ నేపథ్యంలో రంగ అనే వృద్ధుడు అస్వస్థతకు గురయ్యాడు. భోజనం లేకపోవడంతో సృహతప్పి పడిపోయాడు. దీంతో ఆందోళన నెలకొంది. అక్కడున్న వారు సపర్యలు చేయడంతో తేరుకున్నాడు.  మూడు నెలల కిందట పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారు సర్పంచ్‌గా విజయం సాధించారు. అధికార పార్టీకి ఓటు వేయలేదన్న నెపంతో గ్రామంలో ఓ 18 మంది వృద్ధులు, వితంతువులకు పింఛన్లు నిలిపివేశారు. వలంటీర్లను అడుగుతున్నా ఫలితం లేకపోయింది. సచివాలయ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌, పంచాయుతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో బాధితులు ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. ఎంపీడీవో మురళీకృష్ణ స్పందిస్తూ..సచివాలయ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌కు, కార్యదర్శికి కార్యాలయానికి రావాలని ఆదేశించినప్పటికీ సాయంత్రం వరకూ రాలేదు. వేలిముద్రలు పడలేదన్న కుంటిసాకుతో పింఛన్లు నిలిపివేశారని సర్పంచ్‌ పోలినాయుడు ఆరోపించారు. దీనిపై ఉన్నతాధికారులు న్యాయం చేయాలని కోరారు. నిలిచిపోయిన పింఛన్లు అందించేందుకు చర్యలు చేపడతామని ఎంపీడీవో హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. 



Updated Date - 2021-05-05T05:31:37+05:30 IST