పెండింగ్‌లో 18 నెలల నిర్వహణ బిల్లులు

ABN , First Publish Date - 2022-01-17T07:40:29+05:30 IST

నిరాశ్రయుల వసతి గృహాల నిర్వహణ బిల్లులు పెండింగ్‌లో పెట్టడంతో నిర్వాహకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

పెండింగ్‌లో 18 నెలల నిర్వహణ బిల్లులు
చిత్తూరులోని నిరాశ్రయుల వసతి గృహం

నిరాశ్రయుల వసతి గృహాల నిర్వహణ ఎలా?

తీవ్ర ఇబ్బంది పడుతున్న నిర్వాహకులు 


ఏ ఆసరా లేనివారికి, దూరప్రాంతాల నుంచి నగరాలు, పట్టణాలకు వచ్చి రాత్రికి ఇళ్లకు వెళ్లలేని వారికి ఒకపూట భోజనం పెట్టడంతోపాటు అక్కడే నిద్రించడానికి వీలుగా నిరాశ్రయుల వసతి గృహాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం వీటికి సంబంధించిన నిర్వహణ బిల్లులు పెండింగ్‌లో పెట్టడంతో నిర్వాహకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. 


చిత్తూరు: జిల్లావ్యాప్తంగా మొత్తం ఏడు నిరాశ్రయుల వసతి గృహాలున్నాయి. వీటిల్లో.. చిత్తూరు, తిరుపతి నగరపాల సంస్థల పరిధిలో రెండు చొప్పున, మదనపల్లె, శ్రీకాళహస్తి, పుంగనూరు మున్సిపాలిటీల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. వీటి నిర్వహణ కోసం నిధులను ప్రతి నెలా మున్సిపాలిటీలు విడుదల చేయాల్సి ఉంది. కానీ 18 నెలలుగా వీటికి సంబంధించిన నిర్వహణ బిల్లులు పెండింగ్‌లో పెట్టేశారు. దీనివల్ల ఈ కేంద్రాలను నడిపేవారు అప్పులు చేయడమే కాకుండా నిరాశ్రయులకు సరైన ఆహారాన్ని పెట్టలేకున్నారు. ఒక్కో కేంద్రంలో సుమారు 25 మంది నుంచి 30 మంది వరకు ఆశ్రయం పొందుతున్నారు. ఒక్కోసారి 70 మంది వరకు వస్తారని ఓ నిర్వాహకుడు తెలిపారు. ఈ లెక్కన ఏడు సెంటర్లలో రోజుకు 200 నుంచి 300 మంది వరకు ఆశ్రయం పొందుతున్నారు.


పెండింగ్‌ బిల్లులు కోటి రూపాయలపైనే.

నిరాశ్రయుల వసతి గృహంలో ఒక మేనేజర్‌కు రూ.9వేల జీతమివ్వాలి. ముగ్గురు కేర్‌ టేకర్లు ఉంటే ఒక్కొక్కరికి రూ.7వేల చొప్పున రూ.21వేలను ఇస్తారు. కరెంటు, గ్యాస్‌ బిల్లులకు మరో రూ.7వేల వరకు ఖర్చవుతుంది. నాలుగు చోట్ల అద్దె భవనాలుండగా, ఒక్కోదానికి నెలకు సుమారుగా రూ.25వేల వరకు చెల్లించాలి. ఒక్కో కేంద్రానికి సుమారుగా 30 మంది వస్తారనుకుంటే ఒక్కో వ్యక్తికి రోజుకు రూ.50 వరకు ఖర్చవుతుంది. ఈలెక్కన వీరికి నెలకు రూ.45వేలపైమాటే. ఎందుకంటే ఒక్కోరోజు ఈ కేంద్రాలకు ఇంతకంటే ఎక్కువ మంది కూడా వస్తుంటారు. అంటే ఒక్కో కేంద్రానికి నెలకు సుమారుగా ఖర్చు రూ.లక్ష దాటుతోంది. అటువంటిది 18 నెలలుగా ఈ కేంద్రాలకు బిల్లులు మంజూరవలేదు. ఒక్కో కేంద్రానికి రూ.లక్ష లెక్కగట్టినా ఏడు కేంద్రాలకు నెలకు రూ.7లక్షలైతే.. 18 నెలలకు రూ.కోటి దాటుతోంది. 


అప్పులు చేస్తున్న నిర్వాహకులు

బిల్లులు రాకపోవడంతో నిర్వాహకులు అప్పులు చేయాల్సి వస్తోంది. నెల లేదా రెండు నెలలైతే నెట్టుకొచ్చేస్తామని, 18 నెలలుగా బిల్లులు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలనెలా కాకపోయినా మూడు నెలలకు ఓసారైనా బిల్లులను మంజూరు చేయాల్సిన కమిషనర్లు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ చూపి, పెండింగ్‌ బిల్లులను మంజూరు చేసి నిరాశ్రయులను ఆదుకోవాల్సి ఉంది.

Updated Date - 2022-01-17T07:40:29+05:30 IST