టీకా.. చకచకా

ABN , First Publish Date - 2021-09-06T08:05:52+05:30 IST

రోజుకు సగటున దాదాపు 60 లక్షలు.. నెలకు 18 కోట్లు..! గత నెలలో దేశంలో కరోనా టీకా పంపిణీ జోరిది. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనివిధంగా భారత్‌లో ఆగస్టులో రెండుసార్లు రోజుకు కోటిపైగా టీకాలు...

టీకా.. చకచకా

  • ఆగస్టులో 18 కోట్లు టీకాలు
  • జీ-7 దేశాలన్నిటికంటే 8 కోట్లు అధికంగా పంపిణీ
  • గత నెలలో 2 సార్లు ఒక్క రోజులో కోటి టీకాలు
  • ప్రస్తుతం రాష్ట్రాల వద్ద 4.37 కోట్ల డోసుల నిల్వ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 5: రోజుకు సగటున దాదాపు 60 లక్షలు.. నెలకు 18 కోట్లు..! గత నెలలో దేశంలో కరోనా టీకా పంపిణీ జోరిది. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనివిధంగా భారత్‌లో ఆగస్టులో రెండుసార్లు రోజుకు కోటిపైగా టీకాలు పంపిణీ చేశారు. మరికొన్ని రోజులు 80 లక్షల టీకాలు వేశారు. ఫలితంగా ఒక్క నెలలో 18 కోట్ల మందికి వ్యాక్సిన్‌ అందింది. జీ-7 కూటమిలోని.. అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌, యూకే అన్నిట్లో కలిపినా ఆగస్టులో 10 కోట్ల టీకాలే పంపిణీ అయ్యాయని.. వాటితో పోలిస్తే మన దేశంలో 8 కోట్ల టీకాలు అధికంగా ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం ఆదివారం తెలిపింది.  ఇక శనివారం 72 లక్షల మందికి టీకా ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రాల వద్ద 4.37 కోట్ల డోసులున్నాయి. త్వరలో 1.56 కోట్ల టీకాలు అందనున్నాయి.


కేరళలో ఆంక్షలు కొనసాగింపు

కరోనా అదుపులోకి రాని నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ, ఆదివారం పొడిగించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. జూలైలో కేరళ శని, ఆదివారాలు లాక్‌డౌన్‌ అమలు చేసింది. బక్రీద్‌, ఓనమ్‌ పండుగల నేపథ్యంలో ఎత్తివేసింది. ఓనమ్‌ తర్వాత కేసులు మరింత పెరగసాగాయి. దీంతో మళ్లీ ఆదివారాలు లాక్‌డౌన్‌ కొనసాగించాలని ఆగస్టు చివరి వారంలో నిర్ణయించింది. రాత్రి కర్ఫ్యూనూ ప్రకటించింది. ఇప్పుడు ఈ రెండింటినీ కొనసాగించనుంది. కాగా, దేశంలో శనివారం 42,766 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. 308 మంది చనిపోయారు. ఇందులో కేరళ కేసులే 29 వేలపైగా ఉన్నాయి. దాదాపు సగం మరణాలు కేరళ (142)లోనే సంభవించాయి. క్రితం రోజుకంటే యాక్టివ్‌ కేసులు 5 వేలు పెరిగాయి. ప్రస్తుతం 4.10 లక్షల యాక్టివ్‌లున్నాయి. శనివారం 17.47 లక్షల పరీక్షలు చేశారు. పాజిటివ్‌ రేటు 2.45కు చేరింది. మరోవైపు, ఆగ్నేయ ఆసియా, ఆఫ్రికా దేశాల్లో నకిలీ కొవిషీల్డ్‌ టీకాలను గుర్తించామంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించిన నేపథ్యంలో భారత్‌ అప్రమత్తమైంది. దేశంలో వ్యాక్సినేషన్‌కు వినియోగిస్తున్న కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌, స్పుత్నిక్‌-వి టీకా బాటిళ్లు చూడటానికి ఎలా ఉంటాయి? వాటిలో నకిలీలను ఎలా గుర్తించాలి ? అనే దానిపై కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. 



మూడ్రోజులే గణేశ్‌ ఉత్సవాలు

కొవిడ్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా గణేశ్‌ ఉత్సవాలపై రాష్ట్ర ప్రభుత్వాలు ఆచితూచి వ్యవహరిస్తున్న తరుణంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులపాటు ఉత్సవాలు జరుపుకొనేందుకు అవకాశం కల్పించింది. జిల్లా యంత్రాంగాలు సూచించిన స్థలంలోనే విగ్రహాలను నిమజ్జనం చేయాల్సి ఉంటుంది.


Updated Date - 2021-09-06T08:05:52+05:30 IST