17,336 ఒక్కరోజులోనే కొవిడ్‌ కొత్త కేసులు

ABN , First Publish Date - 2022-06-25T08:55:14+05:30 IST

దేశంలో గురువారం ఒక్కరోజే 17,336 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. గత నాలుగు నెలల్లో నమోదైన రోజు వారీ కేసుల్లో ఇవే అత్యధికమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది.

17,336  ఒక్కరోజులోనే కొవిడ్‌ కొత్త కేసులు

4 నెలల రోజువారీ కేసు నమోదులో ఇదే అధికం

దేశంలో 13 తాజా మరణాలు: కేంద్రం

కొవిడ్‌ సీజనల్‌ వ్యాధిగా స్థిరపడుతోంది..

ఆ క్రమంలో కేసుల్లో హెచ్చుతగ్గులు సాధారణమే

కేసుల పెరుగుదలపై ఆందోళన వద్దన్న నిపుణులు’


న్యూఢిల్లీ, జూన్‌ 24 : దేశంలో గురువారం ఒక్కరోజే 17,336 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. గత నాలుగు నెలల్లో నమోదైన రోజు వారీ కేసుల్లో ఇవే అత్యధికమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. రోజువారీ కేసులకు సంబంధించి రికార్డుస్థాయిలో 30% పెరుగుదల కనిపించడం కలవరపరుస్తోంది. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 4,33,62,294కి చేరింది. కొత్తగా 13 మరణాలు సంభవించగా.. మృతుల సంఖ్య 5,24,954కి చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు రికార్డు స్థాయిలో 4.32గా నమోదైందని కేంద్రం తెలిపింది. యాక్టివ్‌ కేసులు 88,284కి చేరగా.. రికవరీ రేటు 98.59ుగా ఉంది. ఇప్పటివరకు 196.77 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు ఇచ్చారు. కాగా, ఏదైనా వ్యాధి మహమ్మారి స్థాయి నుంచి సీజనల్‌ వ్యాధిగా స్థిరపడే క్రమంలో కేసుల పెరుగుదలలో హెచ్చుతగ్గులు సహజమేనని ఢిల్లీ ఎయిమ్స్‌ సీనియర్‌ డాక్టర్‌ సంజయ్‌ రాయ్‌ అభిప్రాయపడ్డారు. దేశంలో శుక్రవారం ఒక్క రోజే అత్యధిక సంఖ్యలో కొవిడ్‌ కేసులు వెలుగుచూడటాన్ని ఉదహరిస్తూ.. ఈ అంశంలో ఆందోళన చెందనక్కర్లేదని అంటున్నారు. ఈ పెరుగుదల దేశంలో కొన్ని జిల్లాలకే పరిమితమైన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. మాస్కులు ధరించకపోవడం, ప్రయాణాలు పెరగడం, బూస్టర్‌ డోసులు తీసుకోకపోవడం వంటివి ఈ పెరుగుదలకు కారణాలు కావొచ్చని అంటున్నారు. వ్యాధి తీవ్రత, మరణాలు, ఆస్పత్రుల్లో చేరికల్లో అసాధారణ పెరుగుదల కనిపించనంత వరకు ఆందోళన అక్కర్లేదన్నారు. 81 ఏళ్ల వయసులో వ్యాక్సిన్‌తో పాటు బూస్టర్‌ డోస్‌ కూడా తీసుకున్నానని, అందుకే కొవిడ్‌ బారిన పడినా తనకేమీ కాలేదని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్‌ ఆంథోని ఫౌచీ అన్నారు. 


చిన్నారుల్లో కొవొవ్యాక్స్‌కు అత్యవసర అనుమతి

భారత్‌లో 7-11 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు ఇచ్చేం దుకు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన కొవొవ్యాక్స్‌కు అత్యవసర అనుమతి ఇవ్వాలని భారత ఔషధ నియంత్రణ సంస్థ నిపుణుల ప్యానెల్‌ సిఫారసు చేసింది.

Updated Date - 2022-06-25T08:55:14+05:30 IST