1,733 పాజిటివ్‌ల నమోదు

ABN , First Publish Date - 2021-05-15T05:46:55+05:30 IST

జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజు రోజుకు పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం రికార్డుస్థాయిలో 1733 కేసులు నమోదయ్యాయి.

1,733 పాజిటివ్‌ల నమోదు
నెల్లూరు ప్రధాన డిపోలో కిట్లు పంపిణీ

 ఏడుగురు బాధితుల మృతి 


నెల్లూరు(వైద్యం) మే 14 : జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజు రోజుకు పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం రికార్డుస్థాయిలో 1733 కేసులు నమోదయ్యాయి. అలాగే ఏడుగురు బాధితులు మృతి చెందారు. కరోనా నుంచి కోలుకున్న 857 మందిని అధికారులు డిశ్చార్జ్‌ చేశారు.  


‘పేట’ మరణమృదంగం

సూళ్లూరుపేట : సూళ్లూరుపేటలో కరోనా మరణ మృదంగం మోగిస్తూనే ఉంది. ప్రతి రోజు కనీసం ఇద్దరు చొప్పున మృత్యువాత పడుతున్నారు. గురువారం సాయంత్రం పట్టణానికి చెందిన ఓ లేత్‌ యజమాని  కరోనా బారిన పడి తిరుపతిలోని ఈఎస్‌ఐ ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ మృతి చెందాడు. శుక్రవారం ఉదయం అదే ఆసుపత్రిలో ఆయన భార్య కూడా మృత్యువాత పడింది. వీరి కుమారుడు కూడా అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అలాగే  సూళ్లూరుపేటలో మరో ఇద్దరు మహిళలు సైతం శుక్రవారం కరోనాతో మృతి చెందారు. శ్రీహరికోట విశ్రాంతి ఉద్యోగి అయిన ఓ డ్రైవర్‌ రెండు రోజుల క్రితం షార్‌ ఆసుపత్రిలో కరోనాతో మృతి చెందగా అతని భార్య సైతం శుక్రవారం ఉదయం అదే ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇలా సూళ్లూరుపేట, శ్రీహరికోటల్లో కరోనా మరణాలు రోజు రోజుకు పెరిగిపోతుండటం ఈ ప్రాంతంలో ఆందోళన రేకిత్తిస్తోంది.


ఆర్టీసీ కార్మికులకు కరోనా కిట్లు

నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట) : కరోనా లక్షణాలు ఉండి పరీక్ష చేయించుకున్న వారు ముందుగా కరోనా మందులు వాడేలా ఆర్టీసీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. జిల్లాలో ఒక్కో డిపోకు వంద కిట్లు చొప్పున పది డిపోలకు వెయ్యి కిట్లను ఆర్‌ఎం కార్యాలయం నుంచి శుక్రవారం అందజేశారు. పాజిటివ్‌ వచ్చిన కార్మికులు డిపో మేనేజర్‌ను సంప్రదించి ఈ మందుల కిట్టు తీసుకోవాలని కోరారు. 

Updated Date - 2021-05-15T05:46:55+05:30 IST