‘పారా’హుషార్‌

ABN , First Publish Date - 2021-07-25T07:42:04+05:30 IST

రాష్ట్రంలో పారామెడికల్‌ విద్య పూర్తిగా పక్కదారి పడుతోంది. సర్కారీ అనుమతి లేకుండానే కొన్ని పారామెడికల్‌ కాలేజీలు ఏళ్లతరబడి..

‘పారా’హుషార్‌

అనుమతిలేని 171 పారామెడికల్‌ కాలేజీలు

2019-20 విద్యా సంవత్సరానికి ఈ ఏడాది నోటిఫికేషన్‌


హైదరాబాద్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పారామెడికల్‌ విద్య పూర్తిగా పక్కదారి పడుతోంది. సర్కారీ అనుమతి లేకుండానే కొన్ని పారామెడికల్‌ కాలేజీలు ఏళ్లతరబడి కొనసాగుతున్నాయి. ఆ కాలేజీల యాజమాన్యాల మనీ మేనేజ్‌మెంట్‌కు అధికారుల సైతం దాసోహమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏడు ప్రభుత్వ, 250కి పైగా ప్రైవేటు పారామెడికల్‌ కళాశాలలున్నాయి. ఇందులో 171 పారామెడికల్‌ కాలేజీలకు ఎటువంటి అనుమతుల్లేవు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పారా మెడికల్‌ బోర్డు సెక్రటరీ బీఎన్‌ఎస్‌ ప్రసాద్‌   ఇష్టారాజ్యంగా ఎడాపెడా కాలేజీలకు అనుమతిచ్చారు. 


పారామెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలంటే సవాలక్ష నిబంధనలున్నాయి. రాష్ట్రంలో వాటి అవసరం ఎంత ఉంది? ఏ కోర్సులకు ఏ ప్రాంతాల్లో డిమాండ్‌ ఉంది? అన్న అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. అందుకోసం సర్కారు ఒక కమిటీని వేస్తుంది. ఆ నివేదిక ఆధారంగా కొత్త కాలేజీల ఏర్పాటుకు సర్కారు జీవో జారీ చేస్తుంది. అనంతరం కొత్త కాలేజీలకు నోటిఫికేషన్‌ ఇస్తారు. వచ్చిన దరఖాస్తుల్లో వడపోత ఆధారంగా, అర్హత ఉన్నవాటిని గుర్తించి, కాలేజీ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతినిస్తుంది. ఇదీ పద్దతి. అలాంటిదేమీ లేకుండా కాలేజీలకు అనుమతినిచ్చారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత బోర్డు సెక్రటరీగా గోపాల్‌ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఆయన జీవోల్లేని కాలేజీల్లో అడ్మిషన్లు జరగకుండా నిరోధించారు. అయినప్పటికీ గుర్తింపులేని కాలేజీలు కూడా విద్యార్ధులను చేర్చుకున్నాయి. అంతకుమందు చేరిన సెకండ్‌ ఇయర్‌  విద్యార్దుల రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్షిప్‌ రెన్యువల్‌ కోసం బోర్డు ఇచ్చిన లాగిన్‌తో, అక్రమంగా అడ్మిషన్స్‌ ఇచ్చిన విద్యార్ధులతో కూడా రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్షిప్‌ కోసం ఈ కాలేజీలు  అప్లై చేయించాయి. అనుమతిలేని ఐదువేల మంది విద్యార్ధుల పేరిట రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్షి్‌పల రూపేణా రూ.11 కోట్లను కొట్టేశాయి. ఒక్కో విద్యార్థికి రీయింబర్స్‌మెంట్‌ రూపంలో రూ.18 వేలు, స్కాలర్షి్‌పల రూపంలో రూ. 4 వేల చొప్పున విడుదలయ్యాయి. పారామెడికల్‌ కోర్సుల విద్యార్ధులకు రెండేళ్లకొకమారు పరీక్షలు నిర్వహిస్తారు. అక్రమంగా అడ్మిషన్‌ పొందిన విద్యార్ధులు పరీక్ష రాయాలంటే ముందుగా వారు చదువుతున్న కాలేజీలకు అనుమతి ఉండాలి. వారి అడ్మిషన్‌ నోటిఫికేషన్స్‌లో ఆ కాలేజీల పేరుండాలి. కానీ అలా లేవు. అందుకే అక్రమాలకు తెరలేపాయి. 


గుడ్డిగా నోటిఫికేషన్‌

గోపాల్‌రెడ్డి వైదొలగిన అనంతరం రవీంద్రనాయక్‌ను సర్కారు బోర్డు సెక్రటరీగా నియమించింది. ఈ సమయంలోనే పారామెడికల్‌ కాలేజీలు రాజకీయంగా పెద్దయెత్తున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చాయి. దీంతో ప్రభుత్వం గత ఏడాది మే 12న ఓ మెమో జారీ చేసింది. దాని ఆధారంగా 2019-20 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్‌కు, ఎక్స్‌టెన్షన్‌ పేరిట ఈ ఏడాది మేలో మరో నోటిఫికేషన్‌ను పారామెడికల్‌ బోర్డు జారీ చేసింది. గతేడాది అడ్మిషన్లును ఈ ఏడాది ఎలా నిర్వహిస్తారో సర్కారుకే తెలియాలి. అంత గుడ్డిగా నోటిఫికేషన్‌ జారీ చేశారు. అంటే రెండు సంవత్సరాల క్రితం చేరిన విద్యార్ధులనే ఇప్పుడు కొత్తగా చేరినట్లు చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బోర్డు సెక్రటరీగా ఉన్న రవీంద్రనాయక్‌ను సర్కారు తప్పించింది. ఆయన స్థానంలో ప్రేమ్‌కుమార్‌ను నియమించింది. 


నివేదికిచ్చాం

పారామెడికల్‌ కాలేజీలో అడ్మిషన్ల ప్రక్రియపై ప్రభుత్వానికి నివేదికిచ్చాం. గతంలో సర్కారు ఇచ్చిన మెమో ఆధారంగానే అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించినట్లు గత బోర్డు సెక్రటరీ వెల్లడించారు. మొత్తానికి ఏం జరిగిందన్న దానిపై ప్రభుత్వానికి రాశాం. దానిపై సర్కారు నిర్ణయం తీసుకోవాల్సివుంది. 

  - ప్రేమ్‌కుమార్‌, ప్రస్తుత బోర్డు సెక్రటరీ


ఇవీ కోర్సులు

పారా మెడికల్‌ కాలేజీలు మొత్తం 23 కోర్సులను ఆఫర్‌ చేస్తున్నాయి. వాటిలో బాగా డిమాండ్‌ ఉన్న కోర్సులు డిప్లొమో ఇన్‌ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషీయన్‌, డిప్లొమో ఇన్‌ రేడియోథెరపీ టెక్నీషీయన్‌, డిప్లొమో ఇన్‌ డయాలసిస్‌, డిప్లొమో ఇన్‌ మెడికల్‌ ఇమేజింగ్‌ టెక్నీషీయన్‌, డిప్లొమో ఇన్‌ అనస్తస్థీషీయా టెక్నిషీయన్‌, డిప్లొమో ఇన్‌ ఈసీజీ టెక్నీషీయన్‌, డిప్లొమో ఇన్‌ క్యాథ్‌ల్యాబ్‌ టెక్నీషీయన్‌, డిప్లొమో ఇన్‌ కార్డియాలజీ టెక్నీషీయన్‌ ఉన్నాయి. వీటితో పాటు డీవోఎమ్‌, డీహెచ్‌ఎ్‌ఫఎ్‌సఎమ్‌, డీఎమ్‌పీహెచ్‌ఏ, డీఓఏ, డీఏఎమ్‌,డీపీఈఆర్‌ఎ్‌ఫయూ, డీఆర్‌ఈఎ్‌సటీ, డీఎమ్‌ఎస్‌ ఓటీటీ, డీహెచ్‌ఎల్‌ఎ్‌సటీ, డీడీటీ, డీడీహెచ్‌వై, డీఎమ్‌ఎస్‌, డీఆర్‌జీఏ, డీడీఆర్‌ఏ, డీసీఏఆర్‌డీఐవో కోర్సులు కూడా ఉన్నాయి.

Updated Date - 2021-07-25T07:42:04+05:30 IST