17 రకాల వైరస్‌ల వ్యాప్తి

ABN , First Publish Date - 2022-06-05T14:17:57+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోందని, కేరళ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో రోజుకు 1,000కి పైగా పాజిటివ్‌ కేసులు

17 రకాల వైరస్‌ల వ్యాప్తి

                - ప్రాణాలకు ముప్పులేదన్న ఆరోగ్య మంత్రి


ప్యారీస్‌(చెన్నై), జూన్‌ 4: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోందని, కేరళ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో రోజుకు 1,000కి పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయని, అయితే రాష్ట్రంలో గత మూడు నెలలుగా కరోనాతో ఒక్కరు కూడా మృతిచెందలేదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. స్థానిక టి.నగర్‌ గిరియప్ప రోడ్డులో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న 11 ఏళ్ల బాలుడు సహా ఆరుగురికి కరోనా ఉన్నట్లు గుర్తించి ‘కంటోన్మెంట్‌ జోన్‌’గా ప్రకటించారు. ఈ ప్రాంతాన్ని శనివారం ఉదయం రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి డాక్టర్‌ జె.రాధాకృష్ణన్‌, ఆ శాఖ అధికారులతో కలసి మంత్రి సుబ్రమణ్యం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో 17 రకాల వైర్‌సలు వ్యాప్తి చెందుతున్నాయని, అయితే దీని వల్ల ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలుండవని, అయినా ప్రజలు  అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. చెన్నైలో ప్రభుత్వం చేపట్టిన పటిష్ఠ చర్యల వల్ల కరోనా ప్రభావం చాలావరకు తగ్గిందని, మళ్లీ వైరస్‌ వ్యాప్తి వేగంగా పెరుగుతున్నప్పటికీ, కరోనా వల్ల ఒక్కరూ కూడా మృతిచెందలేదని చెప్పారు. మద్రాసు ఐఐటీ, అన్నా విశ్వవిద్యాలయం, వీఐటీ, సత్యసాయి కళాశాల తదితర ఉన్నత విద్యాసంస్థల్లో పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న విద్యార్థుల వల్ల వైరస్‌ వ్యాప్తి పెరుగుతోందని అన్నారు. అన్నా విశ్వవిద్యాలయంలో 23 మంది, వీఐటీ కళాశాలలో 193 పాజిటివ్‌ కేసులకు చికిత్స కొనసాగిస్తున్నట్లు తెలిపారు. నగరంలో అపార్ట్‌మెంట్లు, నివాస ప్రాంతాల్లో మళ్లీ వైరస్‌ తీవ్రత కనిపిస్తోందని, ముఖ్యంగా కార్పొరేషన్‌ పరిధిలోని 9,10,11 జోన్‌లలో వైరస్‌ నివారణకు గట్టి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నగరంలో ఇప్పటివరకు 370 మందికి కరోనా సోకినట్లు నిర్ధారించి, ఇళ్లలోనే చికిత్సలందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రెండు డోసుల టీకాలు వేసుకున్న వారు 9 నెలల అనంతరం బూస్టర్‌ డోస్‌ వేయించకోవాల్సిందిగా మంత్రి విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-06-05T14:17:57+05:30 IST