కుర్చీల్లేని పదవులిచ్చారు

ABN , First Publish Date - 2022-07-10T09:28:46+05:30 IST

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారికి కనీసం కూర్చోవడానికి కుర్చీలు కూడా లేని పదవులు ఇచ్చి అదే సామాజిక

కుర్చీల్లేని పదవులిచ్చారు

17 వేల పదవులు బీసీలకు దూరమయ్యాయి: అచ్చెన్న


అమరావతి, విశాఖపట్టణం, జూలై 9(ఆంధ్రజ్యోతి): బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారికి కనీసం కూర్చోవడానికి కుర్చీలు కూడా లేని పదవులు ఇచ్చి అదే సామాజిక న్యాయమని వైసీపీ మోసపూరితంగా వ్యవహరిస్తోంది. ఆ పార్టీ ప్లీనరీలో సామాజిక న్యాయంపై పెట్టిన తీర్మానం, నేతల ప్రసంగాలు పచ్చి మోసం’’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. శనివారం ఈమేరకు ఆయన ఓ ప్రకటన చేశారు. ‘‘బీసీ వర్గాలకు 56 కార్పొరేషన్‌ పదవులు ఇచ్చామని వైసీపీ ప్రచారం చేసుకొంటోంది. గత ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు ఉన్న రిజర్వేషన్లు ఈ ప్రభుత్వ హయాంలో 10 శాతం తగ్గిపోయాయి.


దానివల్ల 17 వేల రాజ్యాంగ పదవులు ఆ వర్గాల వారికి రాకుండా పోయాయి. ఇది సామాజిక న్యాయమా... విద్రోహమా? బీసీ సబ్‌ ప్లాన్‌ నిధులు రూ.26 వేల కోట్లు వారి అభివృద్ధికి వెచ్చించకుండా దారి మళ్లించారు. రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది బీసీ వర్గాల వారు దారుణ హత్యకు గురైతే పట్టించుకొన్న పాపాన పోలేదు’’ అని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో దళితులకు ఇంతకంటే తీవ్రమైన అన్యాయం జరిగిందని ఆరోపించారు. ‘‘దళితుల సాగులో ఉన్న 11 వేల ఎకరాల అస్సైన్డ్‌ భూములను ఈ ప్రభుత్వం దుర్మార్గంగా లాక్కొంది. వారికి నేరుగా చెందాల్సిన సబ్‌ ప్లాన్‌ నిధులు రూ.7,000 కోట్లు దారి మళ్లించి ఇతర అవసరాలకు వాడుకొన్నారు. బడుగు బలహీన వర్గాల వారికి బొరుగులు పెట్టి వారి నుంచి బంగారం కొట్టేయడం సామాజిక న్యాయమా?’’ అని అచ్చెన్న నిలదీశారు. 


95 శాతం అమలు పచ్చి అబద్ధం: తులసిరెడ్డి

వేంపల్లె, జూలై 9: వైసీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న 95 శాతం అంశాలను అమలు చేశామని, వైసీపీ గెలుపును ఎవరూ ఆపలేరని ప్లీనరీలో జగన్‌ చెప్పడం హాస్యాస్పదమని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. వివిధ పథకాల అమలు తీరును వివరించి... వైసీపీ పట్ల ప్రజా వ్యతిరేకత పతాక స్థాయిలో ఉందన్నారు. అందుకే గడపగడపలో గడబిడ అయిందని, బస్సుయాత్ర తస్సుమందని, నియోజకవర్గాల, జిల్లాల ప్లీనరీల్లో నిరసన స్వరాలు మిన్నంటాయని అన్నారు. 


తల్లిని అవమానించిన తనయుడు

వైసీపీ గౌరవాధ్యక్ష పదవి నుంచి తల్లిని అగౌరవంగా తొలగించి జగన్‌ విజయలక్ష్మిని అవమానపరిచాడని తులసిరెడ్డి అన్నారు. స్వార్థ ప్రయోజనాల ముందు తల్లి లేదు, చెల్లి లేదు, నాన్న లేడు, చిన్నాన్న లేడు అని జగన్‌ నిరూపించాడన్నారు.

Updated Date - 2022-07-10T09:28:46+05:30 IST