సంతోషం పట్టలేక తాలిబన్ల కాల్పులు.. చిన్నారులు సహా 17 మంది మృతి

ABN , First Publish Date - 2021-09-04T21:00:18+05:30 IST

తాలిబన్లు సంతోషం పట్టలేక గాల్లోకి జరిపిన కాల్పుల్లో పలువురు చిన్నారులు సహా 17 మంది

సంతోషం పట్టలేక తాలిబన్ల కాల్పులు.. చిన్నారులు సహా 17 మంది మృతి

కాబూల్: తాలిబన్లు సంతోషం పట్టలేక గాల్లోకి జరిపిన కాల్పుల్లో పలువురు చిన్నారులు సహా 17 మంది ప్రాణాలు కోల్పోగా 41 మంది తీవ్రంగా గాయపడినట్టు ఆఫ్ఘనిస్థాన్ న్యూస్ ఏజెన్సీ అశ్వక తెలిపింది. ఇన్నాళ్లు కొరకరాని కొయ్యగా మారిన పంజ్‌షీర్ వ్యాలీని తమ అదుపులోకి తెచ్చుకోవడం, నేషనల్ రెసిస్టెన్స్ ఫోర్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్ (ఎన్ఆర్ఎఫ్ఏ)ను ఓడించడంతో సంబరాలు చేసుకున్న తాలిబన్లు ఆ ఆనందంలో గత రాత్రి గాల్లోకి కాల్పులు జరిపారు. ఇందుకు సంబంధించి వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాల్పుల్లో గాయపడిన తమ వారిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్తున్న వీడియోలు కూడా ఇందులో ఉన్నాయి. 


‘‘దేవుడి దయ వల్ల ఆఫ్ఘనిస్థాన్ మొత్తాన్ని మా నియంత్రణలోకి తెచ్చుకున్నాం. పంజ్‌షీర్ ఇప్పుడు మా అధీనంలో ఉంది’’ అని తాలిబన్ కమాండర్ ఒకరు పేర్కొన్నారు. కాగా, తాలిబన్లు సంతోషం పట్టలేక జరిపిన కాల్పుల్లో చనిపోయిన 17 మంది మృతదేహాలతోపాటు గాయపడిన 41 మంది తమ ఆసుపత్రిలో చేరినట్టు కాబూల్‌లోని ఎమర్జెన్సీ ఆసుపత్రి తెలిపింది. వీరంతా నంగర్హార్ ప్రావిన్స్‌కు చెందిన వారని పేర్కొంది. పంజ్‌షీర్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నట్టు వస్తున్న వార్తలను తాలిబన్ వ్యతిరేక దళ నేత అహ్మద్ మసౌద్ కొట్టిపడేశారు. ఇదంతా తప్పుడు ప్రచారమని, పాకిస్థాన్ మీడియాలో ప్రసారమవుతున్న ఈ వార్తలు శుద్ధ అబద్ధమని పేర్కొన్నారు.  



Updated Date - 2021-09-04T21:00:18+05:30 IST