పత్తి కొనుగోలుకు 17 కేంద్రాలు

ABN , First Publish Date - 2020-09-30T08:29:07+05:30 IST

జిల్లాలో పత్తి కొనుగోళ్లకు జిల్లా యంత్రాంగం కసరత్తు మొదలు పెట్టింది. ఈ సారి 62 లక్షల 19వేల క్వింటాళ్ల పత్తి దిగుబడి రానున్నట్టు అంచనా వేసింది. అందుకు

పత్తి కొనుగోలుకు 17 కేంద్రాలు

ఏర్పాటు చేయనున్న అధికారులు

దిగుబడి అంచనా 62.19 లక్షల క్వింటాళ్లు

పొడవు పింజకు రూ.5,825, మధ్యస్త పింజకు రూ.5,515

మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి)

జిల్లాలో పత్తి కొనుగోళ్లకు జిల్లా యంత్రాంగం కసరత్తు మొదలు పెట్టింది. ఈ సారి 62 లక్షల 19వేల క్వింటాళ్ల పత్తి దిగుబడి రానున్నట్టు అంచనా వేసింది. అందుకు అనుగుణంగా 17 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నది. పత్తికి మద్దతు ధరను రెండు రకాలుగా ప్రకటించింది. పొడవు పింజ రకానికి క్వింటాలుకు రూ.5,825, మధ్యస్త పింజ రకానికి క్వింటాలుకు రూ.5,515 నిర్ణయించింది. అక్టోబరు నెలాఖరు కల్లా దిగుబడి వస్తుందని భావించిన అధికారులు పత్తి కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 


కొత్తగా 3 కేంద్రాలు

గత సంవత్సరం జిల్లాలో పత్తి కొనుగోళ్లకు యంత్రాంగం 14 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈసారి కొత్తగా 3 కేంద్రాలతో కలిసి మొత్తం 17 ఏర్పాటు చేయనున్నది. అక్టోబరు నెలాఖరు నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభించనున్నందున రెండో వారంలోగా ఆయా కేంద్రాలన్నీ సిద్ధం కావాలని ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. జిన్నింగ్‌ మిల్లులలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కానున్నందున ఆయా మిల్లులలో మౌలిక వసతులు, అగ్నిమాపక ఏర్పాట్ల కల్పన, తూకం యంత్రాలు, సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేయడం వంటి చర్యలన్నీ వచ్చేనెల రెండో వారం వరకు పూర్తి చేయనున్నారు. 


రోజుకు 33,825 క్వింటాళ్ల పత్తి కొనుగోలు

జిల్లాలోని సదాశివపేట మార్కెట్‌ యార్డు పరిధిలో ఐదు, జోగిపేట మార్కెట్‌లో ఐదు, వట్‌పల్లిలో ఒకటి, నారాయణఖేడ్‌ మార్కెట్‌లో నాలుగు జిన్నింగ్‌ మిల్లులున్నాయి. ఆయా ప్రాంతాలలోని 17 జిన్నింగ్‌ మిల్లులలో ఏర్పాటు కానున్న కేంద్రాలలో రోజుకు 33,825 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయనున్నారు. ఇలా ఉండగా ఈసారి జిల్లాలో 3,96,838 ఎకరాలలో పత్తి సాగు చేయగా ఇటీవల వర్షాలకు 15 వేల ఎకరాలలో పంట నీట మునిగి దెబ్బతిన్నది. దెబ్బతిన్న పంట మినహా మిగిలిన విస్తీర్ణంలో 62 లక్షల 19వేల క్వింటాళ్ల పత్తి దిగుబడి రానున్నట్టు అధికార వర్గాలు అంచనా వేశాయి.

Updated Date - 2020-09-30T08:29:07+05:30 IST