Abn logo
Jun 6 2020 @ 02:56AM

కరోనా పడగ

ఒక్కరోజే 17 కేసులు నమోదు

అనకాపల్లిలోనే 14!

పట్టణంలో 19కి చేరిన కేసులు

కేంద్ర బిందువు చింతావారివీధిలోని గృహోపకరణాల దుకాణం

18 మందికి ఈ షాపుతోనే లింకు

గవరపాలెం గజగజ... పాజిటివ్‌ కేసుల్లో ఎక్కువ మంది ఇక్కడి వారే

ఆందోళన చెందుతున్న స్థానికులు

పలు వీధుల్లో రాకపోకలను కట్టడి చేసిన అధికారులు

రహదారులకు అడ్డంగా బారికేడ్లు ఏర్పాట్లు

వీధుల్లో సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణం పిచికారీ

పరిస్థితిని సమీక్షించిన ఎస్పీ అట్టాడ బాబూజీ, డీఎస్పీ శ్రావణి

నేటి నుంచి కంటెయిన్‌మెంట్‌ నిబంధనలు అమలు

కూర్మన్నపాలెంలో మరో రెండు కేసులు

నగర పరిధిలోని దిబ్బపాలెంలో మరొకరికి వైరస్‌


అనకాపల్లి టౌన్‌/విశాఖపట్నం, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 17 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఇందులో మగ్గురు నగరవాసులు కాగా, 14 మంది అనకాపల్లి ప్రాంతానికి చెందినవారు. ఇప్పటివరకు ఒక్కరోజులో అత్యధికంగా 12 కేసులు నమోదుకాగా...శుక్రవారం రికార్డు స్థాయిలో 17 వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 145కు చేరింది. 


అనకాపల్లిలో విజృంభణ

అనకాపల్లి పట్టణంలో కరోనా వైరస్‌ ఒక్కసారిగా జడలు విప్పింది. నిన్న మొన్నటివరకు కొవిడ్‌ ఆనవాళ్లు లేని పట్టణంలో ఒక్కసారిగా భారీఎత్తున కేసులు నమోదు కావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అనధికార లెక్కల ప్రకారం అనకాపల్లి, చుట్టుపక్కల గ్రామాల్లో గత రెండు రోజుల్లో 19 మంది వరకు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అయితే అధికారులు గురువారం విడుదల చేసిన బులెటిన్‌లో అనకాపల్లిలో 14 పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు పేర్కొన్నారు. మరో పది మందికిపైగా రిపోర్టులు రావాల్సి ఉంది. 


కరోనా వైరస్‌ మహమ్మారి జిల్లాలో ప్రవేశించి దాదాపు రెండున్నర నెలలు అవుతున్నది. ఈ నెల 3వ తేదీ వరకు 124 మంది వైరస్‌బారినపడగా, వీరిలో వంద మందికిపైగా విశాఖ నగరానికి చెందినవారే ఉన్నారు. గ్రామీణ జిల్లాలో నర్సీపట్నం, అచ్యుతాపురం, బుచ్చెయ్యపేట, చీడికాడ, పద్మనాభం, ఎస్‌.రాయవరం మండలాల్లో పాజిటివ్‌ కేసులు నమోదు అయినప్పటికీ....జీవీఎంసీ పరిధిలో వున్న అనకాపల్లిలో ఈ నెల ఆరంభం వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. వారం రోజుల క్రితం వరకు అనకాపల్లిలో ఎవరికీ కరోనా వైరస్‌ లక్షణాలు కనిపించలేదు. గత నెలలో నాలుగో విడత లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన తరువాత ఇతర ప్రాంతాల నుంచి వలసకూలీలు రావడం, వ్యాపార సముదాయాలు ఒక్కటొక్కటిగా తెరుచుకోవడంతో కరోనా వైరస్‌ చాప కింద నీరులా పట్టణంలోకి ప్రవేశించింది. తొలుత గత ఆదివారం చింతవారివీధిలోని ఓ గృహోపకరణాల దుకాణం యజమానులైన తండ్రి, కుమారుడికి వైరస్‌ అనుమానిత లక్షణాలు కనిపించాయి.


దీంతో ఎన్టీఆర్‌ ఆస్పత్రి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ట్రూనాట్‌ పరీక్షలు చేయగా పాజిటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. దీంతో మరోమారు పరీక్షల కోసం వైద్య ఇబ్బంది వెంటనే వారిని విశాఖ తరలించారు. తరువాత వీరి కుటుంబ సభ్యులు, షాపులో పనిచేస్తున్న సిబ్బందిని, వారి కుటుంబ సభ్యులను గుర్తించి, ఎన్టీఆర్‌ వైద్యాలయంలో ట్రూనాట్‌ పరీక్షలు నిర్వహించారు. సుమారు 30 మందికి పాజిటివ్‌ లక్షణాలు వున్నట్టు నిర్ధారణ అయినట్టు తెలిసింది. వీరిని కూడా విశాఖ తరలించారు. గురువారం పట్టణానికి చెందిన నలుగురికి, తుమ్మపాలలో ఒకరికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. కాగా శుక్రవారం 14 మందికి పాజిటివ్‌ వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. వీరంతా గృహోపకరణాల దుకాణంలో పనిచేసే సిబ్బంది, వారి కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారు. పాజిటివ్‌ వచ్చిన వారిలో ఎక్కువ మంది గవరపాలెంలోని సతకంపట్టు, సంతబయల, దిబ్బవీధి, అగ్గిమర్రిచెట్టు, కోటవీధితోపాటు గ్రామీణ ప్రాంతంలోని లంకెలపాలెం, భట్లపూడి, బవులవాడ, శ్రీహరిపురం, సత్యనారాయణపురం వాసులుగా పోలీసులు గుర్తించారు. దీంతో శుక్రవారం సాయంత్రం ఆయా ప్రాంతాలను కంటెయిన్‌మెంట్‌ జోన్లుగా ప్రకటించి, ప్రజల రాకపోకలను కట్టడి చేశారు. ఎక్కడికక్కడ వీధుల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. తుమ్మపాలకు చెందిన ఒక వ్యక్తి మినహా, మిగిలిన వారంతా చింతావారివీధిలోని గృహోపకరణాల దుకాణానికి చెందినవారేనని పోలీసులు తెలిపారు.

 

చింతావారివీధి బంద్‌

కరోనా వైరస్‌కు కేంద్ర బిందువైన చింతావారివీధిని కంటెయిన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించి, రాకపోకలను నిషేధించారు. ఇటు చిననాలుగురోడ్ల జంక్షన్‌, అటు దేవునిగుమ్మం జంక్షన్‌లో బారికేడ్లు ఏర్పాటుచేశారు. రెడ్‌ జోన్‌గా ప్రకటిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. 200 మీటర్ల పరిధిలోని దుకాణాలన్నింటినీ మూసివేయించారు. సమీపంలో వున్న మెయిన్‌రోడ్డులోని మల్లిమణుగులవారి వీధి జంక్షన్‌ నుంచి నెయ్యిలవీధి జంక్షన్‌ వరకు వ్యాపారులు దుకాణాలను మూసివేశారు. పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు. వీధుల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లారు. కాగా జిల్లా ఎస్‌పీ అట్టాడ బాబూజీ శుక్రవారం రాత్రి అనకాపల్లి వచ్చి అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్‌ వ్యాప్తిచెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. అనంతరం డీఎస్పీ కె.శ్రావణి ఆధ్వర్యంలో సీఐ భాస్కరరావు, ఎస్‌ఐలు కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో కంటెయిన్‌మెంట్‌ జోన్లు గుర్తించేందుకు శుక్రవారం రాత్రి ఆయా ప్రాంతాలను పరిశీలించారు. శనివారం ఉదయం నుంచి కంటెయిన్‌మెంట్‌ నిబంధనలు అమలోకి వస్తాయని చెప్పారు.


కూర్మన్నపాలెంలో ఇద్దరికి...

గాజువాక శ్రీనగర్‌ సమీపంలోని శ్రీరామ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తితోపాటు కూర్మన్నపాలెం ప్రాంతానికి చెందిన మరో వ్యక్తికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. వీరు కొద్దిరోజుల కిందట వైరస్‌ బారినపడిన ఫార్మా ఉద్యోగి (దుగ్గపువానిపాలెం) కాంటాక్ట్‌గా అధికారులు తెలిపారు. అదేవిధంగా దండుబజార్‌ ప్రాంతంలోని దిబ్బలపాలెం ప్రాంతానికి మరో వ్యక్తి వైరస్‌ బారినపడినట్టు అధికారులు నిర్ధారించారు. 

Advertisement
Advertisement
Advertisement