16 నుంచి మరిన్ని సడలింపులు

ABN , First Publish Date - 2022-02-13T13:24:34+05:30 IST

రాష్ట్రంలో కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టడంతో లాక్‌డౌన్‌ కాలానికి మరిన్ని సడలింపులు ప్రకటించారు. ఆ మేరకు నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ, ప్లే స్కూళ్లకు అనుమతిచ్చారు. సినిమా థియేటర్లలో 100 శాతం ప్రేక్షకులను

16 నుంచి మరిన్ని సడలింపులు

- నర్సరీ స్కూళ్లు, ఎగ్జిబిషన్లకు గ్రీన్‌ సిగ్నల్‌

- పూర్తి సామర్థ్యంతో సినిమా థియేటర్లు

- వివాహాది శుభకార్యాలకు 200 మందితో అనుమతి


చెన్నై: రాష్ట్రంలో కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టడంతో లాక్‌డౌన్‌ కాలానికి మరిన్ని సడలింపులు ప్రకటించారు. ఆ మేరకు నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ, ప్లే స్కూళ్లకు అనుమతిచ్చారు. సినిమా థియేటర్లలో 100 శాతం ప్రేక్షకులను అనుమతిస్తూ, వివాహాది శుభకార్యాలలలో 200 మందికి మాత్రమే అనుమతులిచ్చారు. సచివాలయంలో శనివారం ఉదయం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అధ్యక్షతన ఉన్నతాధికారులు, వైద్యనిపుణుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో జనవరి 22న కరోనా వైరస్‌ వ్యాప్తి ఉగ్రరూపం దాల్చిందని, ఆ రోజు 30,744 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, ఆ తర్వాత ప్రభుత్వం తీసుకున్న పటిష్ఠ చర్యల కారణంగా వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని, శుక్రవారం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3086కు చేరిందని వివరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారతీయ వైద్య మండలి అధికారులు వైరస్‌ థర్డ్‌వేవ్‌ ముగిసిందని చెబుతుండటంతో లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించాల్సిన అవసరముందనే అధికారుల సమష్టి అభిప్రాయం మేరకు ఈ సమావేశం ముగిసిన వెంటనే ఈ నెల 16 నుంచి మార్చి రెండో తేదీవరకు కొత్త సడలింపులతో లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు స్టాలిన్‌ ప్రకటించారు. రాష్ట్రంలో నర్సరీ పాఠశాలలు, ప్లేస్కూళ్లను తెరిచేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. ఇదేవిధంగా కొవిడ్‌ నిబంధనలతో రాష్ట్రంలో ఎగ్జిబిషన్లు నిర్వహించుకోవచ్చని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు ఎక్కువగా గుమికూడే ప్రాంతాల్లో రాజకీయ సభలు, సామాజిక, సాంస్కృతిక సభల నిర్వహణపై ప్రస్తుతం ఉన్న నిషేధాన్ని కొనసాగిస్తున్నట్లు స్టాలిన్‌ ప్రకటించారు. ప్రస్తుతం వివాహాది శుభకార్యాల్లో ప్రస్తుతం వందమందికి మాత్రమే అనుమతిస్తుండగా ఈ నెల 16 నుంచి 200 మందిని అనుమతిస్తామని తెలిపారు. ఇక మరణ సంబంధిత అశుభ కార్యాలు, అంత్యక్రియల్లో ప్రస్తుతం 50 మందికి మాత్రమే పాల్గొనేందుకు అవకాశముందని, ఇకపై వందమంది పాల్గొనేందుకు అనుమతించనున్నామని ఆయన వెల్లడించారు. ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపడేందుకే ఈ లాక్‌డౌన్‌ నిబంధనలను సడలిస్తున్నామని, అయినప్పటికీ ప్రజలంతా మాస్కులను తప్పనిసరిగా ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లతో చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం వంటి నిబంధనలను తప్పకుండా పాటించాలని, రెండు డోస్‌ల టీకాలు వేసుకోవాలని స్టాలిన్‌ ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాధాకృష్ణన్‌, డీజీపీ శైలేంద్రబాబు, గ్రేటర్‌ చెన్నై పోలీసు కమిషనర్‌ శంకర్‌ జివాల్‌ నగరపాలక నీటి నిర్వహణ విభాగం అదనపు ప్రభుత్వ కార్యదర్శి శివదాస్‌ మీనా, రెవెన్యూ శాఖ కమిషనర్‌ కుమార్‌ జయంత్‌, పాఠశాలల విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కాకర్ల ఉష, ప్రజారోగ్యశాఖ శాఖ ప్రత్యేక అధికారి పి. శెంథిల్‌కుమార్‌, ప్రజారోగ్యం, రోగనిరోధక శాఖల వైద్య సంచాలకుడు డాక్టర్‌ టీఎస్‌ సెల్వవినాయగం తదితరులు పాల్గొన్నారు.


హోటళ్లు, థియేటర్లలో..

ఈ నెల 16 నుంచి సినిమా థియేటర్లలో వందశాతం ప్రేక్షకులను అనుమతించనున్నట్లు స్టాలిన్‌ తెలిపారు. హోటళ్లు, వస్త్ర దుకాణాలు, నగల దుకాణాలు, వినోదపు క్లబ్బులు, వ్యాయామశాలల్లో వంద శాతం కస్టమర్లను అనుమతించారు. ఇండోర్‌ స్టేడియంలలో క్రీడాపోటీలకు, హాళ్లలో జరిగే సంగీత, సాహిత్య, సాంస్కృతిక సమావేశాలు, సదస్సులకు కూడా వంద శాతం మందిని అనుమతిస్తున్నట్లు ఆయన వివరించారు.

Updated Date - 2022-02-13T13:24:34+05:30 IST