బాలికపై బాలుడి విచక్షణారహిత దాడి.. ట్విటర్‌లో సీఎం స్పందన.. తక్షణమే బాలుడి అరెస్ట్

ABN , First Publish Date - 2022-05-23T21:52:48+05:30 IST

రాంచీ : స్కూల్ యూనిఫామ్‌లో ఉన్న ఓ బాలికపై 16 ఏళ్ల బాలుడు పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. ఏమాత్రం కనికరం లేకుండా కాలితోనూ తన్నాడు.

బాలికపై బాలుడి విచక్షణారహిత దాడి.. ట్విటర్‌లో సీఎం స్పందన.. తక్షణమే బాలుడి అరెస్ట్

రాంచీ : స్కూల్ యూనిఫామ్‌లో ఉన్న ఓ బాలికపై 16 ఏళ్ల బాలుడు విచక్షణారహితంగా దాడి చేశాడు. పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. కనికరం లేకుండా కాళ్లతోనూ తన్నాడు. దెబ్బలు తాళలేక నేలపై పడిపోయిన బాలిక కన్నీటిపర్యంతమైంది. జార్ఖండ్‌లోని పకూర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్‌లో ఓ వ్యక్తి  షేర్ చేశాడు. వీడియో చూసిన జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Jharkhand CM Hemanth soren) స్పందించారు. వీడియో రీట్వీట్ చేసి ఈ వ్యవహారంలో తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు.


సీఎం ఆదేశాలతో పోలీసు అధికారులు తక్షణమే రంగంలోకి దిగారు. దర్యాప్తు ప్రారంభించి దాడికి పాల్పడిన బాలుడిని గుర్తించారు. నిందిత బాలుడు కూడా 9వ తరగతి చదువుతున్నాడని తెలిసింది. ప్రాథమిక ఆధారాల ప్రకారం.. ఈ ఘటన ప్రేమ వ్యవహారానికి సంబంధించినదిగా తమ దృష్టికి వచ్చిందని దుమ్కా సబ్-డివిజనల్ పోలీసు ఆఫీసర్(ఎస్‌డీపీవో) నూర్ ముస్తఫా అన్సారీ చెప్పారు. ఈ ఘటన 15 రోజుల క్రితం జరిగింది. అయితే వీడియో ఇటివలే వెలుగులోకి వచ్చిందన్నారు. బాలిక, నిందిత బాలుడు ఇద్దరూ ట్రైబల్ కమ్యూనిటీలకు చెందినవారు. ఇంటరాగేషన్ కోసం ఇద్దరినీ గోపికందర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చామని, నిందిత బాలుడు మైనర్ కావడంతో రిమాండ్ హోంకు తరలిస్తామని అన్సారీ వివరించారు. పకుర్ జిల్లా ఎస్పీ హృదీప్ పీ జనార్ధన్ స్పందిస్తూ.. ఈ ఘటనలో తదుపరి దర్యాప్తు జరుగుతుందని స్పష్టం చేశారు.

Updated Date - 2022-05-23T21:52:48+05:30 IST