16న పుదుచ్చేరి అసెంబ్లీ

ABN , First Publish Date - 2021-06-13T17:23:38+05:30 IST

పుదుచ్చేరి రాష్ట్ర శాసనసభ సమావేశం ఈనెల 16వ తేదీన జరుగనుంది. ఆ రోజే కొత్త స్పీకర్‌ ఎన్నిక కూడా నిర్వహించనున్నారు. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. స్పీ

16న పుదుచ్చేరి అసెంబ్లీ

           - ఆ రోజే స్పీకర్‌  ఎన్నిక 


అడయార్‌(చెన్నై): పుదుచ్చేరి రాష్ట్ర శాసనసభ సమావేశం ఈనెల 16వ తేదీన జరుగనుంది. ఆ రోజే కొత్త స్పీకర్‌ ఎన్నిక కూడా నిర్వహించనున్నారు. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. స్పీకర్‌ అభ్యర్థిగా బీజేపీకి చెందిన ఏంబలం సెల్వం పేరును భారతీయ జనతా పార్టీ ఖరారు చేసింది. ఇదే విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర శాఖ నాయకులు ఒక లేఖ ద్వారా ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఆయన లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌కు తెలియజేయడంతో ఆమె కూడా ఆమోదం తెలిపారు. దీంతో వచ్చే 16వ తేదీన స్పీకర్‌ ఎన్నిక పూర్తికానుంది. అదేసమయంలో మంత్రివర్గ ఏర్పాటుపై మాత్రం ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. బీజేపీ ఒక ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు రెండు మంత్రి పదవులు కావాలని డిమాండ్‌ చేస్తూ వస్తోంది. దీనికి ముఖ్యమంత్రి రంగస్వామి ససేమిరా అంటున్నారు. రెండు మంత్రి పదవులకు మించి ఇచ్చేదిలేదని తెగేసి చెప్పారు. దీంతో బీజేపీ నేతలు కూడా తలొగ్గారు. ఇప్పుడు ఆ ఇద్దరి పేర్లను కూడా ఒకటీరెండు రోజుల్లో బీజేపీ సమర్పించిన పక్షంలో కొత్త మంత్రి వర్గ ఏర్పాటు కూడా 16వ తేదీనే జరుగవచ్చన్న సంకేతాలు వినవస్తున్నాయి. ఇదిలావుంటే, పుదుచ్చేరి శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ - బీజేపీ కూటమి 16 సీట్లను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మే 7వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్‌.రంగస్వామి ప్రమాణస్వీకారం చేశారు. కానీ, కొత్త మంత్రులుగా ఒక్కరు కూడా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇదిలావుంటే ఈ కూటమి బలం ప్రస్తుతం 22కు చేరింది. ముగ్గురు నామినేటెడ్‌ ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఈ కూటమికి మద్దతు తెలిపారు. దీంతో ఈ కూటమి బలం 22కు చేరడంతో స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ పదవులు ఈ కూటమికే సొంతంకానున్నాయి. 

Updated Date - 2021-06-13T17:23:38+05:30 IST