కల్తీ టీ పొడి విక్రయ ముఠా గుట్టు రట్టు

ABN , First Publish Date - 2021-11-24T09:59:20+05:30 IST

ప్రాణాంతక రసాయనాలతో టీ పొడి తయారుచేసి విక్రయిస్తున్న ముఠాను సూర్యాపేట జిల్లా పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

కల్తీ టీ పొడి విక్రయ ముఠా గుట్టు రట్టు

16 మంది అరెస్టు, పరారీలో 8 మంది

సూర్యాపేట క్రైం, నవంబరు 23: ప్రాణాంతక రసాయనాలతో టీ పొడి తయారుచేసి విక్రయిస్తున్న ముఠాను సూర్యాపేట జిల్లా పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.22.5 లక్షల విలువ చేసే 45 క్వింటాళ్ల కల్తీ టీ పొడిని స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను సూర్యాపేట ఎస్పీ రాజేంద్ర జిల్లా పోలీస్‌ కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. సూర్యాపేటలో కల్తీ టీ పొడి విక్రయిస్తున్నారనే సమాచారంతో పట్టణంలోని తాళ్లగడ్డ, కొత్త బస్‌స్టేషన్‌ ప్రాంతాల్లోని దుకాణాల్లో పోలీసులు దాడులు చేసి, కల్తీ టీ పొడిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి, కృష్ణా జిల్లా విజయవాడ, రావులపాలెంకు చెందిన పలువురి వద్ద కల్తీ టీ పొడిని కొనుగోలు చేస్తూ సూర్యాపేటలో విక్రయిస్తున్నట్లు అంగీకరించారు. వెంటనే పోలీసులు ఏపీలోని ఆయా ప్రాంతాలకు వెళ్లి, కల్తీ టీ పొడి తయారుచేసే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. తయారీ కేంద్రాల వద్ద ఉన్న సుమారు 45 క్వింటాళ్ల టీ పొడితో పాటు తయారీకి ఉపయోగించే రసాయనాలు, యంత్రాలు, రెండు కార్లను స్వాధీనం చేసుకుని సూర్యాపేటకు తరలించారు. తయారీదారులను ప్రశ్నించగా సూర్యాపేటలో మరో ఆరుగురు వ్యాపారులకు కూడా కల్తీ టీ పొడిని విక్రయిస్తున్నట్లు చెప్పారు. దీంతో పోలీసులు సూర్యాపేటలో దుకాణాల్లో దాడులు చేసి క్వింటాన్నర కల్తీ టీ పొడిని స్వాధీనం చేసుకుని, వ్యాపారులను అరెస్టు చేశారు. కల్తీ టీ పొడి తయారీ, విక్రయాలకు సంబంధించి 24 మందిని నిందితులుగా గుర్తించగా, సూర్యాపేటకు చెందిన 10 మంది వ్యాపారులు, ఆరుగురు తయారీదారులను అరెస్టు చేశారు. వరంగల్‌, హైదరాబాద్‌కు చెందిన 8 మంది పరారీలో ఉన్నారు. 

Updated Date - 2021-11-24T09:59:20+05:30 IST