Abu Dhabi రోడ్లపై ఈ విషయంలో జాగ్రత్త.. లేకపోతే రూ. 16లక్షల ఫైన్.. 6నెలలు లైసెన్స్ జప్తు!

ABN , First Publish Date - 2021-10-23T18:52:33+05:30 IST

యూఏఈ రాజధాని నగరం అబుధాబి ట్రాఫిక్ విభాగం వాహనదారులకు తాజాగా కీలక సూచనలు చేసింది.

Abu Dhabi రోడ్లపై ఈ విషయంలో జాగ్రత్త.. లేకపోతే రూ. 16లక్షల ఫైన్.. 6నెలలు లైసెన్స్ జప్తు!

అబుధాబి: యూఏఈ రాజధాని నగరం అబుధాబి ట్రాఫిక్ విభాగం వాహనదారులకు తాజాగా కీలక సూచనలు చేసింది. చిన్నచిన్న నిర్లక్ష్యాల కారణంగా రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో నగర ట్రాఫిక్ అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. ప్రధానంగా రెడ్ సిగ్నల్ జంపింగ్ విషయంలో సంబంధిత అధికారులు వాహనదారులను హెచ్చరించారు. రెడ్ సిగ్నల్ క్రాస్ చేసే వారికి ఇకపై భారీ జరిమానా ఉంటుందని తెలిపారు. ఇలా రెడ్ సిగ్నల్ జంప్ చేసే వాహనదారులకు 51వేల దిర్హమ్స్(రూ.16.49లక్షలు) వరకు ఫైన్ ఉంటుందని పేర్కొన్నారు. అలాగే వాహనాన్ని నెల రోజుల పాటు జప్తు చేయడం జరుగుతుంది. అంతేగాక వాహనదారుడి ఖాతాలో 12 బ్లాక్ పాయింట్లు కూడా చేరుతాయి. 2020లో తీసుకొచ్చిన చట్టం నెం.05 ప్రకారం ఈ జరిమానా విధించడం జరుగుతుందని ట్రాఫిక్ పోలీస్ శాఖ స్పష్టం చేసింది. 


అందుకే రోడ్లపైకి వచ్చే ముందు వాహనదారులు వీటిని దృష్టిలోపెట్టుకుని జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని అబుధాబి ట్రాఫిక్ విభాగం హెచ్చరించింది. ట్రాఫిక్ సిగ్నల్ పడిన వెంటనే వాహనాలను ఆపేయాలని, ముఖ్యం డ్రైవింగ్ చేసే సమయంలో సెల్‌ఫోన్ వాడటం చేయకూడదని పేర్కొంది. డ్రైవింగ్ చేసే సమయంలో ఫోన్ చూడటం వల్ల దాని ధ్యాసలోపడి ప్రమాదాలకు కారణమవుతుందని తెలిపింది. భారీ వాహనాల డ్రైవర్లు ట్రాఫిక్ సంజ్ఞల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ట్రాఫిక్ సూచనలను పాటించడం ద్వారా ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చని చెప్పారు. ఈ సందర్భంగా అబుధాబిలోని వివిధ చౌరస్తాలలో రెడ్ సిగ్నల్ జంపింగ్ కారణంగా సంభవించిన కొన్ని ప్రమాదాలకు సంబంధించిన వీడియోను వాహనదారుల అవగాహన కోసం అబుధాబి ట్రాఫిక్ విభాగం ట్విటర్ ద్వారా పంచుకుంది.    



Updated Date - 2021-10-23T18:52:33+05:30 IST