రహదారులపై రక్తధార

ABN , First Publish Date - 2022-05-23T08:47:21+05:30 IST

ఓచోట ఆటో రెండు ముక్కలైంది.. మరోచోట కారు 40 అడుగుల ఎత్తు నుంచి కిందపడింది..

రహదారులపై రక్తధార

  • రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 16 మంది దుర్మరణం
  • వరంగల్లో ఆటో 2 ముక్కలు.. డ్రైవర్‌, ఇద్దరు మహిళల మృతి
  • హనుమకొండలో ఫ్లైఓవర్‌ మీదనుంచి పడిపోయిన కారు
  • మిషన్‌ భగీరథ టెక్నికల్‌ ఆఫీసర్‌ దంపతుల కన్నుమూత
  • పలు జిల్లాల్లో జరిగిన దుర్ఘటనల్లో మరో 11 మంది..
  • ఎక్కువశాతం ప్రమాదాలు అర్ధరాత్రి, తెల్లవారుజామునే!


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): ఓచోట ఆటో రెండు ముక్కలైంది.. మరోచోట కారు 40 అడుగుల ఎత్తు నుంచి కిందపడింది.. ఇంకోచోట కారు దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టింది.. 

ఓ ప్రమాదంలో డీసీఎం క్యాబిన్‌లోంచి వ్యక్తి ఎగిరి కిందపడ్డాడు. మరో దుర్ఘటనలో లారీ మ్యత్యువై ఎదురొచ్చింది.. ఇంకొన్నిచోట్ల అనూహ్యంగా ప్రాణాలు పోయాయి..! ఆదివారం రాష్ట్రంలోని రహదారులు నెత్తురోడాయి. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు సహా 16 మంది దుర్మరణం పాలయ్యారు.


ఆటో ముక్కలు.. మృతదేహాలు చెల్లాచెదురు

గుర్తుతెలియని వాహనం ఢీకొని.. ఆటో రెండు ముక్కలై ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన వరంగల్‌ జిల్లా ఖిలావరంగల్‌ మండలం బొల్లికుంట సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. ఖిలావరంగల్‌ మండలం అల్లిపురం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్‌ ఎస్‌కే యాకుబ్‌పాషా అలియాస్‌ బబ్లూ(23) వాహనం తీసుకుని ఖమ్మం బయల్దేరాడు. హనుమకొండ ప్రశాంత్‌నగర్‌కు చెందిన పల్లెపు పద్మ (35), వల్లెపు మీనా(28) వర్ధన్నపేటకు వెళ్లి తిరిగివస్తూ బబ్లూ ఆటో ఎక్కారు. అయితే, అతివేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం వీరి ఆటోను ఢీకొంది. ప్రమాద తీవ్రతకు మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదరుగా పడిపోయాయి. ఆటోలోంచి ఇనుప ముక్కలు సమీపంలోని ఇళ్లలో పడ్డాయి. మామునూరు పోలీసులు మృతదేహాలను ఎంజీఎం మార్చురీకి తరలించారు.  


కారుతో దూసుకెళ్లి.. చెట్టును ఢీకొని 

కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం శివారులో కారు అతివేగంతో అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో కరీంనగర్‌కు చెందిన నగునూరి అజిత్‌కుమార్‌ (23), గవిదేపెరు ప్రవీణ్‌కుమార్‌ (22) దుర్మరణం పాలయ్యారు. శనివారం అర్ధరాత్రి స్నేహితులు, బంధువులను వరంగల్‌లో దింపి వస్తుండగా.. ప్రవీణ్‌ కారును అజాగ్రత్తగా, అతివేగంగా నడపడంతో ప్రమాదం చోటుచేసుకుంది. 


దురదృష్టం ఎద్దు రూపంలో..

బైక్‌పై వస్తూ ఎద్దు ఢీకొని వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం రామన్నకుంట తండా సమీపంలో ఆదివారం రాత్రి ప్రభుత్వ వైద్యుడు మృతిచెందాడు. నర్సంపేటకు చెందిన కుదురుపాక లక్ష్మి- అశోక్‌ దంపతుల పెద్ద కుమారుడు రాజు(28) ములుగు ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్‌. మిత్రుడి వివాహం ఉండడతో వరంగల్‌ జిల్లా నెక్కొండకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా ఎద్దు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. రాజు తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఎద్దు కూడా చనిపోయింది. 


నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం బాల్నెంపల్లి- చిట్యాల రోడ్డులో లారీ, ద్విచక్ర వాహనం ఢీకొని బాల్నెంపల్లికి చెందిన ఆర్‌ఎంపీ జక్కుల వెంకన్న (42), రమావత్‌ రంగా (28) మృతి చెందారు. వీరి ద్విచక్ర వాహనాన్ని బాల్నెంపల్లి శివారు మలుపు వద్ద అడవిదేవులపల్లికి చెందిన లారీ ఢీకొట్టింది. వెంకన్న అక్కడికక్కడే, రంగా మిర్యాలగూడ తరలిస్తుండగా మృతి చెందారు. ఫ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని టేకులపల్లి-బోడు రహదారిపై దాసుతండా సమీపంలో ఆదివారం తెల్లవారుజామున   రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ఎర్రాయిగూడెం గ్రామానికి చెందిన ఈసం హనుమంతు(35), ఈసం స్వామి(40) పెళ్లి బాజా మోగించి తెల్లవారుజామున తిరిగి వస్తున్నారు. దాసుతండా సమీపంలో వెనుకనుంచి వేగంగా వచ్చిన టిప్పర్‌ ఢీకొట్టింది. 


హనుమంతు అక్కకిక్కడే, స్వామి కొత్తగూడెం ఏరియా ఆసుపత్రిలో చనిపోయారు. ఫ హైదరాబాద్‌ శివారు సూరారం కట్టమైసమ్మ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున టిప్పర్‌, కోళ్లతో ఉన్న డీసీఎం బలంగా ఢీకొన్నాయి. డీసీఎం క్యాబిన్‌లో నిద్రిస్తున్న టోలీచౌకీకి చెందిన మహ్మద్‌ మోతాబ్బిర్‌ (21) ఎగిరి రోడ్డుపై పడి మృతి చెందాడు. టిప్పర్‌ డ్రైవర్‌ ఒక్కసారి యూటర్న్‌ తీసుకోవడంతో ఈ ఘటన జరిగింది. ఫ  సంగారెడ్డి జిల్లా చౌటకూర్‌ మండలం హున్నాపూర్‌ గ్రామం వద్ద సంగారెడ్డి-నాందేడ్‌, అకోలా 161 జాతీయ రహదారిపై టిప్పర్‌ ఢీకొని  అందోలు మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గొర్రెకంటి కిష్టయ్య (35) చనిపోయాడు. ద్విచక్ర వాహనంపై సంగయ్య(40)తో కలిసి సంగారెడ్డి నుంచి వస్తుండగా జోగిపేట వైపు నుంచి వేగంగా వచ్చిన టిప్పర్‌ ఢీకొట్టింది. ఫ  కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ మండలం గట్టుదుద్దెపల్లిలో పూజ కోసం వచ్చిన వాహనం ఢీకొని ఆలయ స్వీపర్‌ అంజమ్మ (50) మృతి చెందింది. అంజమ్మ వాహనం టైర్లకు బొట్టు, నిమ్మకాయలు పెట్టి కొద్ది దూరంలో నిల్చోగా.. డ్రైవర్‌ సంపత్‌ అజాగ్రత్తగా నడిపి ప్రాణాలు బలిగొన్నాడు. ఫ  నిజామాబాద్‌ జిల్లా పెర్కిట్‌లో జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి కారు, ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో షేక్‌ గఫార్‌(21) మృతి చెందాడు. పెర్కిట్‌ నుంచి బైపాస్‌ రోడ్‌ మీదుగా వెళుతుండగా.. బాల్కొండ నుంచి పెర్కిట్‌ వస్తున్న కారు ఢీకొట్టింది. 


మిషన్‌ భగీరథ అధికారి దంపతుల దుర్మరణం’’హనుమకొండ హంటర్‌ రోడ్డులోని.. ఖమ్మం ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిపై ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందారు. . కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం రాజిపల్లి గ్రామానికి చెందిన తాడూరి సారయ్య(54) మిషన్‌ భగీరథ విభాగంలో టెక్నికల్‌ ఆఫీసర్‌. ఖమ్మం గట్టయ్య సెంటర్‌లో భార్య సుజాత(51)తో ఉంటున్నారు. వీరి పెద్ద కుమారుడు అనారోగ్యంతో మృతి చెందగా, చిన్న కుమారుడు సొంత గ్రామంలోనే ఉన్నాడు. ఆదివారం సెలవు కావడంతో సారయ్య, సుజాత.. డ్రైవర్‌ ఖాసీం అలీ(32)తో కలిసి కారులో తెల్లవారుజామున రాజిపల్లికి బయలుదేరారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో హంటర్‌ రోడ్డులోని ఫ్లై ఓవర్‌ మీదకు చేరుకోగానే.. సుబేదారి అదాలత్‌ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. సారయ్య కారు ఫ్లైఓవర్‌ గోడను ఢీకొని 40 అడుగల ఎత్తు నుంచి కిందకు పడింది. సుజాత అక్కడికక్కడే, సారయ్య ఎంజీఎం ఆస్పత్రిలో మృతి చెందారు. ఖాసీం అలీ పరిస్థితి విషమంగా ఉంది. 

Updated Date - 2022-05-23T08:47:21+05:30 IST