రాబోయే 24 గంటల్లో16 విమానాలతో భారతీయుల తరలింపు: కేంద్రం

ABN , First Publish Date - 2022-03-05T02:30:13+05:30 IST

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత పౌరులను వెనక్కి తీసుకు వచ్చేందుకు వచ్చే 24 గంటల్లో ఐఏఎఫ్ సీ-17 విమానం సహా ..

రాబోయే 24 గంటల్లో16 విమానాలతో భారతీయుల తరలింపు: కేంద్రం

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత పౌరులను వెనక్కి తీసుకు వచ్చేందుకు వచ్చే 24 గంటల్లో ఐఏఎఫ్ సీ-17 విమానం సహా 16 విమానాలను నడుపుతున్నట్టు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఎప్పటికప్పుడు భారత్ ఇస్తున్న అడ్వయిజరీలతో 20,000 మందికి పైగా భారతీయులు ఉక్రెయిన్ సరిహద్దులను దాటారని, రాబోయే రోజల్లో ఈ సంఖ్య మరింత పెరగవచ్చని ఎంఈఏ ప్రతినిధి అరిందమ్ బాగ్చి శుక్రవారంనాడు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ప్రత్యేక రైళ్ల కోసం ఉక్రెయిన్‌కు ఎంఈఏ అధికారులు విజ్ఞప్తి చేశారని, అయితే ఇంకా వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదని తెలిపారు. తూర్పు ఉక్రెయిన్‌లోని ఖార్కివ్, పిసోచిన్‌లపై తాము ప్రత్యేకంగా దృష్టి పెట్టామని, అక్కడి నుంచి బస్సులు ఏర్పాటు చేయగలిగామని, ఐదు బస్సులను ఇప్పటికే నడుపుతున్నామని, మరికొన్ని బస్సులను కూడా రంగంలోకి దించుతామని చెప్పారు. పిసోచిన్‌లో 900 నుంచి 1000 మంది, సుమైలో 700 మంది వరకూ భారతీయులు చిక్కుకుపోయినట్టు ఆయన తెలిపారు.


కష్టమే కానీ ...

కాల్పుల విరమణ జరగకుండా భారతీయులను తరలించే ప్రక్రియ  కష్టమేనని బాగ్చి అంగీకరించారు. లోకల్ సీజ్‌ఫైర్ కోసం ఇరు వర్గాలను (ఉక్రెయిన్-రష్యా) తాము కోరామని, అలా జరిగితే విద్యార్థులతో సహా మన వాళ్లను (భారతీయులను) అక్కడి నుంచి తరలించ గలుగుతామని చెప్పారు. కాగా, ఉక్రెయిన్‌లో బుల్లెట్ గాయాలతో గాయపడిన భారతీయుడు హర్జోత్ సింగ్‌కు కీవ్ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోందని,  ఎప్పటికప్పుడు అతని సమాచారాన్ని ఉక్రెయిన్‌లో భారత ఎంబసీ నుంచి తెలుసుకుంటున్నామని ఆయన తెలిపారు.

Updated Date - 2022-03-05T02:30:13+05:30 IST