4 రోజులు.. 16 మరణాలు

ABN , First Publish Date - 2022-03-12T08:44:55+05:30 IST

నాలుగు రోజుల్లో 16 మంది మృత్యువాత పడటం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కలకలం రేపుతోంది.

4 రోజులు.. 16 మరణాలు

జంగారెడ్డిగూడెం, మార్చి 11: నాలుగు రోజుల్లో 16 మంది మృత్యువాత పడటం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కలకలం రేపుతోంది. తమ వారంతా సారా తాగి చనిపోయారని బాధిత కుటుంబాలు చెబుతుంటే.. అధికారులు మాత్రం వేర్వేరు కారణాలు ఉన్నాయంటున్నారు. చనిపోయిన వారిలో కొప్పాక వెంకటేశ్వరరావు(48), వేగేశ్న వెంకటసుబ్బారావు(48), బంకూరి రాంబాబు,(60) పైడేటి సత్యనారాయణ(73), చిద్రం పోసియ్య(38), బం గారు ఎర్రయ్య(65), చింతపల్లి సూరిబాబు(42), బండారు శ్రీను (49), దోసూరి సన్యాసిరావు(38), పులపర్తి సత్యనారాయణ(62), సలాడి ఆనంద్‌ (43), పితాని రమణ(36), ముడిచర్ల అప్పారావు (46), చంద్రగిరి శ్రీను(40), కాళ్ల దుర్గారావు(61), దేవరశెట్టి చక్రపాణి(64) ఉన్నారు. విచారణ జరిపేందుకు శుక్రవారం ఉదయమే అధికారులు రంగంలోకి దిగారు. జిల్లా ఎస్పీతోపాటు వైద్య, రెవెన్యూ, సచివాలయ శాఖల అధికారులు మృతుల నివాసాలకు వెళ్లి కుటుంబ సభ్యులను విచారించారు. ‘జంగారెడ్డిగూడెంలో 6,8,9,10 తేదీల్లో 16 మంది మరణించినట్టు గుర్తించాం. అందరూ నాటు సారా తాగి చనిపోయారనడంలో వాస్తవం లేదు. వివిధ అనారోగ్య కారణాల వల్ల 13మంది చనిపోతే.. మరో ముగ్గురికి మద్యం సేవించే అలవాటుంది. ఈ ముగ్గురూ వేర్వేరు తేదీల్లో చనిపోయారు. వీరంతా జంగారెడ్డిగూడెంలోనే వేర్వేరు ప్రదేశాలకు చెందినవారు’ అని ఆర్డీవో ప్రసన్నలక్ష్మి తెలిపారు.


నా భర్త సారా వల్లే చనిపోయాడు: పోశయ్య భార్య 

‘సారా తాగడం వల్లే నా భర్త చనిపోయాడు. హోటల్లో వంట మేస్త్రీగా పనిచేసేవాడు. రోజూ సారా తాగుతాడు. షుగర్‌, బీపీ లేవు. మొదట్లో మందు తాగేవాడు. ఇప్పుడు ధరలు పెరగడంతో సారా తాగడం మొదలు పెట్టాడు. 2రోజుల క్రితం సారాతాగి ఇంటికివచ్చాడు. వెంటనే వాంతులు, విరోచనలయ్యాయి. ఏలూరు ఆస్పత్రిలో చనిపోయాడు’ అని చెప్పింది.


ప్రాణాలు పోతున్నా స్పందించరా?:  చంద్రబాబు 

అమరావతి, మార్చి 11(ఆంధ్రజ్యోతి): జంగారెడ్డిగూడెంలో మరణాలు, నంద్యాలలో విద్యార్థుల అస్వస్థతపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. ‘జంగారెడ్డిగూడెంలో మూడురోజుల్లో 16మంది ఆస్పత్రిలో చేరిన గంటల వ్యవఽధిలో మృతిచెందారు. దీనికి కారణాలేంటనేది స్పష్టంచేసి స్థానికుల భయాందోళనలు పోగొట్టాలి. మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలి’ అని డిమాండ్‌ చేశారు. కాగా, జంగారెడ్డిగూడెంలో సారా మరణాలన్నీ జగన్‌రెడ్డి సర్కారు చేసిన హత్యలేనని నారా లోకేశ్‌ ఆరోపించారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-03-12T08:44:55+05:30 IST