దారితప్పిన బాలుడు.... ఆ రాత్రి మర్చిపోలేని అనుభవం

ABN , First Publish Date - 2021-10-05T00:11:55+05:30 IST

దారితప్పిన ఓ బాలుడు ఒంటరిగా రాత్రంగా అడవిలో గడిపాడు. వెన్నులో వణుకుపుట్టించే ఈ ఘటన కేరళలో జరిగింది. కటిక చీకటిలో

దారితప్పిన బాలుడు.... ఆ రాత్రి మర్చిపోలేని అనుభవం

కసరగాడ్: దారితప్పిన ఓ బాలుడు ఒంటరిగా రాత్రంగా అడవిలో గడిపాడు. వెన్నులో వణుకుపుట్టించే ఈ ఘటన కేరళలో జరిగింది. కటిక చీకటిలో జంతువుల అరుపుల మధ్య రాత్రంతా బిక్కుబిక్కుమంటూ అడవిలోనే ఉన్న ఆ బాలుడిని ఉదయాన్ని కనుగొడంతో బాలుడి కథ సుఖాంతమైంది. బలాల్ పంచాయత్‌ కొన్నక్కడు వార్డులోని వల్లియ పమతటు అడవి సమీపంలో ఉంటుంది. అటవీప్రాంతంలోని కొండల్లో జాలువారే నీటిని పీవీసీ పైపుల ద్వారా ట్యాంకుల్లోకి ఎక్కించుకుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు పైపులు పక్కకు పడిపోయినా, అటవీ జంతువులు వాటిని కొరికిపడేసినా నీళ్లు ఆగిపోతాయి. 


15 ఏళ్ల లీజేష్ శనివారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుకుంటుండగా పిలిచిన తల్లి షల్లీ షాజీ ట్యాంకులోని నీళ్లు రావడం లేదని పైపు ఏమైనా పక్కకు జరిగిందేమో చూసి సరిగా పెట్టి రావాలని కోరింది. నిక్కరు మాత్రమే ధరించిన లీజేష్ తల్లిమాటలతో వెంటనే అడవిలోకి పరుగందుకున్నాడు. లీజేష్ ఇది ఎప్పుడూ చేసే పనే. ఆ తర్వాత కాసేపటికే ట్యాంకులో నీళ్లు పడుతుండడాన్ని గమనించిన షాజీ.. 45 నిమిషాలు అవుతున్నా కుమారుడి జాడ లేకపోవడంతో ఆందోళన చెందింది.


ఆరున్నర గంటల సమయంలో లీజేష్ తండ్రి షాజి వట్టమల, తల్లి షల్లీ ఆందోళన చెందుతుండడంతో గమనించిన ఇరుగుపొరుగువారు విషయం తెలిసి ధైర్యం చెప్పారు. అందరూ కలిసి లీజేష్ కోసం వెతకులాట మొదలుపెట్టారు. వారికి మరికొందరు కలిశారు. ఓ గంట తర్వాత కొన్నక్కడు గ్రామస్థులు వారికి జతకలిశారు. సమాచారం అందుకున్న పోలీసులు కూడా ఆ తర్వాత వారికి తోడయ్యారు. అందరూ కలిసి అడవిలోకి వెళ్లారు. 


అయితే, సాయంత్రం ఏడు గంటల సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. దీంతో ముందుకెళ్లలేని పరిస్థితి నెలకొంది. లీజేష్ ఒక్కడే వెళ్లి ఉంటాడని తాను అనుకోలేదని తల్లి కన్నీరు కార్చింది. అయితే, అడవిలో ఎక్కడే క్షేమంగానే ఉండి ఉంటాడని తనలో తనే ధైర్యం చెప్పుకుంది. అయితే, పాములు, ఏనుగుల నుంచి అతడికి ముప్పు ఎక్కడ వాటిల్లుతుందోననే తన భయమంతా అని ఆవేదన వ్యక్తం చేసింది.


వాతావరణం మరింత కఠినంగా మారడంతో లీజేష్ కోసం వెతుకులాట ఆపేసి తిరిగి ఉదయం ఆరు గంటలకు తిరిగి మొదలుపెట్టాలని నిర్ణయించారు. మరోవైపు, అడవిలో చిక్కుకుపోయిన లీజేష్ దాదాపు 14 గంటలపాటు అక్కడే గడిపాడు. ఒంటిమీద చొక్కా కూడా లేకపోవడంతో చలికి అల్లాడిపోయాడు. మరోవైపు, చీమలు అతడిని కొరికిపడేశాయి. అయినప్పటికీ వాటన్నింటినీ తట్టుకుని అలాగే గడిపాడు. చివరికి మరుసటి రోజు ఉదయం ఏడున్నర గంటల సమయంలో అతడిని కనుగొన్నారు. 


 మలోత్ కసబలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న లీజేష్ మాట్లాడుతూ.. పైపును సరిగా అమర్చి తిరిగి వస్తున్న సమయంలో వెలుతురు మందగించడంతో దారి తప్పిపోయాయని పేర్కొన్నాడు. వెళ్తున్నకొద్దీ అడవే వస్తుండడంతో దారితప్పిపోయానని తెలుసుకున్నానని, దీంతో ఓ పెద్ద బండలాంటి దానిని ఎక్కడి కూర్చున్నానని వివరించాడు. తాను ఎత్తున ఉండడంతో తన కోసం టార్చిలైట్లు పట్టుకుని వస్తున్న వారిని గుర్తించానని, పెద్దగా కేకలు వేసినప్పటికీ హోరున వీస్తున్న గాలిలో అవి కలిసిపోయాయని లీజేష్ చెప్పాడు. తనను వెతుకుతూ వచ్చిన వారిని దాదాపు అయిదుసార్లు చూసినా ఫలితం లేకుండా పోయిందన్నాడు. 


రాత్రంతా వర్షంలో తడుస్తూ వణికిపోయాను కానీ భయపడలేదని అన్నాడు. తన కోసం అందరూ వెతుకుతుండడంతో భయంపడాల్సిన అవసరం లేదనుకున్నానని తెలిపాడు. తెల్లవారి సూర్యుడు ఉదయించడంతో కొండ దిగిన లీజేష్ తిరిగి ఇంటికి పయనమయ్యాడు.


మరోవైపు, ఉదయం ఆరు గంటల సమయంలో సెర్చ్ పార్టీలు మరోమారు లీజేష్ కోసం బయలుదేరాయి. ఈ క్రమంలో 7.30 గంటల సమయంలో కున్హంబు, ప్రసాద్ అనే రైతులు శంకరంగనమ్ అడవిలో లీజేష్‌ను చూశారు. అలా చివరికి ఉదయం 8.15 గంటల సమయంలో తల్లి చెంతకు చేరుకున్నాడు. 

Updated Date - 2021-10-05T00:11:55+05:30 IST