156 కోట్ల డోసులు

ABN , First Publish Date - 2022-01-17T09:06:16+05:30 IST

కరోనా మహమ్మారిపై పోరుకు భారత్‌ నడుం బిగించి ఏడాది పూర్తయింది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి 2021 జనవరి 16వ తేదీన శ్రీకారం చుట్టింది.

156 కోట్ల డోసులు

  • వ్యాక్సినేషన్‌కు ఏడాది పూర్తి
  • కొవ్యాక్సిన్‌పై పోస్టల్‌ స్టాంప్‌ విడుదల 


న్యూఢిల్లీ, జనవరి 16: కరోనా మహమ్మారిపై పోరుకు భారత్‌ నడుం బిగించి ఏడాది పూర్తయింది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి 2021 జనవరి 16వ తేదీన శ్రీకారం చుట్టింది. ఈ వ్యవధిలో ప్రజలకు మొత్తం 156.76 కోట్ల టీకా డోసులు వేశారు. 18 ఏళ్లు పైబడిన వారిలో 93ు మందికి కనీసం ఒక డోసు అందగా, 70ు మందికి రెండు డోసులు వేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని భారత్‌ బయోటెక్‌, భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవ్యాక్సిన్‌పై పోస్టల్‌ స్టాంప్‌ను కేంద్రం విడుదల చేసింది. కరోనాపై భారత్‌ చేపట్టిన పోరుకు వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ఎంతో బలాన్ని ఇచ్చిందని ప్రధాని మోదీ ట్వీటర్‌లో పేర్కొన్నారు. దానివల్ల ఎంతోమంది ప్రాణాలను నిలుపగలిగామని తెలిపారు. ‘‘వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి నా సెల్యూట్‌. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది’’ అన్నారు. టీకా కార్యక్రమంలో వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తల పాత్ర ఎనలేనిది. 


వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ మొదలై విజయవంతంగా ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ, దేశ ప్రజలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అభినందనలు తెలిపారు. ‘‘దృఢమైన ప్రధాని మోదీ నాయకత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. 92 శాతానికిపైగా దేశ జనాభాకు ఇప్పటికే టీకా మొదటి డోసు అందింది’’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా వ్యాఖ్యానించారు. ‘‘వ్యాక్సినేషన్‌లో సాధించిన విజయానికి అందరూ గర్వించాల్సిన సమయం ఇది. కొవ్యాక్సిన్‌ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన శాస్త్రవేత్త లందరికీ అభినందనలు’’ అని కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ అన్నారు. కాగా, గత ఏడాది వ్యవధిలో దేశంలో అత్యధిక వ్యాక్సినేషన్‌ జరిగిన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర ఉన్నాయి. మహారాష్ట్రలో టీకా కార్యక్రమానికి ఇప్పటివరకు 14.30 కోట్ల డోసులను వినియోగించారు. ఇది దేశవ్యాప్తంగా జరిగిన మొత్తం వ్యాక్సినేషన్‌లో 9.15 శాతానికి సమానం.

  

వ్యాక్సిన్‌ వికటించి ముగ్గురు మృతి

తట్టు, ఆటలమ్మ వంటి జబ్బులను నియంత్రించేందుకు ఇచ్చే రుబెల్లా వ్యాక్సిన్‌ కారణంగా కర్ణాటక రాష్ట్రం బెళగావి జిల్లాలో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. రామదుర్గ తాలూకా సాలహళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో చిన్నారుల మృతి విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. 


బడుల మూసివేత సరికాదు

కొవిడ్‌ మహమ్మారి కారణంగా పాఠశాలలు మూసివేయడం సరికాదని, చిట్టచివరి మార్గంలోనే బడుల మూసివేత గురించి ఆలోచించాలని ప్రపంచ బ్యాంకు ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ జైమ్‌ సావేద్ర అన్నారు. స్కూళ్లను పునఃప్రారంభించడం వల్లే కరోనా కేసులు పెరుగుతున్నాయని, బడులు సురక్షితం కాదని అనడంలో ఎటువంటి ఆధారాలు లేవని ఆయన పేర్కొన్నారు. అలాగే పిల్లలకు వ్యాక్సిన్‌ వేసేంత వరకు ఎదురుచూడడం కూడా అర్థంలేదని అభిప్రాయపడ్డారు. ‘‘బడుల పునఃప్రారంభానికి, కరోనా వ్యాప్తికి లంకె పెట్టరాదు. కొత్త వేవ్‌లు వచ్చినా స్కూళ్లను మూసివేయడం చిట్టచివరి అంశం కావాలి. బడులు తెరిచినా పిల్లలకు ఉండే ముప్పు అతితక్కువ. పాఠశాలల మూసివేత వల్ల జరిగే నష్టం అతిఎక్కువ’’ అని సావేద్ర పేర్కొన్నారు. ఆదివారం పీటీఐతో వాషింగ్టన్‌ నుంచి ఫోన్‌లో ఆయన మాట్లాడారు.


అభాగ్య బాలలు @ 1.47 లక్షలు

కొవిడ్‌, ఇతర కారణాల వల్ల 2020 ఏప్రిల్‌ 1 నుంచి దేశవ్యాప్తంగా 1,47,492 మంది చిన్నారులు తమ తల్లినో, తండ్రినో లేక ఇద్దరినీనో కోల్పోయారని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ (ఎన్సీపీసీఆర్‌) సుప్రీంకోర్టుకు తెలిపింది. ‘బాల్‌ స్వరాజ్‌ పోర్టల్‌-కొవిడ్‌ కేర్‌’లో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు 2020 ఏప్రిల్‌ 1 నుంచి 2022 జనవరి 11 దాకా అప్‌లోడ్‌ చేసిన సమాచారం ఆధారంగా ఎన్సీపీసీఆర్‌ ఈ వివరాలను సమర్పించింది. ఆ వివరాల ప్రకారం.. 1.47 లక్షల మందిలో 10,094 మంది తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయి అనాథలైనవారు కాగా, 1,36,910 మంది తల్లినో తండ్రినో పోగొట్టుకున్నవారు. వీరందరి ప్రయోజనాలను పరిరక్షించడానికి తాము చర్యలు తీసుకుంటున్నట్టు ఎన్సీపీసీఆర్‌ కోర్టుకు తెలిపింది.

Updated Date - 2022-01-17T09:06:16+05:30 IST