వానరం అంత్యక్రియలకు పోటెత్తిన జనం.. 1500 మంది హాజరు

ABN , First Publish Date - 2022-01-11T21:29:10+05:30 IST

ఊరిలో చలాకీగా తిరిగే వానరం మృతితో గ్రామస్థులు చలించిపోయారు. అందరూ కలిసి దానికి అంత్యక్రియలు నిర్వహించారు

వానరం అంత్యక్రియలకు పోటెత్తిన జనం.. 1500 మంది హాజరు

భోపాల్: ఊరిలో చలాకీగా తిరిగే వానరం మృతితో గ్రామస్థులు చలించిపోయారు. అందరూ కలిసి దానికి అంత్యక్రియలు నిర్వహించారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఒక వ్యక్తి గుండు గీయించుకున్నాడు. అనంతరం అందరూ కలిసి దశదిన కర్మ కూడా నిర్వహించారు.


ఈ కార్యక్రమానికి ఏకంగా 1500 మంది హాజరయ్యారు. కరోనా నిబంధనలు అమల్లో ఉన్న సమయంలో ఈ తంతు జరగడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. 


రాష్ట్రంలోని రాజ్‌గఢ్ జిల్లా దలుపురాలో గ్రామస్థులతో కలిసిపోయిన ఓ వానరం డిసెంబరు 29న మరణించింది. దీంతో గ్రామస్థులందరూ కలిసి దానికి అంత్యక్రియలు నిర్వహించారు. హిందూ సంప్రదాయం ప్రకారం హరిసింగ్ అనే వ్యక్తి గుండు గీయించుకున్నాడు. వానరం దశదిన కర్మను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన గ్రామస్థులు చందాలు వేసుకున్నారు. కార్డులు ముద్రించి గ్రామమంతా పంచిపెట్టారు. అనంతరం నిర్వహించిన దశదిన కర్మ విందుకు 1500 మంది హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు కదిలారు.


అయితే, కరోనా ఆంక్షలు అమల్లో ఉన్న సమయంలో వానరం అంత్యక్రియల్లో పెద్ద ఎత్తున పాల్గొనడం, ఆ తర్వాత విందుకు 1500 మంది హాజరు కావడం నిబంధనలకు విరుద్ధమంటూ పోలీసులు కేసులు నమోదు చేశారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించాంరంటూ ఇద్దరిని అరెస్ట్ చేయడంతో భయపడిన మిగతా వారు పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 



Updated Date - 2022-01-11T21:29:10+05:30 IST