తొమ్మిదో తరగతి కుమారుడికి స్మార్ట్‌ఫోన్‌

ABN , First Publish Date - 2021-06-20T10:49:38+05:30 IST

తొమ్మిదో తరగతి చదువుతున్న తన కుమారుడికి ఆన్‌లైన్‌ క్లాసులున్నాయని స్మార్ట్‌ఫోన్‌ కొనిచ్చాడు ఆ తండ్రి.

తొమ్మిదో తరగతి కుమారుడికి స్మార్ట్‌ఫోన్‌

  • ఏం నొక్కాడో ఏమో తండ్రి బ్యాంకు ఖాతా నుంచి రూ.1.50 లక్షలు ఖాళీ
  • రైతుబంధు, ధాన్యం, మిర్చి అమ్మిన డబ్బులు మాయం
  • లబోదిబోమంటున్న గిరిజన రైతు.. మహబూబాబాద్‌ జిల్లాలో ఘటన 


కేసముద్రం, జూన్‌ 19 : తొమ్మిదో తరగతి చదువుతున్న తన కుమారుడికి ఆన్‌లైన్‌ క్లాసులున్నాయని స్మార్ట్‌ఫోన్‌ కొనిచ్చాడు ఆ తండ్రి. అందులో ఏ ఆప్షన్లు నొక్కాడో ఏమో ఆ తండ్రి బ్యాంకు ఖాతా నుంచి రూ.1.5 లక్షలు ఖాళీ అయ్యాయి. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం భూక్యరామ్‌ తండా జీపీ పరిధిలోని కాలనీ తండాకు చెందిన వాంకుడోత్‌ వెంకన్నకు కేసముద్రం ఎస్‌బీఐలో ఖాతా ఉంది. ఈనెల 15న ధాన్యం విక్రయించగా రూ.83,827, 17న రైతుబంధు పథకం కింద వచ్చిన రూ.11,875ను వెంకన్న ఈ ఖాతాలో జమ చేశారు. అలాగే మిర్చి అమ్మగా వచ్చిన డబ్బులనూ జమ చేశారు. మొత్తం ఈ ఖాతాలో రూ.1.50 లక్షల నిల్వ ఉంది. 


శనివారం విత్తనాలు కొనేందుకు డబ్బులు అవసరమై డ్రా చేసేందుకు ఆయన బ్యాంకుకు వెళ్లగా రూ.613 నిల్వ చూపడంతో దిగ్ర్భాంతి చెందారు. దీంతో బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్‌ను తీయించారు. ఇందులో ఈనెల 14 నుంచి 19వ తేదీ వరకు పలుమార్లు రూ.1.50 లక్షల నగదు బదిలీ అయినట్లు చూపింది. అయితే తొమ్మిదో తరగతి చదువుతున్న తన కుమారుడికి ఆన్‌లైన్‌ తరగతుల కోసం స్మార్ట్‌ ఫోన్‌ కొనిచ్చానని, ఫోన్‌పే యాప్‌కు తన బ్యాంకు ఖాతాను అనుసంధానం చేశానని వెంకన్న తెలిపారు. ఏ ఆప్షన్‌ నొక్కాడో తెలియడం లేదని రైతు వాపోయారు.  కష్టపడి పండించిన పంట డబ్బులు మాయమయ్యాయని బోరున విలపించారు. తన డబ్బులు ఇప్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధిత రైతు తెలిపారు.

Updated Date - 2021-06-20T10:49:38+05:30 IST