కొవిడ్‌ మృతుల ‘అంత్యక్రియల’కు రూ.15 వేలు

ABN , First Publish Date - 2021-05-17T06:42:53+05:30 IST

కొవిడ్‌ మృతుల అంత్యక్రియల ఖర్చుకు రూ.15 వేలు చెల్లించాలి. బాధితులకు ప్లాస్మా దానం చేసిన వారికీ పోషకాహార సప్లిమెంట్లకోసం రూ.ఐదు వేలు ఇవ్వాలి.

కొవిడ్‌ మృతుల   ‘అంత్యక్రియల’కు రూ.15 వేలు

కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు 

తొమ్మిది నెలల తర్వాత తాజాగా మరో జీవో 


గతేడాది ఆదేశాలివీ 

కొవిడ్‌ మృతుల అంత్యక్రియల ఖర్చుకు రూ.15 వేలు చెల్లించాలి. బాధితులకు ప్లాస్మా దానం చేసిన వారికీ పోషకాహార సప్లిమెంట్లకోసం రూ.ఐదు వేలు ఇవ్వాలి. 

- గతేడాది ఆగస్టు మూడున కలెక్టర్లకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు.  

కొవిడ్‌ బాధితులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే సమయంలో రూ.2 వేలు ఇవ్వాలనీ అంతకుముందు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇంటి వద్ద కొంతకాలం మంచి పోషకాహారం తీసుకునేందుకు ఈ మొత్తం ఇస్తున్నట్లు ప్రకటించింది. 


అమలు తీరిలా.. 

గతేడాది కొవిడ్‌ మృతుల అంత్యక్రియల ఖర్చు బాధిత కుటుంబాలకు ఎవరి ద్వారా పంపిణీ చేశారు? ఎంత ఖర్చు చేశారు? అనే దానిపై స్పష్టమైన వివరాలు లేవు. అసలు ఈ అంత్యక్రియల ఖర్చు పథకం అమలుకు పాటించాల్సిన స్పష్టమైన విఽధి విధానాలనూ ప్రభుత్వం నిర్దేశించలేదు. 

ఇక, కరోనా బాధితులకు డిశ్చార్జి సమయంలో సమయంలో రూ.రెండు వేల చొప్పున సుమారు రెండు నెలలపాటు చెల్లించారు. ఆ తర్వాత కాలక్రమంలో నిధులు విడుదల కాలేదంటూ ఈ చెల్లింపులకు ఫుల్‌స్టాప్‌ పెట్టారు. ప్లాస్మా దానం చేసిన వారి పరిస్థితీ అంతే. వీటన్నింటికీ నిధుల కొరతే కారణంగా చెప్పుకొచ్చారు. 


తాజాగా మరో జీవో 

కొవిడ్‌ మృతుల అంత్యక్రియల ఖర్చుకోసం రూ.15 వేల చొప్పున కలెక్టరు చెల్లించాలని ఆదేశిస్తూ ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. తొమ్మిది నెలల తర్వాత మరో జీవో విడుదలైంది. ఈ చెల్లింపులను పారదర్శకంగా అమలు చేస్తే రోజువారీ కొవిడ్‌ మృతుల వాస్తవ సంఖ్య కూడా వెల్లడయ్యే అవకాశముంది. కొవిడ్‌ మృతుల సంఖ్యకు, ప్రభుత్వం ప్రకటిస్తున్న సంఖ్యకూ ఏ మాత్రం పొంతన లేదని గత వారం రుయాలో జరిగిన ఆక్సిజన్‌ దుర్ఘటనతో వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఇక కొవిడ్‌తో మృతి చెందుతున్న చాలామంది మరణ నివేదికల్లో చివరగా ‘కార్డియాక్‌ అరెస్ట్‌’ (గుండె ఆగి మరణించడం)గా చూపుతున్నారు. దీంతో చాలా భాగం మరణాలు కొవిడ్‌ కోవలోకి రాకుండా పోతున్నాయి. ఈ దశలో గుండె ఆగి లేక ఇతర కారణాలతో మరణించినా కొవిడ్‌ పరీక్షలో పాజిటివ్‌గా వెల్లడయితే దాని ఆధారంగా అంత్యక్రియల ఖర్చు చెల్లించ వచ్చా అనే విషయంలోనూ సందిగ్ధత ఉంది. ఇక, కొవిడ్‌ మృతుల అంత్యక్రియల ఖర్చు అధికంగా మారింది. దీనికి భయపడి చాలా మంది పేదలు ఆస్పత్రుల్లోనే మృతదేహాలను వదిలేయడం కూడా పరిపాటిగా ఉంది. ఇక కొన్ని చోట్ల కొన్ని సంఘాలు సామాజిక స్పృహతో సామూహిక అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. వీటన్నిటికీ ప్రభుత్వం ఇచ్చే అంత్యక్రియల ఖర్చులు వర్తిస్తాయా లేదా అనే విషయంలోనూ వివరణల్లేవు. అంత్యక్రియల ఖర్చుల చెల్లింపులు కొవిడ్‌ రోగి మృతి చెందిన ఆసుపత్రుల ద్వారా చెల్లించాలా? లేక స్థానికంగా తహసీల్దార్ల ద్వారా పంపిణీ చేయాలా అనే దానిపైనా ప్రభుత్వం నుంచి ఎలాంటి సూచనలు లేవు. 

- కలికిరి 

Updated Date - 2021-05-17T06:42:53+05:30 IST