కౌలు రైతులకూ 15 వేల సాయం

ABN , First Publish Date - 2022-05-07T08:26:49+05:30 IST

రాష్ట్రంలో ఏడాదిలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని, రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. గతంలో కాంగ్రెస్‌ అఽధికారంలో ఉన్నపుడు ఏకకాలంలో రైతుల రూ.73 వేల కోట్ల రుణాలను మాఫీ...

కౌలు రైతులకూ 15 వేల సాయం

‘ఇందిరమ్మ రైతు భరోసా’ పథకం తెచ్చి ఇస్తాం

భూమిలేని రైతు కూలీలకు ఏటా రూ.12 వేలు

రూ.2 లక్షల రైతు రుణాలు ఏకకాలంలో మాఫీ

రూ.2,500 మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు

మొక్కజొన్నకు రూ.2,200, మిర్చికి 15 వేలు

అన్ని పంట ఉత్పత్తులకూ గిట్టుబాటు ధరలు

ధరణి పోర్టల్‌ రద్దు.. సరళమైన రెవెన్యూ వ్యవస్థ

ఉపాధి హామీ పథకం వ్యవసాయంతో లింకు.. పసుపు బోర్డు ఏర్పాటు

చక్కెర మిల్లుల రీ ఓపెన్‌.. పోడు రైతులకు యాజమాన్య హక్కు పట్టాలు

అసైన్డ్‌ భూముల క్రయవిక్రయాలకు అవకాశం.. ‘రైతు కమిషన్‌’ ఏర్పాటు

రైతు కూలీలకూ రైతుబీమా పథకం వర్తింపు: రేవంత్‌రెడ్డి

వరంగల్‌ సభలో రైతు డిక్లరేషన్‌ ప్రకటించిన తెలంగాణ పీసీసీ చీఫ్‌


హనుమకొండ/హైదరాబాద్‌, మే 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఏడాదిలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని, రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. గతంలో కాంగ్రెస్‌ అఽధికారంలో ఉన్నపుడు ఏకకాలంలో రైతుల రూ.73 వేల కోట్ల రుణాలను మాఫీ చేసిందని, మళ్లీ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తుందని ప్రకటించారు. అదే క్రమంలో ‘ఇందిరమ్మ రైతుభరోసా పథఽకం’ తెచ్చి భూమి కలిగిన రైతులతోపాటు కౌలు రైతులకు కూడా ప్రతి ఎకరానికీ ఏడాదికి రూ.15 వేలు పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదు చేసుకున్న భూమిలేని రైతుకూలీలకు ప్రతి ఏడాది రూ.12 వేలు చెల్లిస్తామని ప్రకటించారు. వరి ధాన్యానికి కనీస మద్దతు ధరను రూ.2,500కు పెంచి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు పండించిన అన్ని పంట ఉత్పత్తులకూ కనీస మద్దతు ధర కంటే ఎక్కువ చెల్లించి కొనుగోలు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటనలో భాగంగా శుక్రవారం వరంగల్‌లో నిర్వహించిన ‘రైతు సంఘర్షణ సభ’లో రైతు డిక్లరేషన్‌ను రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రైతు సమస్యల శాశ్వత పరిష్కారం కోసం చట్టబద్ధమైన ‘రైతు కమిషన్‌’ను ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలో భూముల స్వభావం, వాతావరణ పరిస్థితులకు తగినట్లుగా పంటల ప్రణాళికను రూపొందించి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామన్నారు. రైతును రాజును చేయడమే కాంగ్రెస్‌ లక్ష్యమని, అది రాహుల్‌గాంధీతోనే సాధ్యమవుతుందని అన్నారు.


‘ధరణి’ని రద్దు చేస్తాం..

రైతులను ముప్పుతిప్పలు పెడుతున్న ‘ధరణి’ పోర్టల్‌ను రద్దు చేసి సరళతరమైన సరికొత్త రెవెన్యూ వ్యవస్థను తీసుకవస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. పోడు రైతులకు యాజమాన్య హక్కు పట్టాలు ఇస్తామని, అసైన్డ్‌ భూముల లబ్ధిదారులకు భూమిపై యాజమాన్య హక్కులు, క్రయ- విక్రయ హక్కులు కల్పిస్తామని ప్రకటించారు. నకిలీ విత్తనాలు, పురుగు మందుల నియంత్రణకు కఠిన చట్టాలు తెచ్చి.. బాఽధ్యులైన సంస్థలు, వ్యక్తుల ఆస్తులు జప్తుచేసి రైతులకు పరిహారం ఇప్పిస్తామని, అక్రమార్కులపై పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామని అన్నారు. నిర్దిష్ట సమయ ప్రణాళికతో, అవినీతి రహితంగా పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తిచేసి ప్రతి ఎకరానికీ సాగునీరు అందేలా చేస్తామన్నారు. తెలంగాణలో మూతపడిన చక్కెర కర్మాగారాలను తెరిపించడంతోపాటు పసుపు బోర్డును ఏర్పాటు చేసి చెరకు, పసుపు రైతులకు పూర్వవైభవం తీసుకొస్తామని పేర్కొన్నారు. రైతులపై భారంలేని పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టి.. ప్రకృతి విపత్తులతో పంటనష్టం జరిగితే త్వరితగతిన నష్టాన్ని అంచనా వేయించి పరిహారం అందిస్తామని భరోసా ఇచ్చారు. రైతు కూలీలు, భూమిలేని రైతులకు సైతం ‘రైతుబీమా’ పథకాన్ని వర్తింపజేస్తామని, ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని తెలిపారు.

 

కాంగ్రె్‌సపై గురుతరమైన బాధ్యత..

‘‘రాష్ట్రంలో నిత్యం రైతుల చావుకేకలు వినిపిస్తున్నాయి. 20 నుంచి 40 ఏళ్ల యువ రైతులు ఉరితాళ్లకు వేలాడుతున్నారు. పంట నష్టాలు, మోయలేని అప్పులతో పురుగుల మందు తాగి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. నకిలీ విత్తనాలు, పురుగు మందులతో పంటలు నష్టపోతున్నారు. పంటచేతికి వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర లభించడంలేదు. రైతులు నష్టాల్లో పుట్టి, అప్పుల మధ్య పెరిగి.. వాటికే బలి అవుతున్నారు’’ అని రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రె్‌సపై గురుతరమైన బాధ్యత, రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన అనివార్యత ఉందన్నారు. తెలంగాణలో వ్యవసాయానికి పూర్వవైభవం తేవడానికి నడుం కట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రైతుల హక్కుల కోసం నాటి సాయుధ పోరాటం స్ఫూర్తిగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, విత్తన, ఎరువుల సబ్సిడీ, సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు, పంటల బీమా వంటి రైతు సంక్షేమ పథకాలు అమలు చేసిందని అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధిహమీ పథకం, విద్యాహక్కు, సమాచార హక్కు లాంటి చట్టాలను సామాన్యుడికి అస్త్రాలుగా అందించిందన్నారు. పేదలకు కార్పొరేట్‌ వైద్యం, పేద విద్యార్థుల చదువులకు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చిన విషయాలను గుర్తుచేశారు. 


రైతు డిక్లరేషన్‌లోని అంశాలు..

  • ఇందిరమ్మ రైతు భరోసా పథకం ప్రవేశపెట్టి రైతులకు ఎకరానికి రూ.15 వేల చొప్పున పెట్టుబడి సాయం అందజేత. కౌలు రైతులకు కూడా రూ.15 వేల సాయం 
  •  ఉపాధి హామీ పథకంలో నమోదు చేసుకున్న భూమిలేని రైతుకూలీలకు ఏటా 12 వేల చొప్పున చెల్లింపు
  • రైతు కూలీలు, భూమిలేని రైతులకు కూడా ‘రైతుబీమా’ పథకం వర్తింపు
  • వరికి మద్దతు ధర రూ.2500కు పెంచి ప్రభుత్వం తరఫునే కొనుగోలు
  • ఇతర ప్రధాన పంటలతోపాటు ఇప్పటిదాకా మద్దతు ధరలేని మిర్చి, పసుపు, ఎర్రజొన్న, చెరుకు పంటలకు కూడా మద్దతు ధర
  • అన్ని పంటల ఉత్పత్తులనూ కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ధర కల్పించి కొనుగోలు
  • రైతు సమస్యల శాశ్వత పరిష్కారం కోసం చట్టబద్ధమైన ‘రైతు కమిషన్‌’ను ఏర్పాటు 
  • ‘ధరణి’ పోర్టల్‌ను రద్దు చేసి సరళతరమైన సరికొత్త రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు
  • పోడు రైతులకు యాజమాన్య హక్కు పట్టా అందజేత
  • అసైన్డ్‌ భూముల లబ్ధిదారులకు భూమిపై యాజమాన్య హక్కులు, క్రయ- విక్రయ హక్కులు
  • నకిలీ విత్తనాలు, పురుగు మందుల నియంత్రణకు కఠిన చట్టాలు. బాఽధ్యులపై పీడీ యాక్టు కేసులు 
  • నిర్దిష్ట సమయ ప్రణాళికతో, అవినీతి రహితంగా పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తి. ప్రతి ఎకరానికీ సాగునీరు
  • మూతపడిన చక్కెర కర్మాగారాలను తెరిపించడంతోపాటు పసుపు బోర్డు ఏర్పాటు
  • రైతులపై భారంలేని పంటల బీమా పథకం. 


ప్రజల ఆకాంక్షలకే పెద్దపీట..

గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద పేదలకు 40 లక్షల ఇళ్లు కట్టించిందని రేవంత్‌రెడ్డి తెలిపారు. వాటితోపాటు రాజీవ్‌ స్వగృహలో 43,759 ఇళ్లు, రాజీవ్‌ గృహకల్ప ద్వారా 35,116, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకంలో పట్టణ ప్రాంతాల్లో మరో 27.89 లక్షల ఇళ్లను పేద, మధ్యతరగతి ప్రజలకు నిర్మించి ఇచ్చినట్లు వివరించారు. ఇక ఉమ్మడి రాష్ట్రంలో 35 లక్షల ఎకరాలకు పైచిలుకు అసైన్డ్‌ భూములను దళితులకు పంచగా.. అందులో 14 లక్షల ఎకరాల భూపంపిణీ తెలంగాణలోనే జరిగిందని వెల్లడించారు. 2006లో యూపీఏ ప్రభుత్వం తెచ్చిన ఆర్వోఎ్‌ఫఆర్‌ చట్టం కింద తెలంగాణలో 4.44 లక్షల ఎకరాల పోడు భూములపై గిరిజనులకు హక్కులు కల్పించిన విశ్వసనీయత కాంగ్రెస్‌ పార్టీదని తెలిపారు. నేటి తరానికి ఏకైక ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ పార్టీని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిలబెట్టారని, జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ వేసిన బాటలో పయనిస్తూ రాజకీయ ఆకాంక్షల కంటే ప్రజల ఆకాంక్షలకే పెద్దపీట వేస్తున్నారని అన్నారు. తెలంగాణ స్వరాష్ట్ర కలను సోనియాగాంధీ నిజం చేయడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.  కాగా, డిక్లరేషన్‌లోని అంశాలను రేవంత్‌రెడ్డి చదువుతున్నప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన కనిపించింది.  ఆ స్పందనతో రేవంత్‌ రెడ్డి డిక్లరేషన్‌ చదువుతున్నంతసేపూ రాహుల్‌గాంధీ ఆసక్తిగా గమనించారు. 




టీఆర్‌ఎ్‌సను గద్దె దించడానికే రాహుల్‌ వచ్చారు: రేవంత్‌రెడ్డి 

రాష్ట్రంలో కేసీఆర్‌ పాలనను అంతమొందించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి  పిలుపునిచ్చారు. టీఆర్‌ఎ్‌సను గద్దె దించడానికే రాహుల్‌గాంధీ ఇక్కడికి వచ్చారని, ఆయనతో కలిసి పనిచేద్దామని కాంగ్రెస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. ‘‘పార్లమెంటులో తలుపులు మూసి, లైవ్‌లు కట్‌చేసి సోనియా తెలంగాణ ఇచ్చారని ప్రధాని మోదీ చెప్పారు. అవును నిజమే.. సోనియా నాలుగు కోట్ల ప్రజల కోసం, ప్రపంచం ఏకమైనా, పార్లమెంటులో పెప్పర్‌ స్ర్పేలు కొట్టినా, పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు. 60 ఏళ్ల ఆకాంక్ష అయిన తెలంగాణను ఒకవేళ ఆమె ఇవ్వకపోయి ఉంటే వందేళ్లయినా మన కల నెరవేరకపోయేది’’ అని రేవంత్‌ అన్నారు.  ‘‘నాలుగు కోట్ల ప్రజల జీవితాలు బాగు చేయాలని సోనియా తెలంగాణ ఇస్తే.. వారంతా నాలుగు కుటుంబాల చేతిలో బందీ అయ్యారు. ప్రపంచంలో శ్రీమంతుడు కావడానికి నిజాం నవాబుకు 200 ఏళ్లు పట్టింది. కానీ, కేసీఆర్‌ వారసులు ఎనిమిదేళ్లలోనే విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. రాష్ట్రంలో ఎవరికీ మేలు జరగలేదు. కన్నీళ్లు, కష్టాలు, చావులు, ఆత్మహత్యలు రాష్ట్రంలోని ఏ పల్లెకు వెళ్లినా, ఏ గూడేనికి వెళ్లినా కనిపిస్తున్నాయి. ఒక తరాన్ని కేసీఆర్‌ దోచుకున్నారు’’ అని రేవంత్‌ ధ్వజమెత్తారు. 

Read more