జిల్లాలో పాజిటివ్‌ 15 కేసులు

ABN , First Publish Date - 2020-04-03T11:43:26+05:30 IST

కట్టడికి అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. పరిస్థితి గాడి తప్పకుండా వ్యవహరిస్తోంది.

జిల్లాలో  పాజిటివ్‌ 15 కేసులు

 పెరిగిన మరో కరోనా కేసు

క్వారంటైన్‌లకు భారీగా తరలింపు

అనుమానితులందరికీ వైద్య పరీక్షలు 

రెడ్‌జోన్లపై ఎప్పటికప్పుడు సమీక్ష 

తెలంగాణ గీత దాటేందుకు ప్రయత్నాలు 

టి.నరసాపురంలో నలుగురు పట్టివేత 


కట్టడికి అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. పరిస్థితి గాడి తప్పకుండా వ్యవహరిస్తోంది. ముందుజాగ్రత్త చర్యగా ఢిల్లీతో లింక్‌ ఉండి.. బాధితులతో సన్నిహితంగా మెలిగిన వారిని, వారి బంధువులను మూడో రోజు క్వారంటైన్‌కు తరలించారు. అధికారుల కళ్లు గప్పి బంధువుల ఇంట ఆశ్రయం పొందిన వారినీ వదల్లేదు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి పది గంటలకు విడుదలైన హెల్త్‌ బులిటెన్‌లో పాజిటివ్‌ కేసుల సంఖ్య మరొకటి పెరిగింది.


ఈ సంఖ్య 14 నుంచి 15కు చేరింది. కరోనా అనుమానితులు ఏలూరు ఆశ్రం మెడికల్‌ కళాశాలకు భారీ సంఖ్యలో చేరారు. వారికి అన్ని వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చారు. పాజిటివ్‌ వచ్చిన వారి వ్యక్తిగత స్వస్థలాలన్నింటిలోనూ శానిటేషన్‌ కొనసాగిస్తు న్నారు. మిగతాచోట్ల లాక్‌ డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. రోడ్ల మీదకు వచ్చే వారి సంఖ్య తగ్గింది. 


(ఏలూరు-ఆంధ్రజ్యోతి ప్రతినిధి):జిల్లాలో తాజాగా విడుదలైన మెడికల్‌ బులిటెన్‌ ప్రకారం పాజిటివ్‌ కేసుల సంఖ్య 15కు చేరింది. ఈ రోజు ల్యాబ్‌లో చేసిన పరీక్షల రిపోర్టులు బహిర్గతం కావాల్సి ఉంది.  ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో పాజిటివ్‌ కేసులు గా గుర్తించిన వారందరినీ ఐసోలేషన్‌లో ఉంచి వైద్య సేవలందిస్తున్నారు. ప్రస్తుతం వీరి ఆరోగ్యం నిలకడగా ఉంది. వీరికి సన్నిహితంగా మెలిగిన వారు, రక్త సంబంధీకులు, బంధు వులను క్వారంటైన్‌లో చేరుస్తున్నారు. ఆశ్రం మెడికల్‌ కళాశాల ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తొలుత వీరికి వైద్య సేవలు అందించేందుకు కొన్ని ఆటంకాలు ఎదురైనా గురువారం వీటిలో కొన్నింటిని అధిగమించారు.


జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు, డీఎంహెచ్‌వో బి.సుబ్రహ్మణ్యేశ్వరి సహా కొవిడ్‌ ఆసుపత్రుల నిర్వహణ తీరును పర్యవేక్షిస్తున్నారు. తమకు అందుతున్న ఫిర్యాదులను పరిష్కరిస్తున్నారు. కొందరు అవగాహన లోపంతో తక్షణ వైద్య సేవలపై అనుమానాలు వ్యక్తం చేయగా, వీటిని నివృత్తి చేశారు. వైద్య సదుపాయాలను మెరుగుపరచారు. కళాశాల సిబ్బంది కోరుకు న్నట్టు మాస్కులతోపాటు, ఇంకొన్నింటిని సమ కూర్చారు. శుక్రవారానికి పూర్తిగా అన్ని సమ కూరుస్తామని హామీ ఇచ్చారు. మిగతా క్వారం టైన్‌లోనూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తు న్నారు. కొవ్వూరు, పాలకొల్లు, తాడేపల్లిగూడెం లోవున్న క్వారంటైన్లలో రోజు వారీ నివేదికలపై సమీక్షిస్తున్నారు. 


క్వారంటైన్‌లకే అనుమానితులు 

జిల్లాలో ప్రత్యేక విభాగాలను గుర్తించిన కరోనా అనుమానితులందరినీ క్వారంటైన్‌లోకి చేరుస్తున్నారు. ఆకివీడులో 77 మందిని గుర్తించి, వారిని నివాసంలోనే క్వారంటైన్‌లో ఉండేలా ఆదేశాలు జారీ చేసి, వారి చేతులపై స్టాంపులు వేస్తున్నారు. క్వారంటైన్‌కు సూచికగా ఎక్కడికక్కడ నోటీసులు అందిస్తున్నారు. ఆకివీడులో ఈ మధ్యనే కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. దీని దృష్ట్యా అక్కడ ముందస్తు జాగ్రత్తలను తీసుకున్నారు. ప్రత్యేకించి అనుమానితులు వైద్య పరీక్షలు నిర్వహిస్తు న్నారు. భీమవరంలో 22 మంది మత పెద్దలను క్వారంటైన్‌కు తరలించారు. వీరంతా ఢిల్లీకి వెళ్లి వచ్చినట్టు స్థానికులు సమాచారం అందించ డంతో క్వారంటైన్‌కు చేర్చారు. గోపాలపురంలో ఢిల్లీ నుంచి వచ్చిన ఒకరు బంధువుల ఇంట ఉండగా, స్థానికుల ఫిర్యాదుతో అధికారులు కదిలారు. ఆయనను గోపాలపురం నుంచి ఆశ్రం ఆసుపత్రి క్వారంటైన్‌ చేశారు. నిడదవో లులో పంజాబ్‌ నుంచి వచ్చిన ముగ్గురు లారీ డ్రైవర్లు వీధుల్లో తిరుగుతుండగా నిడదవోలు క్వారంటైన్‌కు పంపారు.


ఉండిలో మరో 50 మందిని క్వారంటైన్‌ చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆశ్రం ఆసుపత్రిలో క్వారంటైన్‌లో వారి సంఖ్య వందకుపైగా ఉంది. కొవ్వూరు క్వారంటైన్‌కు పెనుగొండకు చెందిన ఆరుగురిని ఉంచారు. ఇలా ఎక్కడికక్కడ అనుమానితులను హోం క్వారంటైన్‌లకు తరలించి పరిస్థితి అదుపు తప్పకుండా కట్టడి చేస్తున్నారు. తెలంగాణ సరిహద్దులు దాటేందుకు కొందరు అర్ధరాత్రి, తెల్లవారు జామున ప్రయత్నిస్తూనే ఉన్నారు. హైదరాబాద్‌ నుంచి కారులో నలుగురు తెలంగాణ సరిహద్దు దాటి జీలుగుమిల్లి దాటి టి.నరసాపురం మండలం లంకలపల్లిలో పోలీసులకు పట్టుబడ్డారు. వారు ప్రయాణిస్తున్న కారును సీజ్‌ చేసి, అందులో ప్రయాణిస్తున్న నలుగురిపై కేసు నమోదు చేశారు. 


రెడ్‌ జోన్‌లపై అటెన్షన్‌ 

ఏలూరు, భీమవరం ప్రాంతాల్లో విధించిన రెడ్‌జోన్ల పరిధిల్లో ఎలాంటి పారిశుధ్య పనులు చేస్తున్నారు. ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారా ? అనే దానిపై సమీక్షిస్తున్నారు. ఆ ప్రాంతాల్లోకి రాకపోకలను నిలిపివేశారు. పారిశుధ్య సిబ్బందిని అప్రమత్తం చేశారు. స్థానికులెవరూ వీధుల్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇదే సమయంలో రెడ్‌జోన్‌ సమీప ప్రాంతాల్లోనూ పారిశుధ్య లేమి ఉన్నట్లు భావిస్తున్నారు. అక్కడకు వెళ్లేందుకు సిబ్బంది వెనుకంజ వేయడంతో ఈ పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ తాగు నీరు, ఇతర నిత్యావసర వస్తువులు వారందరికీ అందుబాటులో ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.


Updated Date - 2020-04-03T11:43:26+05:30 IST