జూన్‌లో 15 లక్షలు?

ABN , First Publish Date - 2020-05-27T07:43:04+05:30 IST

‘‘వ్యాక్సిన్‌ వచ్చేదాకా.. మనమంతా కరోనాతో సహజీవనం సాగించాల్సిందే..!’’ ప్రధాని నరేంద్ర మోదీ మొదలు.. దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్పిన మాట ఇది. కరోనాతో సహజీవనం మాట ఎలా ఉన్నా.. లాక్‌డౌన్‌ సడలింపులు, వలస కార్మికులు...

జూన్‌లో 15 లక్షలు?

  • భారత్‌లో 10 రెట్లు కానున్న కేసులు
  • తీవ్రంగా విజృంభించనున్న వైరస్‌ 
  • సడలింపులు, వలసలతో ముప్పు
  • విమానాల పునరుద్ధరణతో జటిలం
  • సీసీఎంబీ, డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక
  • గత వారం రోజుల్లో 45 వేల కేసులు
  • మంగళవారం కొత్తగా 6,535 

‘‘వ్యాక్సిన్‌ వచ్చేదాకా.. మనమంతా కరోనాతో సహజీవనం సాగించాల్సిందే..!’’ ప్రధాని నరేంద్ర మోదీ మొదలు.. దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్పిన మాట ఇది. కరోనాతో సహజీవనం మాట ఎలా ఉన్నా.. లాక్‌డౌన్‌ సడలింపులు, వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్తుండడం.. దేశీయ విమాన ప్రయాణాలు పునఃప్రారంభమవ్వడంతో భారత్‌లో కొవిడ్‌-19 కేసుల సంఖ్య అసాధారణ రీతిలో పెరిగే ప్రమాదముందని సీసీఎంబీ, డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిస్తున్నాయి. సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) డైరెక్టర్‌ రాకేశ్‌మిశ్రా అంచనా ప్రకారం.. జూన్‌ నెలలో కేసుల సంఖ్య 10 రెట్లు పెరిగే ప్రమాదముంది. అంటే.. ఒక్క జూన్‌ నెలలోనే దేశవ్యాప్తంగా 15 లక్షలకు పైగా కేసులు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.


అంటే.. రోజుకు సగటున 50 వేల కేసులను దేశం ఎదుర్కోనుంది. ఇది ప్రమాద సంకేతమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నా.. లాక్‌డౌన్‌ ఒక్కటే పరిష్కారం కాదని చెబుతున్నారు. ‘‘జూన్‌, జూలై నెలల్లో మనం క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటాం. వస్తువుల నుంచి కూడా మనుషులకు వైరస్‌ వాపిస్తోంది. కానీ, చాలా కేసుల్లో మనుషుల నుంచి మనుషులకు దాని వ్యాప్తి వేగంగా ఉంది. కరోనా పరీక్షలకు చవక ధరకు లభించే కిట్లను తయారు చేస్తున్నాం. అవి అందుబాటులోకి వస్తే.. ఒకేసారి 20వేల పరీక్షలు చేసే వీలుంటుంది’’ అని ఆయన ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’కి వివరించారు. డబ్ల్యూహెచ్‌వో కూడా.. కొవిడ్‌-19 మొదటి వెల్లువ(ఫ్‌స్టవేవ్‌) ఇంకా ముగియలేదని తెలిపింది. బ్రెజిల్‌, భారత్‌లో కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయని చెప్పింది. రెండో వెల్లువ(సెకండ్‌ వేవ్‌) ప్రారంభమైతే.. పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందని హెచ్చరించింది. కొవిడ్‌-19 రోగుల్లోని శరీరావయవాల్లో ఎక్కడో నిగూఢంగా పాగావేసుకునే కరోనా వైరస్‌.. ఆ తర్వాత బలం పుంజుకుని, మళ్లీ విజృంభించే అవకాశాలున్నాయని డబ్ల్యూహెచ్‌వో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మైక్‌ రియాన్‌ అన్నారు.


వారంలో 45వేల కేసులు..

మార్చి మొదటి వారం నుంచి మంగళవారానికి దేశవ్యాప్తంగా నమోదైన కొవిడ్‌-19 కేసుల సంఖ్య 1.51 లక్షలుగా, మరణాలు 4,313గా ఉండగా.. గడిచిన వారం రోజుల్లో.. అంటే ఈ నెల 20 నుంచి 26 వరకు నమోదైన కేసులు సుమారు 45 వేలు. మరణాలు 1,016. లాక్‌డౌన్‌ 4.0 తర్వాత ఇచ్చిన సడలింపులతో వలస స్వస్థలాలకు వెళ్తుండడంతో.. గ్రామాల్లోనూ కరోనా కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్‌-19 కేసుల చరిత్రే లేని ప్రాంతాల్లోనూ ఆ వ్యాధి ప్రబలుతోంది. దేశీయ విమాన ప్రయాణాలు ప్రారంభమవ్వడంతో.. వైరస్‌ వ్యాప్తి మరింత విస్తరించే ప్రమాదముందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.


తూర్పు భారతంలోనూ..

దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో సింహభాగం మహారాష్ట్ర, గుజరాత్‌ల్లో ఉన్నాయి. వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్తుండటంతో.. ఇప్పుడు తూర్పు భారతంలోనూ కేసులు విజృంభించే ప్రమాదముందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తక్కువ కేసులు ఉన్న ఈశాన్య భారతంలోనూ వలస కార్మికులు, విమాన, రైలు ప్రయాణాల పునరుద్ధరణతో కరోనా పాజిటివ్‌ల సంఖ్య పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.


సెంట్రల్‌ డెస్క్‌

Updated Date - 2020-05-27T07:43:04+05:30 IST