15 గంటల విచారణ

ABN , First Publish Date - 2022-07-12T10:09:07+05:30 IST

మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు..

15 గంటల విచారణ

  • ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావును ఎస్‌వోటీ కార్యాలయంలో విచారించిన ఏసీపీ
  • వైద్య పరీక్షలు చేయించి జడ్జి ముందుకు!
  • 15 రోజుల రిమాండు .. చర్లపల్లి జైలుకు 


హైదరాబాద్‌ సిటీ/వనస్థలిపురం/హైదరాబాద్‌, జూలై 11 (ఆంధ్రజ్యోతి): మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆయన్ను సరూర్‌నగర్‌ ఎస్‌వోటీ కార్యాలయంలో 15 గంటలపాటు విచారించినట్లు సమాచారం. బాఽధిత దంపతులు నాగేశ్వరరావుకు ఎప్పుడు పరిచయమయ్యారు? క్రెడిట్‌ కార్డు సంస్థలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేసి.. కార్డు క్లోనింగ్‌ కేసులో అరెస్టయిన బాఽధితురాలి భర్త రంగారెడ్డిని తన ఫామ్‌హౌజ్‌లో పనికి పెట్టుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది? అనే విషయాలపై విచారణలో భాగంగా వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి ఆరా తీసినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో నాగేశ్వరరావు బారి నుంచి తప్పించుకు పారిపోయిన బాధితులు తమతోపాటు అతడి రెండు మొబైల్‌ఫోన్లనూ తీసుకెళ్లి ఇబ్రహీం పట్నం చెరువులో పడేసినట్లు చెప్పారు. దీనివల్ల అతడి మొబైల్‌ ఫోన్ల నుంచి సమాచారం సేకరించే అవకాశం లేకుండా పోవడంతో.. పోలీసులు నాగేశ్వరరావు కాల్‌డేటాపై దృష్టి సారించారు. బాధితురాలికి అతడు ఎప్పటి నుంచి కాంటాక్టులో ఉన్నాడు? ఎన్నిసార్లు ఫోన్‌ చేశాడు? ఆమె భర్తతో ఎన్నిసార్లు మాట్లాడాడు? ఎన్నిసార్లు ఫోన్‌ నంబర్‌ లొకేషన్స్‌ తీసుకున్నాడు. ఇప్పటి వరకూ ఎన్నిసార్లు బాధిత మహిళ ఇంటికి వెళ్లాడు? తదితర అంశాలపై రాచకొండ పోలీసులు ఆరా తీస్తున్నారు. 


నాగేశ్వరరావు ఎక్కడెక్కడ పొలాలు, ఆస్తులు ఎప్పుడు కొన్నాడు? ఫామ్‌ హౌజ్‌ను ఎప్పుడు నిర్మించాడు? బాధిత దంపతులను టాస్క్‌ఫోర్‌ కార్యాలయానికి బలవంతంగా తీసుకెళ్లిన ఎస్సై, కానిస్టేబుళ్లు ఎవరు? ఎప్పుడు తీసుకెళ్లారు? గంజాయి ప్యాకెట్లు చేతిలో పెట్టి ఫొటోలు, వీడియోలు తీసి వారిచేత ఏమని రాయించుకున్నారు? తదితర ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నించారు.  విచారణ అనంతరం సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించి.. న్యాయమూర్తి ముందు హాజరుపరచగా 15 రోజుల రిమాండు విధించారని, అక్కడి నుంచి అతడిని చర్లపల్లి జైలుకు తరలించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా.. నాగేశ్వరరావును కాపాడేందుకు పోలీసు శాఖలోని అధికారులు ప్రయత్నిస్తున్నారని మహిళా స్వరాజ్‌ సంస్థ ఆరోపించింది. అతడిపై కేసు నమోదు చేసినట్లు చెబుతున్న పోలీసులు.. నాగేశ్వరరావుకు సహకరించిన ఇతర పోలీసులపై కేసులను నమోదు చేయడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని సంస్థ ప్రతినిధులు వర్షా, శిల్పి టండన్‌ ప్రశ్నించారు. ’’


ప్రాణహాని.. భద్రత కల్పించండి

నన్ను, నా కుటుంబాన్ని నాలుగేళ్లుగా వేధిస్తున్న ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావుపై కఠిన చర్యలు తీసుకోవాలి. అతనితో మాకు ప్రాణహాని ఉంది. ఓ కేసులో నన్ను అక్రమంగా ఇరికించి అతని ఫామ్‌హౌజ్‌లో పనోడిని చేశాడు. నా భార్యపై కన్నేసి అత్యాచారం చేశాడు. అతణ్ని ఎన్‌కౌంటర్‌ చేయాలి. అప్పుడే మాకు న్యాయం జరుగుతుంది. ఇన్‌స్పెక్టర్‌ వల్ల ప్రాణహాని ఉన్నందున ఉన్నతాఽధికారులు మాకు భద్రత కల్పించాలి.

- బాధితుడు రంగారెడ్డి

Updated Date - 2022-07-12T10:09:07+05:30 IST