15 అంతస్తులు, 90 ప్లాట్‌ఫామ్స్‌తో తిరుపతిలో ఇంటర్‌ మోడల్‌ బస్‌ స్టేషన్‌

ABN , First Publish Date - 2022-08-12T07:08:20+05:30 IST

తిరుపతిలో నిర్మించ తలపెట్టిన ఇంటర్‌ మోడల్‌ బస్‌ స్టేషన్‌లో 15 అంతస్తుల అధునాతన భవనం, 90 ప్లాట్‌ఫామ్స్‌ ఉంటాయని ప్రజా రవాణా సంస్థ (పీటీడీ) జోన్‌-4 (కడప) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ) గోపీనాథ్‌రెడ్డి వెల్లడించారు.

15 అంతస్తులు, 90 ప్లాట్‌ఫామ్స్‌తో   తిరుపతిలో ఇంటర్‌ మోడల్‌ బస్‌ స్టేషన్‌
ఫొటోలను వీక్షిస్తున్న ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గోపీనాథ్‌రెడ్డి తదితరులు

- పీటీడీ ఈడీ గోపీనాఽథ్‌రెడ్డి వెల్లడి

తిరుపతి(కొర్లగుంట), ఆగస్టు 11: తిరుపతిలో నిర్మించ తలపెట్టిన ఇంటర్‌ మోడల్‌ బస్‌ స్టేషన్‌లో 15 అంతస్తుల అధునాతన భవనం, 90 ప్లాట్‌ఫామ్స్‌ ఉంటాయని ప్రజా రవాణా సంస్థ (పీటీడీ) జోన్‌-4 (కడప) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ) గోపీనాథ్‌రెడ్డి వెల్లడించారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా తిరుపతి సెంట్రల్‌ బస్‌ స్టేషన్‌ (సీబీఎస్‌) ఆవరణలో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర సమరయోధులు, పోరాటాల సన్నివేశాలతో కూడిన ఫొటో ఎగ్జిబిషన్‌ను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఈడీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో తిరుపతి, ఆటోనగర్‌ (విజయవాడ), విశాఖలో ఇంటర్‌ మోడల్‌ బస్‌ స్టేషన్లను నిర్మించడానికి ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపిందన్నారు. దాంతో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ స్టేషన్లను నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. తిరుపతి సీబీఎ్‌సలోని 10.87 ఎకరాల్లో అండర్‌ గ్రౌండ్‌ మూడు, ఆపైన 12 మొత్తం 15 అంతస్తులతో బస్‌ స్టేషన్‌ నిర్మించనున్నామన్నారు. ఇందులో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన షాపింగ్‌మాల్స్‌, సినిమాహాల్స్‌, రైల్వేస్టేషన్‌కు అనుసంధానం చేస్తూ ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిలు ఉంటాయని వివరించారు. ఇదివరకు రూపొందించిన నమూనాలో 75 ప్లాట్‌ఫామ్స్‌ ఉండడంతో అధికంగా బస్సులు వస్తే ఇబ్బంది లేకుండా ఈ సంఖ్యను 90కి పెంచే ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఆ తర్వాత నమూనా రూపొందించి నిర్మాణ అంచనాలను ఖరారు చేస్తామన్నారు. తిరుపతిలో శ్రీనివాససేతు పూర్తవగానే 30 ఇంటర్‌సిటీ సర్వీసులను ప్రవేశ పెడతామన్నారు. ఇక ఎలక్ర్టిక్‌ బస్సులను  రీమోడల్‌ చేయాలని కోరామని, దాంతో ఆలస్యమవుతోందన్నారు. అంతకుముందు జిల్లా ప్రజా రవాణాధికారి  చెంగల్‌రెడ్డి ఈ ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించి, ప్రయాణికులను కూడా సందర్శించాలని కోరారు. డిప్యూటీ సీటీఎం భాస్కర్‌రెడ్డి, సీబీఎస్‌ ఏటీఎం రామచంద్రనాయుడు, డిపో మేనేజర్‌ బాలాజి, సెక్యూరిటీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-12T07:08:20+05:30 IST