15 జిల్లాలకు వర్షసూచన

ABN , First Publish Date - 2022-05-18T12:56:15+05:30 IST

ఉత్తర తమిళనాడును ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. కర్ణాటక మీదుగా కొనసాగుతున్న ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని 15 జిల్లాల్లో

15 జిల్లాలకు వర్షసూచన

                       - బురదమయంగా ఊటీ గార్డెన్‌


ప్యారీస్‌(చెన్నై): ఉత్తర తమిళనాడును ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. కర్ణాటక మీదుగా కొనసాగుతున్న ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని 15 జిల్లాల్లో మంగళవారం ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. గురువారం వరకు తిరుప్పూర్‌, తేని, దిండుగల్‌, తెన్‌కాశి, ఈరోడ్‌ సహా 15 జిల్లాల్లో పలు చోట్ల పిడుగులు, ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం వేగంగా కదులుతున్న నేపథ్యంలో, ప్రముఖ పర్యాటక ప్రాంతమైన నీలగిరి జిల్లాలో కురుస్తున్న భారీవర్షాలతో స్థానికులతో పాటు పర్యాటకులు కూడా ఇబ్బందులపాలవుతున్నారు. వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా ఈ జిల్లాలో గత వారం రోజులుగా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. వేసవి సీజన్‌లో ఊటీలో సేదతీరేందుకు తరలివెళ్లిన పర్యాటకులు ఆ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. బొటానికల్‌ గార్డెన్‌, బోట్‌హౌస్‌, షూటింగ్‌ స్పాట్‌, పైకార డ్యాం ప్రాంతాల్లో వర్షానికి తోడు మంచు కురుస్తోంది. సోమవారం కురిసిన భారీవర్షాలతో భద్రతను దృష్టిలో ఉంచుకొని బోట్‌హౌస్ లో పడవ సవారీ నిలిపివేశారు. ప్రభుత్వ బొటానికల్‌ గార్డెన్‌లో పుష్ప ప్రదర్శన కోసం సుమారు 35 వేల పూలకుండీల్లో నాటిన మొక్కలు వికసించాయి. వాటిని తిలకించేందుకు పర్యాటకులు బురదలోనే తిరుగుతున్నారు. వర్షానికి తడిసి పూలమొక్కలు పాడవకుండా ఉద్యానవన శాఖ అధికారులు వాటిపై పాలిథిన్‌ కవర్లు కప్పి పర్యవేక్షిస్తున్నారు.

Updated Date - 2022-05-18T12:56:15+05:30 IST