15రోజుల్లోనే డబుల్‌

ABN , First Publish Date - 2020-07-05T08:40:19+05:30 IST

రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత పరిస్థితి క్రమంగా చేయి దాటిపోతోంది. 15రోజుల్లోనే పాజిటివ్‌ కేసుల సంఖ్య రెట్టింపయింది.

15రోజుల్లోనే డబుల్‌

  • రికవరీలోనూ రివర్స్‌ ట్రెండ్‌
  • పెరిగిపోతున్న కేసులు, మరణాలు
  • రాష్ట్రంలో కరోనా ప్రమాద ఘంటికలు 
  • దేశంలో యాక్టివ్‌  కేసులు తక్కువ
  • రికవరీ రేటు ఎక్కువగా నమోదు
  • మన దగ్గరేమో భిన్నమైన పరిస్థితి


(అమరావతి-ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత పరిస్థితి క్రమంగా చేయి దాటిపోతోంది. 15రోజుల్లోనే పాజిటివ్‌ కేసుల సంఖ్య రెట్టింపయింది. ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తి వీధిలో నుంచి నట్టింట్లోకి వచ్చేసింది. సీఎం క్యాంపు కార్యాలయంలో ఒకేరోజు పది కేసులు నమోదవడం కొవిడ్‌ వ్యాప్తి తీవ్రతకు నిదర్శనం. లాక్‌డౌన్‌లో స్వీయ జాగ్రత్తలు పాటించకపోవడం, అన్‌లాక్‌ మొదలుపెట్టిన తర్వాత కరోనా నియంత్రణకు పకడ్బందీ చర్యలు ఆచరణాత్మకంగా లేకపోవడంతో కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. కరోనా బారినపడి శనివారం ఒక్కరోజే 12మంది మరణించడం తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసుల నుంచి కోలుకుంటున్న వారికంటే, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉండటం ఆందోళనకరమని వైద్యవర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 1,12,85,519 కేసులు నమోదవగా 5,30,947మంది మరణించారు. వైరస్‌ నుంచి కోలుకున్నవారు 63,63,696 మంది కాగా యాక్టివ్‌ కేసులు 43,26,365 ఉన్నాయి. ఈ గణాంకాలను పరిశీలిస్తే యాక్టివ్‌ కేసుల కన్నా రికవరీ రేటు 20 శాతానికి పైగానే ఉంది. మన దేశంలో మొత్తం 6,50,431 కేసులకు గాను 18,669మంది మరణించారు. 3,94,411మంది కోలుకోగా, 2,37,351 యాక్టివ్‌ కేసులున్నాయి. కానీ రాష్ట్రంలో మాత్రం రికవరీ రేటు పడిపోతూ, యాక్టివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. 


మహారాష్ట్రలో రికవరీ రేటు 54.24%, యాక్టివ్‌ కేసులు 41.4%, తమిళనాడులో రికవరీ 56.83%, యాక్టివ్‌ కేసులు 41.82%, ఢిల్లీలో రికవరీ రేటు 69.31%, యాక్టివ్‌ కేసులు 27.61%గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో రికవరీ రేటు 45.25%కాగా, యాక్టివ్‌ కేసుల శాతం 53.52. నెలక్రితం ఇది 56శాతంగా ఉండేది. చికిత్స, డిశ్చార్జికి సంబంధించిన మార్గదర్శకాలు మారిన తర్వాత కూడా ఏపీలో రికవరీ రేటు భారీగా తగ్గుతూ, యాక్టివ్‌ కేసులు పెరిగిపోతుండటం ఆందోళనకరమైన అంశమని వైద్యవర్గాలు చెబుతున్నాయి. వైరస్‌ కట్టడి చర్యలను కట్టుదిట్టంగా అమలు చేస్తూ పరీక్షలు నిర్వహిస్తే కొత్త కేసుల సంఖ్య తగ్గుతుందని, లేకపోతే అంతకంతకూ తీవ్రత పెరిగిపోతుందని వ్యాఖ్యానిస్తున్నాయి. 28రోజుల్లో కొత్త కేసులు, మరణాలు రెట్టింపయితే అది ప్రమాదకర పరిస్థితిగా పేర్కొంటున్నారు. యాక్టివ్‌ కేసులు తగ్గుతూ డిశ్చార్జిలు పెరిగితే కరోనా కట్టడిలో ముందడుగు వేసినట్లే అని కేంద్రం జూన్‌ మొదటివారంలో ఇచ్చిన మార్గదర్శకాల్లో పేర్కొంది. అయితే, రాష్ట్రంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. కేవలం 15రోజుల్లోనే రెట్టింపు కేసులు నమోదయ్యాయి. కేంద్రం చెబుతున్న 28రోజుల ప్రామాణికతను తీసుకుంటే ఏపీలో కొత్త కేసులు 400శాతం పెరిగాయి. ఇక మరణాలు కూడా 300శాతం మేర పెరగడంపై వైద్యవర్గాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. మరణాలు ఒక్కసారిగా పెరగడం ప్రమాదకర పరిస్థితి నెలకొంటోందనడానికి సంకేతమని అధికారులు పేర్కొంటున్నారు.

Updated Date - 2020-07-05T08:40:19+05:30 IST