కరోనా ముట్టడి!

ABN , First Publish Date - 2020-07-12T10:40:49+05:30 IST

జిల్లాను కరోనా ముట్టడించేసింది. ఏకంగా శనివారం ఒక్కరోజే జిల్లావ్యాప్తంగా 149 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అంతేగాక

కరోనా ముట్టడి!

శనివారం ఒక్కరోజే 149 పాజిటివ్‌లు

టీడీపీ సీనియర్‌ నేతతోపాటు మరో మహిళ మృతి


నెల్లూరు (వైద్యం), జూలై 11 : జిల్లాను కరోనా ముట్టడించేసింది. ఏకంగా శనివారం ఒక్కరోజే జిల్లావ్యాప్తంగా 149 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అంతేగాక తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ సీనియర్‌ నాయకుడిని కూడా పొట్టన పెట్టుకుంది. నెల్లూరుకు చెందిన ఆ నేతకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో శుక్రవారం సాయంత్రం నారాయణ ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటికే కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో చికిత్స పొందుతూ శనివారం ఉదయం ఆయన మృతి చెందాడు. ఇక కేసుల విషయానికి వస్తే కరోనా వ్యాప్తి మరింత విజృంభిస్తోంది.


రోజురోజుకు  రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఈ నెల 7వ తేదీన 100 కేసులు నమోదవగా, దీనిని తిరగరాస్తూ శనివారం 149  కేసులు నమోదు కావడం వైద్య వర్గాలను విస్మయానికి గురి చేసింది. కేవలం వారం రోజుల వ్యవధిలో 543 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. లాక్‌డౌన్‌ సడలింపుల కారణంగా కరోనా కేసులు పెరుగుతున్నట్లు వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇంకా 7214 నమూనాల ఫలితాలు రావల్సి ఉండటంతో పాజిటివ్‌ కేసులు మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే నెల్లూరు సంతపేటకు చెందిన 60 ఏళ్ల మహిళ కూడా కరోనా కారణంగా నారాయణ ఆసుపత్రిలో మృత్యువాత పడింది. దీంతో ఇప్పటి వరకు కరోనా కారణంగా 28 మంది మృత్యువుకు గురయ్యారు.


58 మంది డిశ్చార్జ్‌ 

నెల్లూరులోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి 29 మంది, నారాయణ ఆసుపత్రి నుంచి మరో 29 మంది శనివారం డిశ్చార్జి అయ్యారు. 


మహిళా కానిస్టేబుల్‌కు..

నెల్లూరులోని దిశ పోలీసు స్టేషన్‌లో ఓ మహిళ కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో స్టేషన్‌లో విఽధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. స్టేషన్‌తో పాటు పరిసర ప్రాంతాలను శానిటైజేషన్‌ చేశారు.


బాలాయపల్లిలో 12...

మండలంలో 12 కేసులు నమోదయ్యాయి. బాలాయపల్లిలో 7, అంబలపూడిలో 6, తహసీల్దార్‌ కార్యాలయంలో 5, పీహెచ్‌సీలో 2, పోలీసుస్టేషన్‌లో 2 కేసులు నమోదయ్యాయి. వీటిలో 10 కేసులు వెంకటగిరి, చెన్నూరు, నెల్లూరు, గూడూరు ప్రాంతాలకు చెందినవిగా వైద్యాధికారి కల్యాణ్‌ చక్రవర్తి శనివారం తెలిపారు. బాలాయపల్లిలో ఇప్పటివరకు 21 కేసులు నమోదు అయ్యాయి. 


వెంకటాచలంలో ఆరు..

మండలంలో శనివారం ఆరు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మండలంలో ఒక్కసారిగా కలకలం రేగింది.  దీంతో  మండలంలోని ఈదగాలి, కనుపూరు, కసుమూరు గ్రామాలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించిన అధికారులు ఆయా ప్రాంతాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. 

Updated Date - 2020-07-12T10:40:49+05:30 IST